పిట్లం, వెలుగు : మహిళల ఆర్థికాభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు అన్నారు. మంగళవారం బిచ్కుంద మున్సిపాలిటీ పరిధిలోని కందర్పల్లిలో మహిళలకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళల కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు.
వంద సంవత్సరాల వరకు బిచ్కుందలో తాగునీటి సమస్య రాకుండా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిపారు. బిచ్కుందలో అభివృద్ధి పనులకు రూ. 15 కోట్లు మంజూరు చేసి శంకుస్థాపనలు చేశామని గుర్తుచేశారు. దీంతో పాటు వంద పడకల ఆసుపత్రి, మెడికల్ కాలేజీ కోసం స్థలం కేటాయించామని పేర్కొన్నారు. బిచ్కుందను రాష్ట్రంలోనే ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చి దిద్దుతామన్నారు. కార్యక్రమంలో బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి, బిచ్కుంద మున్సిపల్ కమిషనర్ ఖయ్యూం, స్వయం సహాయక సంఘాల మహిళలు పాల్గొన్నారు.
