సంక్షేమం, అభివృద్ధి ప్రభుత్వానికి రెండు కండ్లు : ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి

 సంక్షేమం, అభివృద్ధి ప్రభుత్వానికి రెండు కండ్లు : ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి

తొర్రూరు, వెలుగు: అభివృద్ధి, సంక్షేమం ప్రభుత్వానికి రెండు కండ్లని, తొర్రూరు పట్టణ సమగ్రాభివృద్ధికి అంకితభావంతో కృషి చేస్తున్నామని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి అన్నారు. మంగళవారం ఎమ్మెల్యే రూ.6.75 కోట్లతో నిర్మించిన ధోబి ఘాట్, శ్మశాన వాటిక, మైత్రి భవన్ కమ్యూనిటీ, పద్మశాలీ, స్వామి వివేకానంద, గౌడ సంఘం, నాయీ బ్రాహ్మణ, విశ్రాంత ఉద్యోగుల, ఎస్సీ కమ్యూనిటీ హాళ్లను స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు. 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పలు సామాజిక వర్గాల కమ్యూనిటీ హాళ్ల నిర్మాణంతో ఆయా వర్గాలకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. తొర్రూరును స్వచ్ఛ పట్టణంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. రూ.3 కోట్లతో పెద్ద చెరువును మినీ ట్యాంక్ బండ్ గా అభివృద్ధి పరుస్తున్నామన్నారు. ఈ మున్సిపాలిటీ అభివృద్ధికి మరో రూ. 15 కోట్లు మంజూరయ్యాయని, త్వరలోనే ఆ పనులు ప్రారంభిస్తామని తెలిపారు.

మున్సిపాలిటీ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే రానున్న మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వక్కల శ్యాంసుందర్, టీపీసీసీ మాజీ సభ్యుడు ముత్తినేని సోమేశ్వరరావు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు హమ్యా నాయక్ తదితరులు పాల్గొన్నారు.