కామారెడ్డిలో దారుణం.. ముగ్గురు ఆడబిడ్డలను చెరువులో ముంచి చంపిన తండ్రి

కామారెడ్డిలో దారుణం.. ముగ్గురు ఆడబిడ్డలను  చెరువులో ముంచి చంపిన తండ్రి

కామారెడ్డి/కామారెడ్డి టౌన్, వెలుగు: కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వికాస్‌నగర్‌లో  కనిపించకుండా పోయిన పదేండ్లలోపు ముగ్గురు అక్కాచెల్లెళ్లు దారుణ హత్యకు గురయ్యారు. కన్నతండ్రే ఆ ముగ్గురు చిన్నారి కూతుళ్లను చెరువులో ముంచి చంపినట్లు తేలడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలీసుల ప్రకారం..వికాస్‌నగర్‌కు చెందిన ఇస్మాయిల్, షబీనా దంపతులకు షీపత్‌ (8), అయత్ (7), మరియం (5) అనే ముగ్గురు కుమార్తెలున్నారు.

ఇస్మాయిల్‌ ఆటో నడుపుతూ జీవిస్తున్నాడు. శనివారం ఉదయం 11 గంటలకు తినుబండారాలు కొనిచ్చి పంపిస్తానని పిల్లలను ఇస్మాయిల్‌ తన ఆటోలో తీసుకెళ్లాడు. గంటలు గడిచినా పిల్లలు తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన తల్లి షబీనా.. భర్తను ప్రశ్నించగా.. తాను షాపు దగ్గర వదిలేసి కిరాయికి వెళ్లానని చెప్పాడు.

దీంతో షబానాతో పాటు కుటుంబసభ్యులు పిల్లల కోసం చుట్టుపక్కల వెతికారు. అయినా చిన్నారుల ఆచూకీ దొరకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తులో భాగంగా పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించగా.. పిల్లలను ఇస్మాయిల్ తన ఆటోలో చెరువు వైపు తీసుకెళ్లినట్లు తేలింది. ఇస్మాయిల్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా, ఆర్థిక ఇబ్బందుల వల్లే ముగ్గురు కూతుళ్లను చెరువులో ముంచి చంపినట్లు ఒప్పుకున్నాడు. పోలీసులు చెరువు వద్దకు వెళ్లి.. ఈతగాళ్ల సాయంతో గాలించారు. రాత్రి 11 గంటలకు అయత్, మరియంల మృతదేహాలు లభించగా, షీపత్‌ ఆచూకీ కోసం గాలిస్తున్నారు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి..ఇస్మాయిల్ ను అదుపులోకి తీసుకున్నారు. 

మరో కాలనీలో ఇద్దరు పిల్లలు మిస్సింగ్‌
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని గోసింగి కాలనీలో కూడా ఇద్దరు పిల్లలు అదృశ్యం కావడం స్థానికులను కలవరపెడుతోంది.సింహాద్రి (10), కోదండ విజయ్​ (9) అనే ఇద్దరు బాలురు శుక్రవారం సాయంత్రం ఆడుకోవడానికి బయటకు వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. బంధువుల ఇళ్లలో వెతికినా ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.