విమెన్ సేఫ్టీలో యూత్ ముందుండాలి.. చట్టాలు చేస్తే సరిపోదు, సామాజిక బాధ్యత తీసుకోవాలి: రేవంత్ రెడ్డి

విమెన్ సేఫ్టీలో యూత్ ముందుండాలి.. చట్టాలు చేస్తే సరిపోదు, సామాజిక బాధ్యత తీసుకోవాలి: రేవంత్ రెడ్డి
  • మహిళలు, చిన్నారుల రక్షణకు యువకులు బ్రాండ్‌‌ అంబాసిడర్లు కావాలి
  • సోషల్ మీడియాలో మహిళలపై వేధింపులు పెరిగాయి
  • రాష్ట్రంలో మహిళల అభివృద్ధికి అనేక సంక్షేమ పథకాలు
  • ‘స్టాండ్‌‌ విత్‌‌ హర్‌‌‌‌’ క్యాంపెయిన్‌‌లో వెల్లడి

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: మహిళల రక్షణకు సమాజంలోని ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ‘మహిళల రక్షణ కోసం ప్రభుత్వాలు  చట్టాలు చేయడం, పోలీసులు పర్యవేక్షించడం, మహిళా దినోత్సవం జరుపుకుంటే బాధ్యత తీరిపోయినట్టు కాదు.. మహిళలు, చిన్నారుల రక్షణ ఒక సామాజిక బాధ్యతగా తీసుకున్నప్పుడే పరిష్కారం దొరుకుతుంది.. ఇందుకు యువత ముందుకు రావాలి.’ అని సూచించారు.

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ‘తెలంగాణ విమెన్ సేఫ్టీ వింగ్‌‌‌‌’ ఆధ్వర్యంలో శనివారం జేఎన్‌‌‌‌టీయూలో నిర్వహించిన ‘స్టాండ్ విత్ హర్’ కార్యక్రమానికి సీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ  క్యాంపెయిన్‌‌‌‌కు బ్రాండ్‌‌‌‌ అంబాసిడర్‌‌‌‌‌‌‌‌గా వ్యవహరిస్తున్న నటుడు సాయి దుర్గ తేజ్‌‌‌‌, డీజీపీ శివధర్ రెడ్డి, సీఐడీ చీఫ్‌‌‌‌ చారుసిన్హా సహా మహిళా పోలీస్ అధికారులు, ఐఏఎస్‌‌‌‌ అధికారులతో కలిసి ‘స్టాండ్ విత్ హర్’ బ్రోచర్‌‌‌‌‌‌‌‌ను ఆవిష్కరించారు.

అనంతరం సీఎం మాట్లాడుతూ..  మహిళల రక్షణలో యువకులు ముందుండాలన్నారు. వారి కోసం నిలబడి ప్రశ్నించే తత్వాన్ని పెంపొందించుకోవాలన్నారు. సమస్య వచ్చినపుడు అంతా కలిసి ‘స్టాండ్ విత్ హర్’ అని గట్టిగా నిలబడాలని సూచించారు. ‘గతంలో పట్టణాలు, కొన్ని కాలేజీలు, పబ్లిక్ ప్లేస్​లలో మహిళలు వేధింపులకు గురయ్యేవారు. కానీ మారిన పరిస్థితుల్లో మహిళలపై సోషల్‌‌‌‌ మీడియాలో  వేధింపులు పెరుగుతున్నాయి. 

అందుకే మనల్ని మనం సవరించుకొని మహిళల పట్ల మన బాధ్యతల్ని నెరవేర్చాల్సిన సందర్భం వచ్చింది. మన కుటుంబ సభ్యులకు అవమానాలు జరిగితే ఏ విధంగా స్పందిస్తామో ఇతర ఆడపిల్లల విషయంలోనూ మనం అదే విధంగా ఆలోచించి వారికి అండగా నిలబడాలని రాష్ట్ర ముఖ్యమంత్రిగా సూచనలు చేస్తున్నాను” అని పేర్కొన్నారు.

మహిళ అభద్రత రాష్ట్రానికి గౌరవం కాదు..
సమాజంలో మహిళలు అభద్రతాభావంతో ఇంటి నుంచి బయలుదేరుతున్నారు అంటే.. అది ఏ ఒక్క రాష్ట్ర ప్రభుత్వానికి గౌరవం కాదని సీఎం పేర్కొన్నారు. ఆడపిల్లల రక్షణకు యువకులు బ్రాండ్‌‌‌‌ అంబాసిడర్లుగా నిలవాలని పిలుపునిచ్చారు.“మహిళలు వంటింటి కుందేళ్లుగా కాకుండా అన్ని రంగాల్లో రాణించాలన్నదే మా ప్రభుత్వ ఆకాంక్ష. రాష్ట్రంలోని మహిళలకు సంపూర్ణమైన రక్షణ కల్పించినమని ఎవరైనా భావిస్తే అది అసంపూర్తి రక్షణే అని భావిస్తున్నాను.

అమ్మాయిలు ఇంట్లో నుంచి బయలుదేరినప్పుడు జాగ్రత్తగా ఉండరనో, ఏదైనా తప్పు జరిగితే అమ్మాయిలనే తప్పుబట్టడమో.. మన వ్యవస్థలో వేళ్లూనుకున్న దుష్ట సంప్రదాయం. శక్తిని, అభివృద్ధిని, కుటుంబం గౌరవాన్ని నిలబెట్టడానికి మహిళతోనే పోల్చుతాం.. కానీ అలాంటి మహిళకు రక్షణ కల్పించలేకపోతున్నాము. మహిళలు ప్రతిరోజు అభద్రతాభావంలో ఇంటి నుంచి బయలుదేరుతున్నారు అంటే.. అది ఏ ఒక్క రాష్ట్ర ప్రభుత్వానికి గౌరవం కాదు” అన్నారు.

అదానీ, అంబానీల స్థాయిలో రాష్ట్రంలో మహిళల స్వావలంబన 
‘‘తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక మహిళ నాయకత్వం వహించిన పార్టీ నుంచి ఏర్పడ్డది. లోక్‌‌‌‌సభ మహిళ స్పీకర్‌‌‌‌‌‌‌‌గా బాధ్యతలు నిర్వహించిన మరొక మహిళ తెలంగా ణ రాష్ట్ర ఏర్పాటు బిల్లును అమలు చేసింది. ఈ దేశానికి రాష్ట్రపతిగా, ప్రధానిగా, లోక్‌‌‌‌సభ స్పీకర్‌‌‌‌‌‌‌‌గా వివిధ రాష్ట్రాల్లో సీఎంలుగా మహిళలకు అవకాశం ఇచ్చిన 140 ఏండల్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రాష్ట్ర ప్రజలు అధికారం కట్టబెట్టారు. 

ప్రతిభా పాటిల్, ఇందిరాగాంధీ, సోనియాగాంధీ, మీరాకుమార్ ఇలా చెప్పుకుంటూ పోతే.. స్వతంత్రానికి ముందు స్వతంత్రానికి తర్వాత రాజకీయ పార్టీల్లో మహిళలు అత్యంత బాధ్యతాయుతమైన పదవులను నిర్వర్తించారు” అని సీఎం గుర్తుచేశారు. దేశంలోనే తొలిసారి మహిళా యూనివర్సిటీకి వీరనారి చాకలి ఐలమ్మ పేరు పెట్టామన్నారు.

చీఫ్ సెక్రటరీ సహా కీలక పదవుల్లో మహిళలకు అవకాశాలు కల్పిస్తున్న ప్రభుత్వం తమదేనని వెల్లడించారు. మహిళల ఆర్థిక స్వావలంబనకు రాష్ట్రంలో అనే పథకాలను అమలు చేస్తున్నట్లు వివరించారు.  ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, సోలార్ పవర్ సహా అనేక  ఉత్పత్తి చేసే విద్యుత్ శాఖకు అమ్మే అవకాశం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందని తెలిపారు.

అదానీ, అంబానీల స్థాయిలో విద్యుత్ రంగంలో పోటీ పడే అవకాశం ఇచ్చామని సీఎం వివరించారు. అనంతరం సినీ నటుడు సాయి దుర్గాతేజ్‌‌‌‌ మాట్లాడుతూ.. మహిళలు, చిన్నారులకు రక్షణ కల్పించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. మన తల్లికి ఇచ్చిన గౌరవ, మర్యాదలు ఇతర మహిళలు, యువతులకు ఇవ్వాలని, విమెన్‌‌‌‌ సేఫ్టీ వింగ్‌‌‌‌ చేపట్టిన ‘స్టాండ్‌‌‌‌ విత్‌‌‌‌ హర్‌‌‌‌‌‌‌‌’ క్యాంపెయిన్‌‌‌‌కు యువత ముందుకు రావాలని సూచించారు.