అడ్వర్టైజ్మెంట్లకు  క్యూఆర్ కోడ్..  నిబంధనలు మీరితే మూడింతల ఫైన్, క్రిమినల్ కేసులు

 అడ్వర్టైజ్మెంట్లకు  క్యూఆర్ కోడ్..  నిబంధనలు మీరితే మూడింతల ఫైన్, క్రిమినల్ కేసులు
  • అమల్లోకి కొత్త రూల్స్
  • డిజిటల్ స్క్రీన్లపై కఠిన ఆంక్షలు
  • గోడలపై పోస్టర్లు, స్టిక్కర్లు నిషేధం
  • ఎస్, ఏ, బీ, సీ జోన్​లుగా కోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అర్బన్ రీజియన్
  • ట్రై కార్పొరేషన్​లలో ఒకే విధానం
  • పాలసీ అమలులకు ఎంఏయూడీ ప్రిన్సిపల్ సెక్రటరీ చైర్మన్​గా కమిటీ ఏర్పాటు

హైదరాబాద్ సిటీ, వెలుగు: తెలంగాణ కోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అర్బన్ రీజియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (క్యూర్)లో అనధికారికంగా వెలుస్తున్న ఫ్లెక్సీలు, హోర్డింగ్​లకు చెక్ పెడుతూ రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త అవుట్​డోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అడ్వర్టైజ్​మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాలసీని తీసుకొచ్చింది. జీహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎంసీతోపాటు కొత్తగా ఏర్పడిన సైబరాబాద్ (సీఎంసీ), మల్కాజిగిరి (ఎంఎంసీ) మున్సిపల్​కార్పొరేషన్​లలో పాత నిబంధనలన్నింటినీ రద్దు చేస్తూ తక్షణమే జీవో 84 అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. ఈ విధానం ప్రకారం.. ఇకపై ట్రాఫిక్ రద్దీ, వాణిజ్య విలువ ఆధారంగా క్యూర్​ను ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఏ, బీ, సీ అనే నాలుగు జోన్లుగా విభజించారు. అత్యంత రద్దీగా ఉండే సెంట్రల్ బిజినెస్ జిల్లాలు, ప్రధాన రవాణా మార్గాలు, ప్రీమియం నివాస ప్రాంతాలను ‘జోన్- ఎస్’ (సూపర్ ప్రీమియం) కిందకు తెచ్చారు. కొత్తగా అభివృద్ధి చెందుతున్న కమర్షియల్ ప్రాంతాలను ‘జోన్ -ఏ’గా, నివాస, రిటైల్ దుకాణాలు కలిసిన ప్రాంతాలను ‘జోన్- బీ’గా, రద్దీ తక్కువగా ఉండే సాధారణ నివాస ప్రాంతాలను ‘జోన్ -సీ’గా వర్గీకరించారు. ఆయా ప్రాంతాల ప్రాధాన్యతను బట్టే ప్రకటనల ఫీజులు వసూలు చేయనున్నారు.

ఇక ఇష్టమొచ్చినట్టు కుదరదు..

కోర్ అర్బన్​లో ఇకపై మున్సిపల్ అధికారుల అనుమతి లేకుండా ఎలాంటి ప్రకటన బోర్డులు పెట్టడానికి వీల్లేదు. ఇందుకోసం ఎంఏఅండ్​యూడీ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్ చైర్మన్​గా ఏర్పాటైన అడ్వర్టైజ్​మెంట్ రెగ్యులేటరీ కమిటీ (ఏఆర్​సీ) అనుమతి తప్పనిసరి. ఇందులో ముగ్గురు మున్సిపల్ కమిషనర్లతో పాటు ట్రాఫిక్ పోలీస్, హెచ్ఎండీఏ, రవాణా, పర్యాటక శాఖల ఉన్నతాధికారులు సభ్యులుగా ఉంటారు. ఏఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీ అనుమతి ఉంటేనే పబ్లిక్ స్థలాల్లో హోర్డింగ్​లకు అవకాశం ఉంటుంది. పీపీపీ పద్ధతిలో వేలం (ఆక్షన్) ద్వారా 5 నుంచి 15 ఏండ్ల వరకు అనుమతులు ఇస్తారు. ప్రైవేట్ ప్రాపర్టీలపై స్వీయ ప్రకటనలు, వాహనాలపై యాడ్స్, తాత్కాలిక ప్రకటనల కోసం ఆన్​లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ప్రతి యాడ్ స్పేస్​లో కచ్చితంగా 10 శాతం స్థలాన్ని లేదా సమయాన్ని ప్రభుత్వ, సామాజిక సందేశాలకు కేటాయించాలన్న నిబంధనను కొత్త జీవోలో తప్పనిసరి చేశారు. సౌర శక్తితో (సోలార్ పవర్) పనిచేసే ప్రకటనలకు ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహకాలు అందించనుంది.

రాత్రి 11 తర్వాత డిజిటల్ స్క్రీన్స్​ బంద్  

ట్రై కార్పొరేషన్​లలో ప్రస్తుతం ఎక్కడ పడితే అక్కడ ఇష్టారాజ్యంగా వెలుస్తున్న ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఈడీ, ఎల్​సీడీ డిజిటల్ స్క్రీన్లపై ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధించింది. వీటి గరిష్ట పరిమాణం 18 చదరపు మీటర్లకు మించకూడదని, ముఖ్యంగా ట్రాఫిక్ జంక్షన్లకు 50 మీటర్ల లోపల వాహనదారుల దృష్టి మరల్చేలా ఎలాంటి వీడియో కంటెంట్ ప్రదర్శించకూడదని స్పష్టం చేసింది. అంతేకాకుండా రాత్రి 11 గంటల తర్వాత ఈ డిజిటల్ స్క్రీన్లను కచ్చితంగా ఆపివేయాలని తేల్చి చెప్పింది. మరోవైపు పురావస్తు కట్టడాలు, విగ్రహాలు, పార్కులు, నీటి వనరులు, దేవాలయాలు, మసీదులు, చర్చిలు, విద్యాసంస్థలు, స్మశాన వాటికల వద్ద ప్రకటనలను పూర్తిగా నిషేధిస్తున్నట్లు పేర్కొంది. రోడ్డు మధ్యలో (మీడియన్) కియోస్కులు, భారీ గ్యాంట్రీలు, గోడలపై పోస్టర్లు, స్టిక్కర్లను కఠినంగా నిషేధించారు. నిబంధనల విరుద్ధంగా యాడ్స్ ఇస్తే కఠిన చర్యలు తీసుకోనున్నారు. 

తప్పు రిపీట్ చేస్తే బ్లాక్ లిస్ట్​లోకి ఏజెన్సీ..  ​

ప్రకటనల నిర్వహణలో పారదర్శకత కోసం ప్రతి హోర్డింగ్​కు ‘క్యూఆర్ కోడ్’, ‘జియో ట్యాగింగ్’ తప్పనిసరి చేశారు. వీటిని సీసీటీవీ కెమెరాల ద్వారా కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి నిరంతరం పర్యవేక్షించనున్నారు. అనుమతి లేని ప్రకటనలను ఎలాంటి ముందస్తు నోటీసులు లేకుండానే తొలగించే అధికారం మున్సిపల్ కార్పొరేషన్లకు కల్పించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే వార్షిక ఫీజుకు ఏకంగా మూడింతల జరిమానా విధిస్తారు. ఒకవేళ తప్పు రిపీట్ చేస్తే సదరు ఏజెన్సీని బ్లాక్ లిస్ట్​లో పెట్టి క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని, అలాగే ఫీజు చెల్లింపులో 30 రోజులు జాప్యం జరిగితే బ్యాంక్ గ్యారంటీని జప్తు చేసి అనుమతులు రద్దు చేయనున్నారు.