Asia Cup 2025: కొడుకు మ్యాచ్ ఆడుతుంటే హార్ట్ ఎటాక్‌తో తండ్రి మరణం.. ఆసియా కప్ నుంచి స్వదేశానికి శ్రీలంక క్రికెటర్

Asia Cup 2025: కొడుకు మ్యాచ్ ఆడుతుంటే హార్ట్ ఎటాక్‌తో తండ్రి మరణం.. ఆసియా కప్ నుంచి స్వదేశానికి శ్రీలంక క్రికెటర్

ఆసియా కప్ లో విచార సంఘటనలు చోటు చేసుకున్నాయి. శ్రీలంక యువ స్పిన్నర్ దునిత్ వెల్లలాగే తండ్రి సురంగా వెల్లలాగే గుండెపోటుతో ప్రాణాలు విడిచారు. గురువారం (సెప్టెంబర్ 18) ఆఫ్ఘనిస్తాన్ తో మ్యాచ్ ఆడుతున్నప్పుడు వెల్లలాగే తండ్రి మరణించారు. మ్యాచ్‌ ముగిసిన తర్వాత లంక మేనేజ్‌మెంట్ ఈ చేదువార్తను వెల్లలాగేకు తెలియజేయడంతో తీవ్ర దుఃఖంలో మునిగిపోయాడు. శ్రీలంక ప్రధాన కోచ్ సనత్ జయసూర్య వెల్లలాగేను ఓదారుస్తూ కనిపించాడు. ఆఫ్ఘనిస్తాన్ పై విజయం లంక జట్టులో ఆనందాన్ని నింపినా.. వెల్లలాగే తండ్రి మరణం జట్టు మొత్తాన్ని తీవ్ర విచారానికి గురి చేసింది. 

గురువారం తండ్రి మరణ వార్త తెలుసుకున్న వెల్లలాగే ఆసియా కప్ నుంచి స్వదేశానికి తిరిగి వచ్చాడు. అబుదాబి నుంచి అందుబాటులో ఉన్న విమానంలో కొలంబోకు వెళ్లారు. సూపర్-4 లో భాగంగా శనివారం (సెప్టెంబర్ 20) శ్రీలంక తమ తొలి మ్యాచ్ లో బంగ్లాదేశ్ తో తలపడుతోంది. ఈ మ్యాచ్ కు వెల్లలాగే అందుబాటులో ఉండడం అనుమానంగా మారింది. బంగ్లాదేశ్‌తో మ్యాచ్ తర్వాత.. సెప్టెంబర్ 23న పాకిస్తాన్‌తో, సెప్టెంబర్ 26న ఇండియాతో శ్రీలంక మ్యాచ్ లు ఆడనుంది. తొలి రెండు మ్యాచ్ ల్లో ప్లేయింగ్ 11 లో వెల్లలాగేకు అవకాశం రాలేదు. అయితే ఆఫ్ఘనిస్తాన్ తో జరిగిన కీలక మ్యాచ్ లో తీక్షణ స్థానంలో తుది జట్టులోకి వచ్చాడు. 

ఈ మ్యాచ్ లో తొలి మూడు ఓవర్లు అద్భుతంగా బౌలింగ్ చేసిన ఈ లంక యువ స్పిన్నర్.. నాలుగు ఓవర్లో ఏకంగా 32 పరుగులు సమర్పించుకున్నాడు. వెల్లలాగే వేసిన ఇన్నింగ్స్ 20 ఓవర్లో ఆఫ్ఘనిస్తాన్ ఆల్ రౌండర్ మహమ్మద్ నబీ వరుసగా 5 బంతుల్లో 5 సిక్సర్లు కొట్టి తమ జట్టుకు భారీ స్కోర్ అందించాడు. ఓవరాల్ గా ఈ మ్యాచ్ లో 4 ఓవర్లలో ఒక వికెట్ పడగొట్టి 49 పరుగులు సమర్పించుకున్నాడు. ఈ మ్యాచ్ విషయానికి వస్తే మొదట బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్థాన్  నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో శ్రీలంక 18.4 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసి గెలిచింది.   

మలింగ, నబీ ఎమోషనల్ ట్వీట్:
  
దునిత్ వెల్లలాగే తండ్రి మరణంతో శ్రీలంక మాజీ ఫాస్ట్ బౌలర్ మలింగ తన సంతాపాన్ని ప్రకటించాడు. "దునిత్ వెల్లలాగే తండ్రి శ్రీ సురంగ వెల్లగే మృతి తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన కుటుంబానికి నా హృదయపూర్వక సానుభూతి. ధైర్యంగా ఉండండి దునిత్.  ఈ క్లిష్ట సమయంలో దేశం మొత్తం మీకు మీ కుటుంబానికి తోడుగా నిలుస్తుంది". అని లసిత్ మలింగ ఎక్స్ (X) లో  రాసుకొచ్చారు. 
ఆఫ్ఘనిస్తాన్ ఆల్ రౌండర్ నబీ ఇలా రాసుకొచ్చాడు. "తన ప్రియమైన తండ్రిని కోల్పోయిన దునిత్ వెల్లలాగే, అతని కుటుంబానికి హృదయపూర్వక సానుభూతి. ధైర్యంగా ఉండు సోదరా". అని నబీ తన ఎక్స్ (X) హ్యాండిల్‌లో రాశారు.