- రాష్ట్రంలో విచ్చలవిడిగా నకిలీ లిక్కర్ సేల్స్
- ప్రమాదకర కెమికల్స్‌తో తయారీ
- షాంపూ, కుంకుడు రసం, గ్యాస్‌తో బీర్లు
- ఖరీదైన బ్రాండ్లలో చీప్ లిక్కర్ మిక్సింగ్
- మూతలు తీసి పెడుతున్న ‘టెక్నీషియన్లు’
- ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి
హైదరాబాద్, వెలుగు: వేసిన సీల్ వేసినట్టే ఉంటుంది. మూత కూడా చెక్కు చెదరదు.. కానీ లోపల లిక్కర్ మాత్రం కల్తీ అవుతుంది. ఖరీదైన బ్రాండ్ తాగుతున్నామన్న ఫీలింగే కానీ అందులో ఏ చీప్ కలిపారో కనుక్కోలేని పరిస్థితి. బాగా సేల్ అవుతున్న మీడియం బ్రాండ్స్‌తోపాటు బీర్లలో కల్తీ ఎక్కువ జరుగుతోంది. గతంలో బార్లకే పరిమితమైన ఈ కల్తీ దందా.. ఇప్పుడు వైన్స్‌కూ పాకింది. పనిలోపనిగా కొందరు ప్రాణాంతక రసాయనాలతో కల్తీ లిక్కర్ తయారు చేస్తున్నారు. హైదరాబాద్‌తోపాటు పలు జిల్లాల్లో నకిలీ మద్యం దందా జోరుగా సాగుతోంది.
టాప్ బ్రాండ్స్‌లో చీప్ మిక్సింగ్
నీళ్లలో పంచదారను మరిగించి అందులో కెమికల్స్, క్లీనింగ్ లిక్విడ్స్, నెయిల్ పాలిష్ రిమూవర్, కార్లను తుడిచేందుకు వాడే క్రీమ్స్‌ను నకిలీ మద్యం తయారీలో వాడుతున్నారు. రకరకాల కెమికల్స్‌ను కలుపుతుండడంతో వెంటనే కిక్కెక్కుతోంది. ప్రీమియం బ్రాండ్లు కొన్ని ప్లాస్టిక్ బాటిళ్లలో వస్తుండడంతో వీటి నుంచి మద్యాన్ని తీసి అందులో చీప్ లిక్కర్ లేదా వాటర్ కలుపుతున్నారనే ఆరోపణలున్నాయి. బాటిల్ మూతను సీల్ పోకుండా టెక్నిక్‌గా చేతితో తీసి అందులోంచి క్వార్టర్ వరకు మందును బయటకు తీస్తున్నారు. ఆ మేరకు నీళ్లు, చీప్‌తో నింపుతున్నారు. అనంతరం ఏ మాత్రం అనుమానం రాకుండా మూత బిగించేస్తున్నారు. ఇలా టెక్నిక్‌గా మూత తీసే ‘టెక్నీషియన్లు’ అవసరం మేరకు వివిధ వైన్స్‌కు వచ్చి వెళ్తుంటారు. మూతలు తీసిపెట్టే సీసాల సంఖ్యను బట్టి డబ్బులు తీసుకుంటారు. అయితే కొన్ని బ్రాండ్స్ మూతలు తీయడమే కానీ మళ్లీ బిగించే వీలుండదు. వీటి మూతల్ని ప్రత్యేకంగా ఢిల్లీ, పంజాబ్, ముంబై ప్రాంతాల నుంచి తెప్పిస్తున్నారు. ఇక కొన్ని వైన్స్‌లో మూతకు సన్నటి హోల్ చేసి సిరంజీతో మందు గుంజేసీ నీళ్లు ఎక్కిస్తున్నారు.
బీరు కాదది.. షాంపూ, సోడా గ్యాస్
బీర్లలోనూ కల్తీ భారీగానే జరుగుతోంది. పంచదారతోపాటు పలు రకాల కెమికల్స్ కలిపిన నీటికి షాంపూ, కుంకుడుకాయ రసం కలిపి ఖాళీ బీరు బాటిళ్లను నింపుతున్నారు. తర్వాత నిమ్మరసం బండ్లపై వాడే సోడా గ్యాస్ ఎక్కించి మూతలు బిగించేస్తారు. గ్యాస్, షాంపూ కారణంగా ఓపెనర్‌తో తెరవగానే అది బీరులా బుస్సున పొంగుతుంది.
25 శాతం కల్తీ సరుకే
ప్రస్తుత మద్యం పాలసీ ప్రకారం నిర్దేశించిన దానికంటే ఎక్కువ మద్యం అమ్మితే ఆబ్కారీకి లాభంపై ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. గతంలో కోటి రూపాయలు లైసెన్స్ ఫీజు చెల్లించి ఎంత మొత్తంలో మద్యం అమ్ముకున్నా పట్టించుకునే వారు కాదు. కొత్త రూల్స్ ప్రకారం నిర్దేశించిన కోటా దాటితే ఆబ్కారీకి మరికొంత లైసెన్స్ ఫీజు చెల్లించాలి. దీంతో ప్రభుత్వానికి డబ్బులు చెల్లించకుండా కొంతమంది రిటైలర్స్ నకిలీ మద్యాన్ని అమ్ముతున్నారు. మద్యంలో 20 నుంచి 25 శాతం నకిలీ మద్యం ఉండేలా కొంతమంది రిటైలర్లు జాగ్రత్తలు తీసుకుంటున్నారనే ఆరోపణలున్నాయి.
కిడ్నీకి దెబ్బ.. కంటిచూపు పోవచ్చు
నకిలీ మద్యం తయారీలో వాడే డేంజరస్ కెమికల్స్ వల్ల వాంతులు, విరేచనాలు, కడుపునొప్పి వంటి ఆరోగ్య సమస్యలొస్తాయని డాక్టర్లు చెబుతున్నారు. ఈ కల్తీ లిక్కర్‌ను అతిగా తాగితే కొన్నాళ్లకే కిడ్నీ దెబ్బతింటుందని, కోమాలోకి వెళ్లే ప్రమాదముందని, శాశ్వతంగా కంటిచూపు పోవచ్చని హెచ్చరిస్తున్నారు.
ఇటీవలి ‘కల్తీ’ ఘటనలు
- హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ పరిధిలో ఓ వైన్స్‌లో రెండు లక్షల విలువైన నకిలీ మద్యం పట్టుకున్నారు.
- హైదరాబాద్‌లోని కొండాపూర్ శ్రీరాంనగర్ కాలనీ ప్రధాన రోడ్డులో కల్తీ మద్యం అమ్ముతుండటంతో వైన్ షాపును సీజ్ చేశారు.
- నల్గొండలో నకిలీ మద్యం తయారీదారులను అరెస్టు చేశారు.
- జనగామలోని ఓ వైన్స్‌లో తనిఖీలు చేయగా నీళ్లు కలిపిన 27 లిక్కర్ బాటిళ్లు లభ్యమయ్యాయి.
- ములుగు జంగాలపల్లిలోని వైన్‌షాపులో కల్తీ చేసిన మద్యం బాటిళ్లు 500 లభించాయి.
- నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం సీహెచ్ కొండూరులో ప్లాస్టిక్ బాటిల్స్‌లో నిల్వ ఉంచిన కల్తీ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.
- ములుగులో మద్యం బాటిళ్ల మూతలు తీసి నీళ్లు కలిపే ముఠాను పట్టుకున్నారు.
- వర్ధన్నపేట మండలం ఇల్లందలో ఓ వైన్స్‌లో కల్తీ చేసిన మద్యం బాటిళ్లు దొరికాయి.
