డూప్లికేట్ ఓట్లు  22 లక్షలు

డూప్లికేట్ ఓట్లు  22 లక్షలు
  • ఒకే ఫొటోతో రెండు ఐడీ కార్డులు ...హైదరాబాద్, రంగారెడ్డి 
  • జిల్లాల పరిధిలోనే ఎక్కువ  అత్యధికంగా
  • కుత్బుల్లాపూర్ ​నియోజకవర్గంలో 91,966 
  • సాఫ్ట్ వేర్ సాయంతో డబుల్ ఓట్లను గుర్తించి తొలగిస్తున్నం: సీఈఓ వికాస్ రాజ్


హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఒకే ఫొటోతో రెండు ఓటర్ ఐడీ కార్డులు ఉన్నవి లక్షల సంఖ్యలో వెలుగు చూస్తున్నాయని సీఈఓ వికాస్ రాజ్ తెలిపారు. ఇలాంటివి రాష్ట్రవ్యాప్తంగా 22.04 లక్షలు ఉన్నట్లు గుర్తించామని, 50 నియోజకవర్గాల్లోనే ఎక్కువగా ఉన్నాయని చెప్పారు. అత్యధికంగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలో ఉండగా... కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో​91,996, శేరిలింగంపల్లిలో 91,112, ఎల్బీ నగర్‌లో​76,272, ఉప్పల్​లో 71,009, మేడ్చల్​లో 67,969, జూబ్లీహిల్స్​లో 55,684, యాకుత్​పురాలో 50,950, కార్వాన్​లో 48,069, నాంపల్లిలో 46,780, చాంద్రాయణ్​గుట్టలో 42,858 ఉన్నాయని వివరించారు. అత్యల్పంగా మధిర నియోజకవర్గంలో 3,347 ఉన్నాయన్నారు. గురువారం హైదరాబాద్​లోని బుద్ధభవన్​లో రాజకీయ పార్టీల నేతలతో సమావేశమైన వికాస్ రాజ్.. డబుల్ ఓట్ల తొలగింపుపై చర్చించారు. తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా డబుల్ ఓట్ల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోందని చెప్పారు. సాఫ్ట్ వేర్, యాప్ సాయంతో డబుల్ ఓట్లను గుర్తించి తొలగిస్తున్నామన్నారు. ఒకే ఫొటోతో పేర్లు, అడ్రస్ లు వేర్వేరుగా డబుల్ ఓట్లు ఉంటున్నాయని తెలిపారు. ఈఆర్వోలు వాటిని గుర్తించి సాఫ్ట్​వేర్​లో ఎంట్రీ చేస్తారన్నారు. 
డబుల్​ ఓట్లన్నీ తొలగించాలె: బీజేపీ 
కొందరికి ఒకటే నియోజకవర్గంలో రెండు ఓట్లు, లేదంటే రెండు నియోజకవర్గాల్లోనూ ఓటర్ కార్డులు ఉన్నాయని బీజేపీ నేత ప్రకాశ్​ రెడ్డి అన్నారు. డబుల్ ఓట్లన్నింటినీ గుర్తించి తొలగించాలని కోరామన్నారు. బీఎల్ వోలను జవాబుదారీ చేయాలన్నారు. 
 

బీఎల్​ఓలుగా చదివినోళ్లనే పెట్టాలి: టీఆర్‌ఎస్​
ఒకే ఫొటో ఓటరు ఐడీ కార్డులను గుర్తించేందుకు బూత్​ లెవెల్​లో చదువుకున్న వారిని పెట్టాలని కోరినట్లు టీఆర్​ఎస్ ​మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్​ రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లో డబుల్ ఓట్లు ఎక్కువగా నమోదవుతున్నాయని, కొన్నిచోట్ల బీఎల్​ఓలు కూడా తప్పులు చేస్తున్నారన్నారు. 
ఏపీ, తెలంగాణలో రెండు చోట్లా ఓట్లు: కాంగ్రెస్ 
కొందరికి ఏపీ, తెలంగాణలో రెండు చోట్లా ఓట్లు ఉన్నాయని తమ పరిశీలినకు వచ్చిందని కాంగ్రెస్​అధికార ప్రతినిధి నిరంజన్​రెడ్డి తెలిపారు. వాటిని కూడా తొలగించాలని కోరామన్నారు.