బీఆర్ఎస్ హయాంలో రేవంత్‌పై 89, బండిపై 42 పోలీస్ కేసులు

బీఆర్ఎస్ హయాంలో రేవంత్‌పై 89, బండిపై 42 పోలీస్ కేసులు
  • =  రాజకీయ కక్షలతో కేసుల నమోదు
  • = చిన్నపాటి తప్పిదాలకూ ఎఫ్ఐఆర్!!
  • = మాస్క్ పెట్టుకోలేదని రేవంత్ పై కేసు 
  • = అనుమతికి మించి సభకు వచ్చారని మరో చోట..
  • = పర్మిషన్ లేకుండా యాదగిరి గుట్ట గుడిలోకి వెళ్లారని బండి సంజయ్ పై కేసు 
  • = కేసీఆర్ కుమార్తె కవితపై తప్పుడు ఆరోపణ పేరిట జోగిపేటలో..
  • = చిత్ర విచిత్ర కారణాలతో కేసులు పెట్టిన పోలీసులు
  • = ఇప్పుడు ఒకరు సీఎం, మరొకరు హోంశాఖ సహాయ మంత్రి 

హైదరాబాద్: బీఆర్ఎస్ సర్కారు హయాంలో ప్రతిపక్ష నాయకులపై పోలీసులు చీటికీ మాటికీ పెట్టీ కేసులు పెట్టారు. వాటిని విచారించకుండా పెండింగ్ లో పెట్టడం గమనార్హం. బీఆర్ఎస్ హయాంలో టీపీసీసీ చీఫ్ గా వ్యవహరించిన ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డిపై ఏకంగా 89 కేసులున్నాయి. అదే సమయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగిన ప్రస్తుత కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పై 42 కేసులు ఉన్నాయి.  

సీఎం రేవంత్ రెడ్డిపై 89 కేసుల్లో మూడు కేసులు మినహాయిస్తే మిగతా 86  పెట్టీ కేసులే.. చిన్న చిన్న తప్పిదాలకు కూడా కేసులు నమోదు చేసింది గత బీఆర్ఎస్ సర్కారు. అనుమతి పొందిన వారికన్నా ఎక్కువ మందితో బహిరంగ సభ నిర్వహించారని ఒక కేసు నమోదైతే.. మాస్కు పెట్టుకోలేదంటూ మరో కేసు నమోదు చేశారు. పోలీసులు అధికారపార్టీ తరపున పనిచేస్తున్నారని రేవంత్ రెడ్డి చేసిన ఒక్క ఆరోపణపైనే పోలీసులు గతంలో 35 కేసులు పెట్టారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.

ఇలాంటి చిన్న చిన్న కేసులన్నీ కలిపితే 86 కేసుల వరకు చేరాయి. అధికార పార్టీ నేతల ఆదేశాలతో విపక్ష నేతలపై పెడుతున్న కేసులతో వారు నేరచరితులుగా రికార్డుల్లోకి ఎక్కుతున్నారు. గతంలో టీపీసీసీ అధ్యక్షుడిగా... మల్కాజ్ గిరి ఎంపీగా పనిచేసిన రేవంత్ రెడ్డి దేశంలోనే ఎక్కువ కేసులు ఎదుర్కొంటున్న సీఎంగా ముందు వరుసలో నిలిచారు. 

గుళ్లోకి వెళ్లారని.. మాస్కు పెట్టుకోలేదని

అప్పటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ప్రస్తుత కేంద్ర హోంశాఖ  సహాయమంత్రి బండి సంజయ్ కుమార్ పై గత ప్రభుత్వం అనేక కేసులు నమోదు చేసింది. ఈ కేసులను పరిశీలిస్తే పూర్తిగా రాజకీయ కక్షతో పెట్టినవని అర్థం చేసుకోవచ్చు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా, కరీంనగర్ ఎంపీగా ఉన్న బండి సంజయ్ కుమార్ పై యాదగిరి గుట్ట ఠాణాలో క్రైం నంబర్ 312/2022 కేసు నమోదైంది. ఆయన చేసిన నేరం ఏమిటంటే.. ఎలాంటి అనుమతి లేకుండా అనుచరులతో లక్ష్మీనరసింహస్వామి ఆలయంలోకి ప్రవేశించడమే! 

సీఎం కుమార్తె, ఎమ్మెల్సీ కవితపై తప్పుడు ఆరోపణలు చేశారని పేర్కొంటూ పూర్వ మెదక్ జిల్లా జోగిపేట ఠాణాలో మరో కేసు నమోదైంది. అలాగే కరీంనగర్ టూటౌన్ పోలీసు స్టేషన్ లో 2022లో వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. కోవిడ్ సమయంలో మాస్కు ధరించలేదని, నిబంధనలు ఉల్లంఘించారని పేర్కొంటూ ఐపీసీ147, 148,188,341,332,149,151 కింద పోలీసులు కేసులు పెట్టారు. ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుపై పోలీసులు 52 కేసులు నమోదు చేశారు. ఇవన్నీ ఆయన ఆదివాసీల పక్షాన చేసిన పోరాటానికి సంబంధించినవే కావడం గమనార్హం. అధికార పార్టీ నేతల రాజకీయ ఒత్తిళ్లతో పెట్టిన ఈ కేసుల కారణంగా బొజ్జు నేరచరితుల రికార్డుల్లోకి ఎక్కారు. 

తక్షణం ఎత్తివేయాలి

తెలంగాణలోని కీలక నేతలపై పోలీసులు పెట్టిన పెట్టీ కేసులను తక్షణం ఎత్తివేయాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ చైర్మన్ పద్మనాభ రెడ్డి కోరారు. పోలీసులు నేతలు, ప్రజాప్రతినిధులపై నమోదు చేసిన పెట్టీ కేసులను పరిశీలించి వాటిని ఎత్తివేయాలని సీఎంను కోరారు. కలెక్టర్లు, డీజీపీలతో మాట్లాడి పెండింగ్ లో పెట్టిన కేసులను వాపసు తీసుకునేలా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు.