పోలీసుల పహారాలో యాదాద్రి ఆలయ పరిసరాలు

పోలీసుల పహారాలో యాదాద్రి ఆలయ పరిసరాలు

    238 సీసీ కెమెరాల ఏర్పాటు 
    భద్రతా ఏర్పాట్లపై సీపీ మహేశ్​భగవత్ రివ్యూ

యాదగిరిగుట్ట, వెలుగు: ఈ నెల 28న యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయం ఉద్ఘాటన సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భద్రతా ఏర్పాట్లు చేయాలని సంబంధిత శాఖల ఉన్నతాధికారులను రాచకొండ సీపీ మహేశ్​భగవత్ ఆదేశించారు. ఆలయ ఉద్ఘాటన సందర్భంగా భద్రతాపరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చేయాల్సిన ఏర్పాట్ల గురించి శనివారం ఆయన యాదాద్రిలో పర్యటించారు. కొండపైన, కింద సెక్యూరిటీ పరంగా ఎక్కడెక్కడ ఎలాంటి చర్యలు చేపట్టాలో తెలుసుకోవడానికి క్షేత్రస్థాయిలో తిరిగారు. కొండపైన బస్ బేలు, క్యూకాంప్లెక్స్, మెట్లదారి మార్గం, క్యూలైన్లు, మెయిన్ టెంపుల్ పరిశీలించారు. ఏర్పాట్లపై ఆఫీసర్లతో రివ్యూ నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆలయ ఉద్ఘాటన సందర్భంగా ప్రత్యేక బలగాలతో యాదాద్రిలో స్పెషల్ బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మెయిన్​ టెంపుల్​ సహా ఆలయ పరిసరాల్లో 238 సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఇకనుంచి మెయిన్ టెంపుల్ సహా ఆలయ పరిసరాలు మొత్తం పోలీసుల పహారాలో ఉంటాయన్నారు. సెక్యూరిటీ స్పాట్లను గుర్తించి ఎక్కడెక్కడ ఏ సిబ్బందితో భద్రత ఏర్పాటు చేయాలో త్వరలోనే నిర్ణయిస్తామన్నారు. మెయిన్ టెంపుల్ సహా గర్భగుడిలో ఎస్పీఎఫ్ బలగాలతో భద్రత ఉంటుందని, బయట భక్తుల తనిఖీలు, లగేజీల చెకింగ్ తదితర చర్యలు లా అండ్ ఆర్డర్ పోలీసులు చూసుకుంటారని చెప్పారు. ట్రాఫిక్ పోలీసులతో ట్రాఫిక్ కంట్రోలింగ్, పార్కింగ్ ఏర్పాట్లు, దొంగతనాలు, నేరాలు, చైన్ స్నాచింగ్ వంటివి జరగకుండా క్రైం టీంతో స్పెషల్ నిఘా, మహిళల భద్రత కోసం షీ టీమ్స్ ఏర్పాటు చేస్తామని చెప్పారు.

21 నుంచి పంచకుండాత్మక సుదర్శన యాగం

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయ ప్రారంభం సందర్భంగా బాలాలయంలో పంచకుండాత్మక మహా సుదర్శన యాగం కోసం యాగశాల సిద్ధమైంది. ఈ నెల 21 నుంచి 28 వరకు ఏడు రోజులపాటు జరిపే పంచకుండాత్మక సుదర్శన యాగం కోసం ‘వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుధ్, మహాలక్ష్మి’ పేర్లు గల ఐదు కుండలాలను ఏర్పాటు చేశారు. యాగానికి 100 లీటర్ల ఆవు నెయ్యి అవసరం కాగా.. ముందస్తు జాగ్రత్తగా అదనంగా మరో 50 లీటర్లు అందుబాటులో ఉంచారు.