జైల్లో దసరా సెలెబ్రేషన్స్... పక్కా ప్లాన్ తో ఇద్దరు ఖైదీలు ఎస్కేప్..

జైల్లో దసరా సెలెబ్రేషన్స్... పక్కా ప్లాన్ తో ఇద్దరు ఖైదీలు ఎస్కేప్..

దేశవ్యాప్తంగా సెలెబ్రేషన్స్ ఘనంగా జరిగాయి. దేవి నవరాత్రులలో అమ్మవారికి శ్రద్దగా పూజలు చేసి తరించారు భక్తులు. ప్రస్తుతం పండగ సందర్భంగా సిటీల నుంచి సొంతూళ్లకు వెళ్లి తిరిగొచ్చే హడావిడిలో జనం ఉన్నారు. ఈ క్రమంలో ఓడిశాలోని కటక్ జిల్లాలో ఆసక్తికర ఘటన  చోటు చేసుకుంది. జిల్లాలోని హై సెక్యూరిటీ చౌద్వార్ జైల్లో దసరా సెలెబ్రేషన్స్ జరుగుతుండగా ఇద్దరు ఖైదీలు తప్పించుకున్నారు. జైల్లో నుంచి ఖైదీలు తప్పించుకోవడం కామనే అయినప్పటికీ... ఈ ఖైదీలు తప్పించుకున్న తీరు సినిమా తరహాలో ఉంది. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి...

శుక్రవారం ఉదయం ( అక్టోబర్ 3 ) ఒడిశాలోని కటక్ జిల్లాలో హై సెక్యూరిటీ చౌద్వార్ సర్కిల్ జైలు నుంచి హత్య, దోపిడీ కేసుల్లో నిందితులుగా ఉన్న ఇద్దరు ఖైదీలు తప్పించుకున్నారు. జైలు అధికారులు, ఇతర ఖైదీలు దసరా సెలెబ్రేషన్స్ లో లీనమై ఉండగా జరిగింది ఈ ఘటన. ఇదే అదునుగా భావించిన ఇద్దరు ఖైదీలు... సెల్ ఊచలు రంపంతో కోసి.. దుప్పట్లను తాడు లాగా వాడుకొని జైలు గోడ దూకి పారిపోయారు.  

పారిపోయిన ఇద్దరు ఖైదీలు బీహార్ కి చెందిన రాజా సాహ్ని, చంద్రకాంత్ కుమార్ గా గుర్తించారు పోలీసులు.  బీహార్ లోని జాజ్‌పూర్ జిల్లాలో నగల దుకాణం చోరీ చేసి ఇద్దరిని హత్య చేసిన కేసులో ఇద్దరు ఖైదీలను అరెస్ట్ చేసినట్లు తెలిపారు పోలీసులు. ఇటీవల వారిని హై సెక్యూరిటీ జైలుకు తీసుకువచ్చి జైలులోని రెండు ప్రత్యేక హై సెక్యూరిటీ సెల్స్ లో ఉంచినట్లు తెలిపారు పోలీసులు.

శుక్రవారం తెల్లవారుజామున 1: 30 గంటల సమయంలో ఘటన జరిగినట్లు తెలుస్తోంది.ఖైదీలను పట్టుకోవడానికి గాలింపు చర్యలు చేపట్టామని..ఈ ఘటనకు బాధ్యులైన ఇద్దరు సీనియర్ జైలు అధికారులను సస్పెండ్ చేసినట్లు తెలిపారు. ఖైదీలు తమ సెల్స్ లోపలికి రంపాలను ఎలా తీసుకెళ్లగలిగారు, ఊచలను ఎలా కత్తిరించగలిగారు, వార్డు సిబ్బంది దీనిని ఎలా గమనించలేకపోయారు అనే అంశాలపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు పోలీసులు.

పారిపోయిన ఖైదీలను పట్టించినవారికి రూ. 50 వేలు రివార్డ్ ప్రకటించారు పోలీసులు. ఈ ఘటనతో చౌద్వార్ జైలులో భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ జైలులో హైలెవెల్ కేసుల్లో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు ఉన్న క్రమంలో భద్రతా ఏర్పాట్లు బలోపేతం చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.