
తెలుగు చిత్ర పరిశ్రమలో దసరా సంబురాలు ఘనంగా జరిగాయి. దసరా సందర్భంగా టాలీవుడ్‌లో అప్‌డేట్స్ జాతర జరిగింది. స్టార్ హీరోల సినిమాలకు సంబంధించి షూటింగ్ అప్‌డేట్స్‌తో పాటు కొత్త సినిమాల అనౌన్స్‌మెంట్లు వచ్చాయి. అలాగే కొత్త చిత్రాల ప్రారంభోత్సవం, సరికొత్త పోస్టర్లతో సందడి చేస్తూ ఈ విజయ దశమికి అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపారు.
వీరమల్లు పోరాటం
పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’ కొత్త షెడ్యూల్ సోమవారం నుంచి ప్రారంభం కానుందని ప్రకటించారు. త్వరలోనే ఫస్ట్ సాంగ్‌ను రిలీజ్ చేయనున్నట్టు, నవంబర్ 10 నాటికి షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసేలా ప్లాన్ చేస్తున్నామని మేకర్స్ తెలియజేశారు. దసరా సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌లో పవన్ కళ్యాణ్ తన ప్రత్యర్థులపై శక్తి త్రిశూలాన్ని ప్రయోగించినట్లుగా మూడు బాణాలను గురిపెట్టారు. ఈ పోస్టర్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. జ్యోతి కృష్ణ దర్శకత్వంలో రెండు భాగాలుగా రూపొందుతోన్న ఈ మూవీ ఫస్ట్ పార్ట్ ‘స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’గా మార్చి 28న విడుదల కానుంది. ఏఎం రత్నం సమర్పణలో ఎ దయాకర్ రావు నిర్మిస్తున్నారు.
సంక్రాంతికి గేమ్ చేంజర్
రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘గేమ్ చేంజర్’ రిలీజ్ డేట్‌ను ఫిక్స్ చేశారు నిర్మాత దిల్ రాజు. ముందుగా క్రిస్మస్‌కి విడుదల చేయాలని భావించినా.. ఫైనల్‌గా సంక్రాంతికి వస్తున్నట్టు ప్రకటించారు. దీనిపై నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ ‘క్రిస్మస్ కంటే సంక్రాంతి సీజన్ బావుంటుందని నాతో పాటు బాలీవుడ్, కోలీవుడ్, కర్ణాటక ఓవర్ సీస్‌లోని ఇతర డిస్ట్రిబ్యూటర్స్ అందరూ భావించాం. కానీ సంక్రాంతికి ‘విశ్వంభర’ ఉండటంతో ఆ డేట్ కావాలని చిరంజీవిగారిని, యూవీ క్రియేషన్స్ సంస్థను అడిగాం. మా సినిమా కోసం వాళ్లు మరో డేట్‌కు రిలీజ్ చేయటానికి ఒప్పుకున్నందుకు థ్యాంక్స్. జనవరి 10న వరల్డ్‌వైడ్‌గా ‘గేమ్ చేంజర్’ విడుదల చేయబోతున్నాం’ అని చెప్పారు.
రామ్ @22
దసరా పండగ సందర్భంగా రామ్ తన 22వ సినిమాని అనౌన్స్ చేశాడు. ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ ఫేమ్ మహేష్ బాబు పచ్చిగొల్ల దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. ఇందులో రామ్ యూనిక్ క్యారెక్టర్‌లో కనిపించనున్నట్టు, తన కెరీర్‌లో ఇది ల్యాండ్ మార్క్ మూవీగా నిలిచిపోనుందని మేకర్స్ తెలియజేశారు.
సారంగపాణి విడుదలకు సిద్ధం
ప్రియదర్శి హీరోగా మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మిస్తున్న ‘సారంగపాణి జాతకం’ చిత్రాన్ని డిసెంబర్ 20న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయి, పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్నామని మోహన కృష్ణ చెప్పారు. ఇంటిల్లిపాది నవ్వుకునే వినోదాత్మక చిత్రమిది అని నిర్మాత అన్నారు. రూప కొడువాయూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా నరేష్, తనికెళ్ళ భరణి, శ్రీనివాస్ అవసరాల, వెన్నెల కిశోర్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు.
ట్రిపుల్ ధమాకా
ఈ దసరాకి బాలకృష్ణ ట్రిపుల్ ధమాకాతో ఫ్యాన్స్‌ను ఖుషీ చేశారు. బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీపావళి సందర్భంగా ఈ మూవీ టైటిల్ టీజర్‌ను, సినిమాను సంక్రాంతికి విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. బాలకృష్ణ నటిస్తున్న 109వ సినిమా ఇది.
అలాగే బాలయ్య హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో మరో చిత్రాన్ని దసరాకి అనౌన్స్ చేశారు. ‘బీబీ4’ వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని అక్టోబర్ 16న పూజా కార్యక్రమాలతో ప్రారంభించనున్నారు. నందమూరి తేజస్విని సమర్పణలో 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్నారు. మరోవైపు బాలకృష్ణ హోస్ట్‌గా చేస్తున్న ‘అన్‌స్టాపబుల్’ 4వ సీజన్‌కు సంబంధించి ట్రైలర్‌ను దసరాకు లాంచ్ చేశారు. అక్టోబర్ 24నుంచి ఆహాలో
ఇది స్ట్రీమింగ్ కానుంది.