
ఢిల్లీలో దుమ్ము , దూళితో కూడిన గాలులు ఉక్కరిబిక్కరి చేస్తున్నాయి. రాజస్థాన్‌లో ఇసుకు తుఫాను కారణంగా ఢిల్లీని దుమ్ము, ధూళి కమ్మేసింది. దీని కారణంగా ఢిల్లీలో భారీగా వాయు కాలుష్యం పెరిగింది. దీంతో గాలి నాణ్యత తగ్గింది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పై గాలి నాణ్యత 134 పాయింట్లుగా నమోదైంది. ఢిల్లీ ఎన్‌సీఆర్ పరిధిలో ఉదయం ఆరు గంటల నుంచే దుమ్ముతో కూడిన బలమైన గాలులు వీస్తున్నాయి. దీంతో విజిబిలిటీ 1100 మీటర్లకు పడిపోయింది. మే 16, 17వ తేదీల్లో ఢిల్లీలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. . దుమ్ము, ధూళి ప్రభావంతో ఢిల్లీలో స్వల్పంగా ఉష్ణోగ్రతలు కూడా తగ్గాయి. సోమవారం ఢిల్లీలో గరిష్ట ఉష్ణోగ్రత 41.3 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 25.2 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది.
రాజస్థాన్ మీదుగా ఆవరించిన ఇసుక తుపాను ప్రభావంతోనే ఢిల్లీలో దుమ్ము, దూళి రేగుతున్నట్టు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. తుపాను ప్రభావంతో ఉత్తర రాజస్థాన్‌లో దుమ్ముతో కూడిన గాలులతో పాటు తేలికపాటి వర్షాలు పడుతున్నాయి. ఈ ప్రభావంతో రాబోయే మూడు నాలుగు రోజుల్లో రాజస్థాన్, ఢిల్లీ, హర్యానాతోపాటు పంజాబ్‌లోని కొన్ని ప్రాంతాల్లోనూ దశల వారీగా దుమ్ము, దూళితో కూడిన గాలులు, వానలు పడతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మే 18న ఢిల్లీలో ఈదురుగాలులతో వానలు.. పిడుగులు పడే అవకాశం ఉందని IMD పేర్కొంది. మే 19 నుండి వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఆ తర్వాత ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా నమోదయ్యే ఛాన్సుందని అంచనా వేసింది.