
రాష్ట్రంలో పవర్ ప్రాజెక్టులు కట్టింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని అన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. యాదాద్రి పవర్ ప్లాంట్ భూ నిర్వాసితులకు ప్రజాభవన్ లో 320 మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్బంగా మాట్లాడిన భట్టి.. దాదాపు 500 మంది నిర్వాసితులకు ఉద్యోగాలు ఇస్తున్నామని చెప్పారు. ఆనాడు భూములిచ్చింది ఇందిరమ్మే.. ఈనాడు ఉద్యోగాలు ఇస్తోంది ఇందిరమ్మ సర్కారేనని తెలిపారు.
కాంగ్రెస్ వస్తే కరెంట్ ఉండదని తప్పుడు ప్రచారంచేశారు..కాంగ్రెస్ అంటేనే కరెంట్ అని నిరూపించామన్నారు భట్టి విక్రమార్క. అధికారంలోకి రాగానే న్యూ ఎనర్జీ పాలసీ తీసుకొచ్చామన్నారు. 51 లక్ష కుటుంబాలకు 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ ఇస్తున్నామని తెలిపారు. ఏటా రూ.17 వేల కోట్లు ప్రభుత్వం విద్యుత్ శాఖకు కడుతోందన్నారు భట్టి.
విద్యతో పేదరికాన్ని జయించవచ్చని చెప్పారు భట్టి. అంతర్జాతీయ ప్రమాణాలతో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేస్తామన్నారు. 5 ఎకరాల్లో యంగ్ ఇండియా స్కూల్ ఏర్పాటు చేసి 2600 మంది విద్యార్థులు చదువుకునే వసతులు కల్పిస్తామని చెప్పారు భట్టి.