గ్రూప్ 1 మెయిన్స్ లో ఈ-క్వశ్చన్ పేపర్!

గ్రూప్ 1 మెయిన్స్ లో ఈ-క్వశ్చన్ పేపర్!
  • ఆన్​లైన్​లోనే వాల్యుయేషన్   
  • టీఎస్ పీఎస్సీ యోచన

హైదరాబాద్, వెలుగు: గ్రూప్ 1 ఎగ్జామ్స్​ను పకడ్బందీగా నిర్వహించేందుకు టీఎస్​పీఎస్సీ కసరత్తు చేస్తోంది. మెయిన్స్ ను ఎలా నిర్వహించాలనే దానిపై ఫోకస్ పెట్టింది. ఈసారి ఎగ్జామ్ విధానంలో సంస్కరణలు తీసుకురావాలని యోచిస్తోంది. మొత్తం 503 పోస్టులకు టీఎస్​పీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వగా, ఇప్పటి వరకు 1.42 లక్షలకు పైగా అప్లికేషన్లు వచ్చాయి. ఈ నెలాఖరు వరకు అప్లికేషన్లకు గడువు ఉంది. ఆ తర్వాత రెండు నెలల్లో ప్రిలిమ్స్​ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎక్కువ మంది అభ్యర్థులు ఉండడంతో గతంలో మాదిరిగానే రాత పరీక్ష నిర్వహించనున్నారు. అయితే మెయిన్స్ కీలకం కావడంతో ఆ పరీక్షపై టీఎస్​పీఎస్సీ అధికారులు ఇప్పటి నుంచే దృష్టి సారించారు. 


పేపర్ లీక్ కాకుండా... 
గతంలో గ్రూప్ 1 మెయిన్స్​ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ ను ప్రింట్ చేసివ్వగా, ఈసారి ఆ విధానానికి స్వస్తి పలకాలని టీఎస్ పీఎస్సీ భావిస్తోంది. నవంబర్ లేదా డిసెంబర్ లో నిర్వహించనున్న మెయిన్స్ లో ఈ–క్వశ్చన్ పేపర్ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ప్రిలిమ్స్​ ద్వారా మెయిన్స్​కు ఎంపికయ్యేది 25 వేల మందే కావడంతో పెద్దగా ఇబ్బందులు ఉండవని అధికారులు చెబుతున్నారు. ముందుగానే అభ్యర్థులకు కంప్యూటర్లు, ల్యాప్​టాప్​లు ఏర్పాటు చేసిన సీట్లను కేటాయిస్తారు. ఎవరికి అలాట్ చేసిన సీట్లలో వారు కూర్చుంటేనే, ఆ సిస్టమ్​లో క్వశ్చన్ పేపర్ ఓపెన్ అయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అభ్యర్థులు సిస్టమ్​లో క్వశ్చన్లు చూస్తూ ఆన్సర్లు రాయాల్సి ఉంటుంది. దీని ద్వారా పేపర్ బయటకు రాదని, క్వశ్చన్ పేపర్ లీక్ కాకుండా ఉంటుందని అధికారులు అంటున్నారు. ప్రస్తుతం రైల్వే పోస్టుల భర్తీకి ఈ విధానమే అమలు చేస్తున్నట్టు పేర్కొంటున్నారు. మరోవైపు ఆన్సర్ షీట్ల వాల్యుయేషన్ కూడా ఆన్​లైన్​లోనే నిర్వహించాలని టీఎస్ పీఎస్సీ భావిస్తోంది. ఒక్కో ఆన్సర్ షీట్​ను ఇద్దరు ప్రొఫెసర్లతో వాల్యుయేషన్ చేయించాలని యోచిస్తోంది.