విద్యుత్ ఉత్పత్తిలో సాగర్ జెన్కో రికార్డు..    ఫిబ్రవరి 17 వరకు 2,502 మిలియన్ యూనిట్లు నమోదు

విద్యుత్ ఉత్పత్తిలో సాగర్ జెన్కో రికార్డు..    ఫిబ్రవరి 17 వరకు 2,502 మిలియన్ యూనిట్లు నమోదు

హాలియా, వెలుగు: నాగార్జునసాగర్ లోని ప్రధాన జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం విద్యుత్ ఉత్పత్తిలో చరిత్ర సృష్టించింది. 2025–26 ఆర్థిక సంవత్సరానికి 1,450 మిలియన్ యూనిట్లు లక్ష్యంగా నిర్ణయించగా, గత ఏడాది సెప్టెంబర్ 30 నాటికే ఆ లక్ష్యాన్ని అధిగమించింది. ప్రధాన కేంద్రంలోని ఏడు యూనిట్లు గత ఏడాది జులై 26 నుంచి నవంబర్ 6 వరకు నిరంతరంగా 104 రోజులు విద్యుత్ ఉత్పత్తి చేశాయి.

ఉత్పత్తి ప్రారంభించిన ఆరు నెలల 10 రోజుల్లోనే 2,237 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి సాధించింది. ఈ ఏడాది ఫిబ్రవరి 17 వరకు మొత్తం 2,502 మిలియన్ యూనిట్ల ఉత్పత్తి నమోదైంది. ఈ సందర్భంగా తెలంగాణ జెన్కో చీఫ్ ఇంజినీర్ మంగేశ్​కుమార్ మాట్లాడుతూ, ఇది జెన్​కో చరిత్రలో సువర్ణాధ్యాయమని పేర్కొన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత అత్యధిక జల విద్యుత్ ఉత్పత్తి సాధించిన ఘనత సాగర్ కేంద్రానికే దక్కిందన్నారు. ఇంజినీర్లు, సిబ్బంది సమన్వయంతోనే ఈ విజయాన్ని సాధించగలిగామని తెలిపారు. ఈ సందర్భంగా విద్యుత్ కేంద్రంలో కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. కార్యక్రమంలో జెన్​కో ఎస్‌‌‌‌ఈలు రఘురాం, శ్రీనివాస్ రెడ్డి, ఇంజినీర్లు, సిబ్బంది పాల్గొన్నారు.