రౌడీయిజం, కబ్జాలపై ఉక్కుపాదం..రెండేళ్లలో నల్గొండను స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేస్తా

రౌడీయిజం, కబ్జాలపై ఉక్కుపాదం..రెండేళ్లలో నల్గొండను స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేస్తా
  • మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

నల్గొండ అర్బన్, వెలుగు: రానున్న రెండేళ్లలో నల్గొండ పట్టణాన్ని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దుతామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. బుధవారం నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 38, 41 డివిజన్లలో సుమారు రూ.1.30 కోట్లతో పార్కుల అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, పట్టణంలోని అన్ని పార్కులను మోడల్ పార్కులుగా తీర్చిదిద్దుతామని, శానిటేషన్‌‌‌‌, తాగునీటికి అత్యంత ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు.

ఇకపై ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తామని, మేయర్‌‌‌‌, డిప్యూటీ మేయర్‌‌‌‌, కార్పొరేటర్లు ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ఎస్‌‌‌‌ఎల్‌‌‌‌బీసీ సొరంగం లైనింగ్ పనులు ప్రారంభమయ్యాయని, బ్రాహ్మణ వెల్లెంల ద్వారా సాగునీరు అందిస్తున్నామని తెలిపారు.

నల్గొండలో రౌడీయిజం, గంజాయి, అక్రమ కబ్జాలపై ఉక్కుపాదం మోపుతామని, పట్టణాన్ని ప్రశాంతతకు మారుపేరుగా మారుస్తామని స్పష్టం చేశారు. అనంతరం నల్గొండలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల వార్షికోత్సవంలో మంత్రి మాట్లాడారు. అలాగే ట్రస్మా జిల్లా కమిటీ రూపొందించిన క్యాలెండర్‌‌‌‌ను ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, కలెక్టర్ బి.చంద్రశేఖర్, మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి, ఎస్పీ శరత్ చంద్ర పవార్, డిప్యూటీ మేయర్ ఆశ్రఫ్ అలీ మహమ్మద్, కార్పొరేటర్లు వేదశ్రీ, దాసరి సాయి, కేసాని వేణుగోపాల్ రెడ్డి పాల్గొన్నారు.