కారు, కమలం దోస్తానా.. ఖానాపూర్లో రెండు పార్టీల సెటిల్మెంట్

 కారు, కమలం దోస్తానా.. ఖానాపూర్లో రెండు పార్టీల సెటిల్మెంట్
  • బీఆర్ఎస్​కు చైర్​పర్సన్ పదవి
  • బీజేపీకి వైస్ చైర్​పర్సన్, కో ఆప్షన్ పదవులు
  • ప్రతిపాదించిన బీజేపీ.. ఓకే చెప్పిన బీఆర్ఎస్
  •  ఎన్నిక నిర్వహణ నిర్ణయం ఎలక్షన్ కమిషన్ పరిధిలోకి..

నిర్మల్/ఖానాపూర్, వెలుగు: మున్సిపల్​ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచి తీవ్ర ఉత్కంఠకు దారితీసిన ఖానాపూర్ మున్సిపల్ చైర్​పర్సన్, వైస్ చైర్​పర్సన్ ఎన్నిక వ్యవహారం ఎట్టకేలకు ఓ కొలిక్కి వచ్చింది. అనూహ్యంగా ఇక్కడ బీజేపీ, బీఆర్ఎస్ దోస్తీ కట్టాయి. బీజేపీ, బీఆర్​ఎస్​నేతలు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. దీంతో కారుకు చైర్​పర్సన్ పదవి, కమలానికి వైస్ చైర్​పర్సన్, కో ఆప్షన్ పదవులు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఎన్నిక రెండుసార్లు వాయిదా

ఖానాపూర్​మున్సిపాలిటీలో మొత్తం 12 వార్డులకు ఎన్నికల్లో బీజేపీ 4, బీఆర్ఎస్ 4 వార్డుల్లో విజయం సాధించగా కాంగ్రెస్ మూడు చోట్ల గెలిచింది.  ఇండిపెండెంట్ గా గెలిచిన మరో కౌన్సిలర్ కాంగ్రెస్ లో చేరారు. దీంతో ఆ పార్టీ బలం కూడా నాలుగుకు చేరింది. మూడు పార్టీలకు 4 చొప్పున కౌన్సిలర్ పదవులు ఉండడంతో హంగ్ ఏర్పడింది. ఈనెల 16న చైర్​పర్సన్, వైస్​ చైర్​పర్సన్ పదవులకు ఎన్నిక జరగాల్సి ఉండగా కేవలం కాంగ్రెస్ కౌన్సిలర్లు మాత్రమే ఎమ్మెల్యే ఎక్స్ అఫిషియో సభ్యుడైన బొజ్జు పటేల్ తో కలిసి మున్సిపాలిటీకి వచ్చారు. దీంతో కోరం లేక ఎన్నికను అధికారులు వాయిదా వేశారు. మరుసటి రోజు కూడా కాంగ్రెస్ కౌన్సిలర్లు మాత్రమే హాజరవడంతో మళ్లీ వాయిదా వేయాల్సి వచ్చింది. అయితే మూడోసారి ప్రత్యేక సమావేశం నిర్వహిస్తే హాజరయ్యే వారిలో నుంచే ఒకరు చైర్​పర్సన్, మరొకరు వైస్ చైర్​పర్సన్ పదవులకు ఎంపికయ్యే అవకాశం ఉంటుంది. దీంతో అప్రమత్తమైన బీఆర్ఎస్, బీజేపీ ఓ సెటిల్​మెంట్​కు వచ్చాయి.

 బీజేపీ ప్రెస్​మీట్.. స్పందించిన బీఆర్​ఎస్

మారుతున్న రాజకీయ పరిస్థితి నేపథ్యంలో అలర్ట్​అయిన బీజేపీ నాలుగు రోజుల ఉత్కంఠకు తెరదించింది. బుధవారం ఆ పార్టీకి చెందిన రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ ఆకుల శ్రీనివాస్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. తమ పార్టీకి చైర్​పర్సన్ పదవి ఇస్తే వైస్ చైర్​పర్సన్, కో ఆప్షన్ సభ్యుల పదవులను బీఆర్ఎస్ కు  ఇస్తామని.. ఒకవేళ బీఆర్ఎస్ చైర్​పర్సన్ పదవిని ఆశిస్తే, తాము ఆ పార్టీకి మద్దతిచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు.

తమకు వైస్ చైర్​పర్సన్, కో ఆప్షన్ పదవులు ఇవ్వాలని కోరారు. బీజేపీ చేసిన ప్రతిపాదనకు బీఆర్ఎస్ నేతలు కూడా ఓకే చెప్పారు. ప్రతిపాదనను తాము సమ్మతిస్తున్నామని, చైర్​పర్సన్ పదవిని తాము తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని, అలాగే రెండు కోఆప్షన్ సభ్యుల పదవులు తమకు కేటాయించాలని మాజీ జడ్పీటీసీ రాథోడ్ రాము నాయక్ ఆ పార్టీ నేత జాన్సన్ నాయక్ ఇంట్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. వైస్ చైర్మన్ తో పాటు మరో రెండు కోఆప్షన్ సభ్యుల పదవులను బీజేపీకి ఇచ్చేందుకు తమకు సమ్మతమేనని వెల్లడించారు. దీంతో ఈ రెండు పార్టీల మధ్య అవగాహన కుదిరినట్లు తెలుస్తోంది.

కాంగ్రెస్​కు షాక్

బీజేపీ చేసిన ప్రకటన కాంగ్రెస్​కు షాక్ ఇచ్చినట్లయ్యింది. కాంగ్రెస్​కు నలుగురు కౌన్సిలర్లతో పాటు ఎక్స్ అఫీషియో సభ్యుడైన ఎమ్మెల్యే బొజ్జు పటేల్ మద్దతుండడంతో ఆ పార్టీ బలం ఐదుకు చేరింది. అయితే బీజేపీ, బీఆర్ఎస్ కలిస్తే మొత్తం 8 మంది కౌన్సిలర్ల బలం సమకూరుతుంది. దీంతో ఈ రెండు పార్టీల కూటమికి పూర్తి మెజార్టీ దక్కినట్లవుతుంది. దీంతో ఈ రెండు పార్టీల నుంచే చైర్​పర్సన్, వైస్ చైర్​పర్సన్ తో పాటు ఇతర పదవులు వచ్చే అవకాశంఉంటుంది.

 అప్పటివరకు క్యాంపులోనే..

 చైర్​పర్సన్, వైస్ చైర్​పర్సన్ ఎన్నిక ప్రక్రియ రెండుసార్లు వాయిదా పడడంతో ప్రస్తుతం ఈ వ్యవహారం రాష్ట్ర ఎన్నికల కమిషన్ చేతిలోకి వెళ్లింది. అయితే ఈ రెండు పదవులకు ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలనేది నిర్ణయించాల్సి ఉంది. అప్పటివరకు బీజేపీ, బీఆర్ఎస్ కౌన్సిలర్లంతా క్యాంపులోనే ఉండనున్నారు. చైర్​పర్సన్, వైస్ చైర్​పర్సన్ ఎన్నికకు ఎన్నికల కమిషన్ తేదీ ప్రకటించగానే అదే రోజు వీరంతా ఖానాపూర్ కు చేరుకోనున్నారు. అప్పటివరకు క్యాంపు రాజకీయం తప్పకపోవచ్చు.