
ఏటూరునాగారం, వెలుగు : ప్రతీ పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు కట్టించే బాధ్యత తనదేనని మంత్రి సీతక్క హామీ ఇచ్చారు. ములుగు జిల్లా ఏటూరునాగారంలో ముస్లిం మైనార్టీ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి బుధవారం ఆమె శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పేదల కోసం పనిచేస్తోందని చెప్పారు.
ఇందిరమ్మ ఇండ్ల మొదటి విడతలో ఏటూరునాగారం మండల కేంద్రానికి చెందిన ముస్లింలకు 140 ఇండ్లు మంజూరు చేశామని, భవిష్యత్‌లో ప్రతి ఒక్కరికీ ఇల్లు ఇస్తామని చెప్పారు. అనంతరం కమ్యూనిటీ హాల్ మంజూరు చేయడం పట్ల మంత్రి సీతక్కకు జమా మసీదు కమిటీ అధ్యభుడు సయ్యద్ అఫ్జల్ పాషా ధన్యవాదాలు తెలిపారు.
ముస్లిం మత పెద్దలు మంత్రిని శాలువాతో సన్మానించారు. అనంతరం పలువురు తమ సమస్యలపై వినతిపత్రాలు అందజేయగా.. అన్ని సమస్యలు పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ మహేందర్, తహసీల్దార్ జగదీశ్వర్, కాంగ్రెస్జిల్లా, మండల అధ్యక్షులు పైడాకుల అశోక్, చిటమట రఘు, జమా మసీదు కమిటీ ప్రధాన కార్యదర్శి ఆరిఫ్, కోశాధికారి సుజావత సర్కార్, సులేమాన్, గీయా, అక్బర్, అబ్దుల్ రవూఫ్ పాల్గొన్నారు.