ఆదివాసీ కుంభమేళాగా ప్రసిద్ధి చెందిన మేడారంలో పునరుద్ధరణ పనులను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడ్తున్నది. మరో వందేండ్లయినా చెక్కుచెదరకుండా ఉండేలా గ్రానైట్‌తో గద్దెలు, వాటి చుట్టూ స్తంభాలు, స్వాగత తోరణాలను ఏర్పాటు చేస్తున్నది. కోయల ఆచార సంప్రదాయాలకు తగ్గట్టుగా పనులు చేపడుతూ.. సమ్మక్క, సారక్క తల్లుల చరిత్ర అందరికీ తెలిసేలా శిలలపై చెక్కుతున్నది. కోయల వద్ద దొరికిన 930 ఏండ్ల నాటి తాళపత్ర గ్రంథాల ఆధారంగా చెక్కించిన ఏడు వేల శిల్పాలు, చిహ్నాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. సమ్మక్క, సారక్క, పగిడిద్దరాజు, గోవిందరాజు, కోయల ఇష్టదైవాలకు ప్రతిరూపంగా భావించే పులి, జింక, దుప్పి, పావురం, ఏనుగు, నెమలి, మొసలి, పశుపక్ష్యాదులతో పాటు కోయల జీవనశైలికి, ఆచార సంప్రదాయాలకు, గొట్టుగోత్రాలకు ప్రతిరూపంగా భావించే సూర్యచంద్రులు, త్రిశూలం, నెలవంక, బండి చక్రాలు, అడ్డ, నిలువు గీతలకు స్తంభాలపై చోటు దక్కింది. అలాగే సమ్మక్క సారక్క వంశస్తులైన దాదాపు 250 కోయల ఇంటి పేర్లు, వారి మూలాలను శిలలపై చెక్కడం ద్వారా వాళ్ల చరిత్రను భావితరాలు తెలుసుకునే వీలు కలుగుతుందని ఆలయ అభివృద్ధి పనులు చూస్తున్న ఆర్కిటెక్ట్‌లు తెలిపారు.
ఒక్కో చిహ్నానికి ఒక్కో ప్రత్యేకత...
ప్రధాన ద్వారం అడ్డం రెండో వరుస..
18 దిక్కుల చిహ్నం: కింది భాగంలో చెక్కిన ఈ గుర్తు ప్రాచీన అఖండ భారత భూభాగంలోని 18 దిక్కులను తెలియజేస్తుంది. ఉత్తర భారతాన మూడో గొట్టు 36 రాజ్యాలను, దక్షిణాన బెరంబోయిన రాజు ఆరో గొట్టు 18 రాజ్యాలు పాలించినట్టు కోయల చరిత్ర చెబుతున్నది.
నెలవంక, ఏనుగు:నెలవంక అంటే ఆరో గొట్టు బేరంబోయిన వంశం వారి నుదుటిబొట్టును తెలుపుతుంది. వారి గోత్ర జంతువు ఏనుగు. మూడు అడ్డగీతలు మధ్యలో చుక్క.
ఆదిశక్తి: కోయలు ప్రకృతి అర్థంలో స్త్రీ అండ రూపాన్ని (సంతానోత్పత్తిలో కీలకం కాబట్టి) దైవంగా పూజిస్తారు. ఆదిశక్తి మళ్లీ
సమ్మక్క రూపంలో అవతరించిందని కోయలు నమ్ముతారు.
పులి: సమ్మక్క తల్లి పులి రూపంలోఉంటుందన్నది కోయల విశ్వాసం.
కోయతుర్ ధర్మ చిహ్నం: కోయల ఇంటి పేర్లు, సంప్రదాయాలతో పాటు పశుపతి బేరంబోయిన రాజు ధర్మం దిశానిర్దేశంగా భావిస్తారు.
తూతకొమ్ము: కోయలు వేల్పు పండగ, జాతర సమయంలో దీన్ని ఉపయోగిస్తారు. ఇది పవిత్ర వాయిద్యం. ఈ శబ్దం లేకుండా దైవం కొండ దిగిరాదని చెప్తారు.
చక్రం: రాయి బండానీ వంశంలో రాయి బండానీ రాజు బండి చక్రం కనుగొన్నాడని చెప్తారు. అందుకే రాయి బండానీ వంశం చిహ్నంగా చక్రాన్ని కొలుస్తారు.
రంభ: సమ్మక్క తల్లి అడవిలో రంభ అనే పక్షి రూపంలో ఉంటుందని కోయలు భావిస్తారు.
నాగుపాము: సమ్మక్క చెల్లెలు నాగులమ్మ నాగుపాము రూపంలో ఉందని నమ్ముతారు.
ఎండి ముక్కు కొకాడి, పైడి ముక్కు కొకాడి: కోయలకు అడవిలో భూమి జీవనానికి అనువుగా ఉండేది కాదు. భూమి బురదగా ఉండటానికి కారణమైన ఏర పురుగులను కాకులు తినడం ద్వారా భూమి గట్టి పడేలా సహాయం చేశాయని ఈ చిహ్నం తెలుపుతుంది.
ఎద్దు: వడ్డే గోత్రం మూగొ గొట్టు నుదుటి బొట్టు. మూడు అడ్డగీతలు మధ్యలో చుక్క. గోత్ర జంతువు ఎద్దు.
ఖడ్గమృగం: నిలువు గీత నాల్గవ గోట్టు సనపగాని వంశం నుదుటి బొట్టును తెలియజేస్తుంది. వీళ్ల గోత్ర జంతువు ఖడ్గమృగం.
త్రిశూలం, ఒంటికొమ్ము దుప్పి: త్రిశూలం ఐదో గొట్టు రాయి బండానీ వంశం నుదుటి బొట్టును తెలియజేస్తుంది. వీళ్ల గోత్ర పూజిత జంతువు ఒంటికొమ్ము దుప్పి.
ఆదివాసీ కుంభమేళాగా ప్రసిద్ధి చెందిన మేడారంలో పునరుద్ధరణ పనులను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడ్తున్నది. మరో వందేండ్లయినా చెక్కుచెదరకుండా ఉండేలా గ్రానైట్‌తో గద్దెలు, వాటి చుట్టూ స్తంభాలు, స్వాగత తోరణాలను ఏర్పాటు చేస్తున్నది నెలవంకలో చుక్క ఏడో గొట్టు పారేడు గట్టు వంశం నుదుటి బొట్టును తెలుపుతుంది. వీళ్ల గోత్రం పూజిత జంతువు మనుబోతు.
సింహం: వడ్డే గోత్రాన్ని తెలియజేస్తుంది. ఎక్స్ ఆకారం పసుపు కుంకుమ బొట్టు లేకుండా దేవుడు గుట్ట దిగిరాడని తెలుపుతుంది. వీరి గోత్ర పూజిత జంతువు సింహం.
జింక: కోయలు జింకను సారలమ్మ ఆరాధ్య దైవంగా భావిస్తారు.
సూర్యచంద్రులు: సూర్యచంద్రులు సృష్టిని నడుపించే దైవంగా కొలుస్తారు.
కల కోడి, కలక తామరపువ్వు: ఈ సృష్టి మూలం నీటి నుంచి మొదలైందని తెలుపుతుంది. ఈ బొమ్మను ప్రధాన ద్వారంలో ఇరువైపులా, ఇతర అన్ని ద్వారాలపై ఉంటుంది.
