హైదరాబాద్, వెలుగు: డ్రగ్స్, గంజాయిని కట్టడి చేసేందుకు ఈగల్ ఫోర్స్ స్పెషల్ ఆపరేషన్లు నిర్వహిస్తున్నది. మాదకద్రవ్యాలను గుర్తించడంతో పాటు బానిసలైన యువతకు తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ చేపట్టింది. ఇందులో భాగంగా హైదరాబాద్ నార్కోటిక్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో మంగళవారం సోదాలు నిర్వహించింది.
టెలీకాలర్, కస్టమర్ సర్వీస్ సపోర్ట్, ఫిట్‌నెస్ ట్రైనర్, కార్పొరేట్ ఈవెంట్స్ ఆర్గనైజర్ సహా గంజాయి వాడుతున్న 11 మందిని అరెస్టు చేసింది. గంజాయి, మత్తు ఇంజెక్షన్ల కారణంగా చంద్రాయణగుట్టలో ఇద్దరు యువకులు, బాలాపూర్‌లో విద్యార్ధి(17), రాజేంద్రనగర్‌లో మొబైల్ టెక్నీషియన్ మృతికి సంబంధించిన కేసులో ఈగల్ ఫోర్స్ ఆధారాలు సేకరించింది.
ఈ మూడు ఘటనలకు గంజాయి ప్రధాన కారణం కావడంతో బానిసలైన యువతను ట్రేస్ చేస్తున్నది. ఇందులో భాగంగా ఆగస్టు 1న సికింద్రాబాద్ బొల్లారం రిసాలబజార్‌లోని సాధన మందిర్ స్యూల్ గ్రౌండ్‌లో పట్టుబడిన గంజాయి కస్టమర్ల కేసు ఆధారంగా దర్యాప్తు చేసింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న గంజాయి సప్లయర్లు జరీనాబేగం, అర్ఫత్ అహ్మద్ ఖాన్ కస్టమర్లను గుర్తించింది.
ఇందులో సికింద్రాబాద్‌కు చెందిన కస్టమర్ సర్వీస్ సపోర్టర్ అజర్(26), టెలీకాలర్ హరిప్రసాద్(24), ఫిట్‌నెస్ ట్రైనర్ మహేశ్(29), కార్పొకేట్ ఈవెంట్స్ ఆర్గనైజర్ కైలాశ్‌నాథ్(25), మార్కెటింగ్ ఏజెంట్ శ్రవణ్‌కుమార్(34), వ్యాపారవేత్త తేజస్వి రాజ్‌సింగ్(36) ఫీల్డ్ ఆఫీసర్ అజరుద్దీన్(30), బ్యాంకు ఉద్యోగి అమన్(24), ఫాస్ట్‌ఫుడ్ నిర్వాహకుడు అద్నాన్ అహ్మద్(21)తో పాటు మేడ్చల్‌కు చెందిన ప్రైవేట్ ఉద్యోగి సాహిత్(25), హకీంపేట్‌కు చెందిన సాయి కిరణ్(26)లకు డ్రగ్ టెస్ట్ నిర్వహించారు. వీరంతా గంజాయి తీసుకుంటున్నట్టు తేలడంతో తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ ఇచ్చారు.
అనంతరం డీ అడిక్షన్, రిహాబిలిటేషన్ సెంటర్లకు తరలించారు. డీ-అడిక‌్షన్ కోర్సు తర్వాత కూడా బాధితులకు అవసరమైన సహకారం అందిస్తామని ఈగల్ ఫోర్స్ అధికారులు తెలిపారు. డ్రగ్స్, గంజాయి సహా ఇతర మాదకద్రవ్యాల గురించి తెలిస్తే టోల్‌ఫ్రీ నంబర్ 1908, వాట్సాప్: 87126 71111, మెయిల్ ఐడీ tsnabho-hyd@tspolice.gov.in ద్వారా సమాచారం అందించాలని ఈగల్ ఫోర్స్ అధికారులు సూచించారు.

