యాదాద్రిలో అప్పుడే ప్రలోభాలు.. మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడక ముందే ఆశావహుల ధూమ్ ధామ్

యాదాద్రిలో అప్పుడే ప్రలోభాలు.. మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడక ముందే ఆశావహుల ధూమ్ ధామ్
  • సంక్రాంతికి చికెన్​, మటన్​, లిక్కర్​, కుక్కర్​ కూడా పంపిణీ

యాదాద్రి, వెలుగు :  మున్సిపల్​ ఎన్నికల నోటిఫికేషన్​ వెలువడనే లేదు. కౌన్సిలర్లుగా పోటీ చేసే ఆలోచనలో ఉన్న వాళ్లు కొన్ని వార్డుల్లో అప్పుడే రంగంలోకి దిగిపోయారు. ఇంటింటికి వెళ్లి ఓటర్లను కలుస్తున్నారు. వారిని మచ్చిక చేసుకోవడానికి సంక్రాంతిని ఫుల్​గా వాడేసుకున్నారు. పండుగ పేరుతో లిక్కర్​, చికెన్, మటన్​తో పాటు కొన్ని చోట్ల కుక్కర్లు కూడా​ పంపిణీ చేశారు. యాదాద్రి జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల్లో 104 వార్డులున్నాయి. ఫైనల్​ లిస్ట్​ ప్రకారం 1,32,711 ఓటర్లు ఉన్నారు. ఈ ఆరు మున్సిపాలిటీలోని ఓటర్లలో మహిళలే ఎక్కువగా ఉన్నారు.

 పురుషులు 64,926 మంది ఉండగా మహిళలు 67,767 మంది ఉన్నారు. మొత్తంగా 2841 మంది మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో 16 మంది ట్రాన్స్​జెండర్లు ఉండగా ఆలేరు, భువనగిరిలో ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు. మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి ఫైనల్​ ఓటర్​ లిస్ట్​ రిలీజ్​ అయింది. వార్డులను కూడా ఫైనల్​ చేశారు. ఓవరాల్​గా రిజర్వేషన్లు ఖరారు అయ్యాయి. కానీ ఇప్పటివరకూ ఎన్నికల నోటిఫికేషన్​ రిలీజ్​ కాలేదు. ఏ వార్డు ఏ సామాజిక వర్గానికి రిజర్వేషన్​ అయిందో తేలక పోయినా ఆశవహులు మాత్రం టికెట్​ ప్రయత్నాలు ముమ్మరం చేయడమే కాకుండా వార్డుల్లో జనాలను ప్రసన్నం చేసుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు. 

మటన్​, చికెన్​, లిక్కర్​ పంపిణీ 

 పార్టీ టికెట్​ తనకే వస్తుందని, మహిళకు రిజర్వేషన్​ అయితే తన భార్య లేదంటే కోడలు పోటీ చేస్తారని కొందరు లోకల్​ లీడర్లు ప్రచారం చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా ఓటర్లను నేరుగా కలుసుకుంటున్నారు. సంక్రాంతి పండుగ నాడు ఇంటింటికీ కిలో చికెన్​, క్వార్డర్​ బాటిల్​ పంపిణీ చేశారు. మరికొందరు ఇంటికో ఫుల్​ బాటిల్​ పంపారు. కొందరు తక్కువ రేటున్న లిక్కర్​ను పంపిణీ చేయగా వారి ప్రత్యర్థులు ప్రీమియం లిక్కర్​పంచారు. పోటాపోటీగా లిక్కర్​ పంపకాలతో మున్సిపాలిటీల్లో ముందస్తు ఎన్నికల సందడి కనిపించింది. 

యాదగిరిగుట్టలో ప్రతి ఇంటికి మటన్​తో పాటు ఫుల్​ బాటిల్​ లిక్కర్​ పంపిణీ చేశారు. అయితే టికెట్​ ఆశిస్తున్న ఓ అభ్యర్థి తన పుట్టిన రోజును పురస్కరించుకొని తన వార్డులో రైస్​ కుక్కర్లు పంపిణీ చేశారు. రిజర్వేషన్లు, టికెన్​ కన్ఫామ్​ కాకున్నా ఇలా పోటీలు పడుతూ ఓటర్లను కలుసుకుంటూ ప్రలోభాలకు గురి చేస్తుండడంపై జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.