- సోషల్ మీడియాకు ఇన్చార్జీలు
- వార్డుల వారీగా వాట్సాప్ గ్రూప్‌లు
- కొత్త కంటెంట్, కొటేషన్లపై దృష్టి
.నిర్మల్, వెలుగు: మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ వెలువడకముందే ముందస్తు ప్రచార పర్వం ఊపందుకుంటోంది. కౌన్సిలర్ పదవులకే కాకుండా చైర్మన్ పదవిపై గురిపెట్టిన ఆశావహులు వార్డుల్లోని ముఖ్యులైన వారి ఇండ్లకు వెళ్లి తమకు మద్దతు ఇచ్చి గెలిపించాలని కోరుతున్నారు. ఈసారి నిర్మల్, భైంసా మున్సిపాలిటీలో కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం మధ్య ముక్కోణపు పోటీ ఉండగా.. ఖానాపూర్ లో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య పోటీ ఉండబోయే అవకాశాలున్నాయి.
ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్, బీజేపీలు పక్కా పబ్లిసిటీతో ప్రజల మద్దతు కూడగట్టే ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ఇప్పటికే ఈ రెండు పార్టీలు సోషల్ మీడియాను వేదికగా చేసుకొని తమ ప్రచార పర్వాన్ని హోరెత్తిస్తున్నాయి. వార్డుల వారీగా వాట్సాప్ గ్రూపులను ఏర్పాటు చేసి తమకు అనుకూలమైన పోస్టులు, కౌన్సిలర్ పదవులకు పోటీ చేసే ఆశావహులకు సంబంధించిన కంటెంట్‌తో కూడిన వీడియోలను వైరల్ చేస్తున్నారు.
టికెట్ రాకముందు ఒకటి.. ఖరారైతే మరొకటి..
కొంతమంది పోల్ మేనేజ్మెంట్ ఏజెన్సీలకు పబ్లిసిటీ బాధ్యతలు అప్పజెప్తున్నారు. టికెట్ ఖరారు కాకముందు ఓ రకమైన ప్రచారం, టికెట్ ఖరారైన తర్వాత మరో రకమైన ప్రచారానికి సంబంధించిన వీడియోలు రూపొందిస్తున్నారు. అలాగే వాట్సప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లాంటి సోషల్ మీడియా వేదికలను సమర్థవంతంగా వినియోగించుకునేందుకు కాంగ్రెస్, బీజేపీ నేతలు వార్డుల వారీగా ఇన్చార్జీలను నియమిస్తున్నాయి.
ఇప్పటికే మున్సిపాలిటీల్లోని అన్ని వార్డుల్లో ఆశావహుల ఇలాంటి వాట్సప్ గ్రూపులు ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పటివరకు ఎన్నికల షెడ్యూల్ వెలువడకపోయినా, పార్టీలు తమ అభ్యర్థులను ఖరారు చేయకపోయినప్పటికీ మున్సిపల్ ఎన్నికల ముందస్తు ప్రచారం మాత్రం సోషల్ మీడియాల్లో హోరెత్తుతోంది.
కొత్త కంటెంట్, కొటేషన్లపై ఫోకస్
పోటీ చేసే అభ్యర్థులంతా దాదాపు సోషల్ మీడియా ప్రచారంపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు.
కొత్త రకమైన కంటెంట్ రూపొందించేందుకు అనుభవమున్న పోల్ మేనేజ్మెంట్ ఏజెన్సీలతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు. వరంగల్, కరీంనగర్, హైదరాబాద్ కు చెందిన కొన్ని ఏజెన్సీల ప్రతినిధులు ప్రస్తుతం జిల్లాలో తిరుగుతూ ఆశావహుల వివరాలు సేకరించి ప్రచారానికి సంబంధించిన కంటెంట్ అందించేందుకు ఒప్పందం చేసుకుంటున్నాయి. ఇందుకుగానూ ఏజెన్సీల ప్రతినిధులుకు పెద్ద మొత్తంలో చెల్లిస్తున్నారు. ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న పాటలు, జానపద గేయాలు, సినిమా డైలాగులను తమ వీడియో క్లిప్పింగులకు జోడించి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.
ప్రచార హోర్డింగులు, ప్రధాన అడ్డాలు రిజర్వ్
కౌన్సిలర్ పదవులకు పోటీ చేయాలనుకునే కొంతమంది ఇప్పటినుంచే ప్రచార హోర్డింగులను రిజర్వ్ చేసుకుంటున్నారు. ప్రధాన అడ్డాలను కూడా రిజర్వ్ చేసుకొని తమ ప్రచార ఫ్లెక్సీలు, హోర్డింగులు ఏర్పాటు చేసుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. మొత్తానికి ఈసారి జరగబోయే మున్సిపల్ ఎన్నికలు పబ్లిసిటీతో హైటెక్ ప్రచారానికి సిద్ధమవుతున్నాయి.
