ఎర్త్ అవర్.. గత 18 ఏండ్లుగా ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పులపై ప్రజలకు అవగహన కల్పించేందుకు డబ్ల్యూడబ్ల్యూఎఫ్ (వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్) సంస్ధ ప్రతి ఏటా'ఎర్త్ అవర్' కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ ఎర్త్ అవర్ లో భాగంగా ప్రతి ఏటా ఓ రోజు రాత్రి గంట సేపు ఇంట్లోని దీపాలు ఆర్పేసి భూమాతకు తమ మద్దతును తెలుపుతారు. ఈ క్రమంలోనే ఈ ఏడాది మార్చి 23న సాయంత్రం 8:30 నుంచి 9: 30 వరకు ఎర్త్ అవర్ కార్యక్రమాన్ని డబ్ల్యూడబ్ల్యూఎఫ్ నిర్వహించనుంది.
అసలు ఏంటీ ఎర్త్ అవర్ కథ..?
ప్రకృతి మనకు ప్రతి ఏటా 125 ట్రిలియన్ డాలర్ల విలువగల ఆహారం, నీరు, గాలి మరియు ఇతర సేవలు అందిస్తోంది. అభివృద్ధి పేరుతో గత 50 సంవత్సరాల నుంచి ప్రకృతికి కనివినీ ఎరుగని నష్టం జరిగింది. ఈ నేపథ్యంలో కర్బన ఉద్గారాలను తగ్గించడం, భూతాపం, వాతావరణ మార్పులకు వ్యతిరేకంగా.. పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా డబ్ల్యూడబ్ల్యూఎఫ్ (వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్) ఎర్త్ అవర్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.
ఆస్ట్రేలియా నుంచి ఇండియా దాక..
2007లో ఆస్ట్రేలియాలోని సిడ్నీలో తొలిసారిగా ఈ ఎర్త్ అవర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ఏడాది సుమారు 190 దేశాల్లోని ఏడువేల నగరాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా పలు నగరాల్లో గృహాలు, వ్యాపార కేంద్రాలు, ఇతర కార్యాలయాల్లో గంటపాటు విద్యుత్ కాంతులను ఆపివేసి పర్యావరణానికి మేలు చేయడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం. మనదేశం కూడా ఈ సామూహిక పర్యావరణ హిత కార్యక్రమంలో భాగం కానుంది. ఈ క్రమంలో 2024కు గాను 'ఎర్త్ అవర్ ఇండియా' గుడ్‌విల్ అంబాసిడర్ భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు ఎంపికైంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడాది మార్చి చివరి శనివారం ఎర్త్ అవర్‌ను పాటించడం ఆనవాయితీగా వస్తోంది.
