
ధ్రువాల కదలిక వేగవంతం
భూమి అయస్కాంత ధ్రువాలు రివర్స్ అయ్యే ప్రక్రియ వేగం పుంజుకుందట. ఇటీవలి కాలంలో దాని వేగం ఎక్కువైందట. ఇదే ఇప్పుడు సైంటిస్టులను ఆందోళన పెడుతోందట. నిజానికి అయస్కాంత ధ్రువాలు వేల ఏండ్లకు ఒకసారి ఉల్టా పల్టా అయిపోతాయి. అంటే.. ఉత్తర అయస్కాంత ధ్రువం క్రమంగా కిందకు కదులుతూ దక్షిణానికి, దక్షిణ ధ్రువం ఉత్తరానికి చేరుకుంటాయన్నమాట. 20 వేల ఏండ్లలో ఈ చర్య పూర్తవుతుందని అంచనా. ఇక చివరిసారిగా ఇలా భూమి మ్యాగ్నెటిక్పోల్స్7.70 లక్షల ఏళ్ల కిందట తారుమారు అయ్యాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
ప్రస్తుత రివర్సింగ్ 1831లో మొదలైందని సైంటిస్టులు చెబుతున్నారు. కెనడియన్ ఆర్కిటిక్ నుంచి రష్యా వైపు అది కదులుతోందని చెబుతున్నారు. ఏడాదికి 56 కిలోమీటర్ల వేగంతో కదులుతోందట. ఊహించిన దానికన్నా ఇది చాలా ఎక్కువ వేగమని శాస్త్రవేత్తలు అంటున్నారు. భూమిపై జీపీఎస్, నావిగేషన్లకు భూమి అయస్కాంత క్షేత్రమే ఆధారం. పూర్తిగా ఎప్పుడు అది రివర్స్ అవుతుందో కచ్చితంగా చెప్పలేకపోయినా, మన జీవితకాలంలో జరిగితే మాత్రం నావిగేషన్ వ్యవస్థలన్నీ గందరగోళంలో పడతాయని, శాటిలైట్లు, కమ్యూనికేషన్లు దెబ్బతింటాయని చెబుతున్నారు. భూఅయస్కాంత క్షేత్రం చాలా ఏళ్లు అస్థిరంగా ఉండి, భవిష్యత్ తరాలు ఇబ్బందులు పడతాయని అంటున్నారు.