టర్కీలో మళ్లీ భూకంపం

టర్కీలో మళ్లీ భూకంపం

ఇస్తాంబుల్: టర్కీలో మళ్లీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై తీవ్రత 4.7గా రికార్డయ్యిందని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (యూఎస్​జీఎస్) తెలిపింది. ఆదివారం అర్ధరాత్రి దాటాక టర్కీలోని కొన్ని ప్రాంతాల్లో భూమి కంపించినట్టు వివరించింది. సౌత్​ టర్కీలోని కహ్రామన్మరస్ సిటీకి దగ్గర్లో 15.7 కిలో మీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించామని యూఎస్​జీఎస్ అధికారులు తెలిపారు. అయితే, ఈ తాజా భూకంపంతో ప్రాణ, ఆస్తి నష్టం సంభవించినట్లు ఎలాంటి సమాచారం లేదని వివరించారు. శిథిలాల కింద చిక్కుకుపోయిన వారిని బయటికి తీసేందుకు ఇటు రెస్క్యూ సిబ్బంది కష్టపడుతుంటే.. అటు భూమి కంపిస్తూనే ఉంది. రెండుగా చీలిన టర్కీ హతాయ్ ఎయిర్‌‌‌‌పోర్టులోని రన్​వేకు రిపేర్​ చేశామని సిబ్బంది తెలిపారు. సోమవారం నుంచే సేవలు ప్రారంభమైనట్లు వివరించారు. మృతుల సంఖ్య 34 వేలకు చేరుకుంది. టర్కీలో 30వేల మంది చనిపోగా.. సిరియాలో 4వేలకు పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. 

178 గంటల తర్వాత బయటపడ్డ చిన్నారి

శిథిలాల కింది నుంచి ఆదివారం కూడా పలువురిని రెస్క్యూ సిబ్బంది సేఫ్​గా బయటికి తీశారు. అదియామన్​ ప్రావిన్స్​లో 178 గంటలుగా శిథిలాల కింద ఉండిపోయిన నాలుగేండ్ల చిన్నారిని కాపాడారు. ఇస్తాంబుల్ ప్రావిన్స్ అంటాక్యా సిటీలో నైదే ఉమయ్ అనే మహిళను రెస్క్యూ చేశారు. గాజియెన్​టెప్​ ప్రావిన్స్ ఇస్లాహియే టౌన్​లో 5 అంతస్తుల బిల్డింగ్ కూలిపోవడంతో దాని కింద చిక్కుకుపోయిన 40 ఏండ్ల మహిళను కూడా కాపాడారు. అదియామన్, ఇస్తాంబుల్, గాజియెన్​టెప్​ ప్రావిన్స్​లోని చాలా ప్రాంతాల్లో బాధితులకు కనీస సౌలత్​లు ఏర్పాటు చేయలేదు. షెల్టర్స్ కూడా లేకపోవడంతో వీధుల్లో చలికి వణికిపోతున్నారు. 1939 అంటాక్యా భూకంపం తర్వాత ఇదే భారీ నష్టాన్ని మిగిల్చిందని అధికారులు తెలిపారు. ఇదే అవకాశంగా కొందరు దొంగలు రెచ్చిపోతున్నారు. ఇండ్లు, షాపులు, సూపర్​ మార్కెట్లను దోచుకుంటున్నారు. కూలిన ఇండ్ల శిథిలాల కింద ఉన్న విలువైన వస్తువుల కోసం గాలిస్తున్నారు. దీంతో టర్కీ పోలీసులు శిథిలాల చుట్టూ కంచె ఏర్పాటు చేసి సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. 

ఒకేసారి 5 వేల మంది ఖననం

డెడ్​బాడీలకు అక్కడి అధికారులు సామూహికంగా అంతిమ సంస్కారాలు నిర్వహిస్తున్నారు. శిథిలాల కింద దొరికిన డెడ్​బాడీలను హాస్పిటల్​కు తరలించి.. బంధువులు ఉంటే వారికి అప్పగిస్తున్నారు. ఆచూకీ తెలియని వారందరి డెడ్​బాడీలను సామూహికంగా ఖననం చేస్తున్నారు. టర్కీలోని మారస్​లో ఒకేసారి 5వేల మందికి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. శిథిలాల కింద ఉన్న డెడ్​బాడీలను వెలికితీసి శ్మశాన వాటికలకు తరలిస్తున్నారు. 24 గంటలూ బుల్డోజర్లు, ప్రొక్రెయిన్ల సాయంతో సమాధులు తవ్వుతూనే ఉన్నారు.