జమ్మూ కాశ్మీర్​లో భూకంపం

జమ్మూ కాశ్మీర్​లో భూకంపం

జమ్మూకాశ్మీర్​తోపాటు ఢిల్లీ, పంజాబ్, చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్, సిమ్లాలో మంగళవారం మధ్యాహ్నం భూకంపం వచ్చింది. కాశ్మీర్ లో భూకంపం తీవ్రత 5.4 గా నమోదైంది. కొన్ని భవనాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి.

శ్రీనగర్: జమ్మూకాశ్మీర్ సహా ఉత్తర భారతంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం మధ్యాహ్నం భూకంపం సంభవించింది. కాశ్మీర్ లోని డోడాలో వచ్చిన భూకంపం తీవ్రత రిక్టర్  స్కేలుపై 5.4 గా నమోదైంది. డోడాలోని భదేర్వా పట్టణంలో ఆరు కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించామని జాతీయ భూకంప అధ్యయన కేంద్రం డైరెక్టర్  ఓపీ మిశ్రా తెలిపారు. భూకంపం రావడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. ఇండ్లు, దుకాణాలను వదిలి ప్రాణ రక్షణ కోసం పరుగులు తీశారు. భూకంపం ధాటికి కొన్ని భవనాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. భవనాల్లో పగుళ్లు ఏర్పడ్డాయి. డోడాలోని సబ్ డిస్ట్రిక్ట్  హాస్పిటల్ పైకప్పు కూలిపోయింది. కొన్ని శిథిలాలు హాస్పిటల్  వార్డులో ఉన్న పేషెంట్లపై పడిపోయాయి. వారందరినీ ఆస్పత్రిలోనే సేఫ్​ జోన్​కు తరలించామని, ఎమర్జెన్సీ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నామని వైద్యాధికారులు చెప్పారు. భదేర్వాలో బడి పిల్లలు, టీచర్లు ప్రాణరక్షణ కోసం పరుగులు తీశారు. భూకంపం వల్ల జరిగిన ఆస్తినష్టంపై అంచనా వేస్తున్నామని అధికారులు తెలిపారు. అయితే, ఈ ఘటనతో ప్రాణనష్టం వాటిల్లలేదన్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందన్నారు. 

నార్త్ తో పాటు పాక్, చైనా లోనూ కంపనాలు

ఢిల్లీ, పంజాబ్, చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్, సిమ్లాలోనూ భూమి కంపించింది. అయితే, ఆ ప్రాంతాల్లో ఎక్కడా ప్రాణనష్టం, ఆస్తినష్టం జరగలేదని అధికారులు తెలిపారు. అలాగే  చైనా, పాకిస్తాన్, మయన్మార్ లోనూ భూకంపం సంభవించింది. పాక్  రాజధాని ఇస్లామాబాద్ తో పాటు లాహోర్, పెషావర్, పంజాబ్ ప్రావిన్స్ లోని పలు నగరాల్లోనూ కంపనాలు ఏర్పడ్డాయి. దీంతో జనం ఇండ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. భూకంపం తీవ్రత రిక్టర్  స్కేలుపై 5.6గా నమోదైందని పాక్  అధికారులు వెల్లడించారు. పాక్  ఆక్రమిత కాశ్మీర్ లోని తూర్పు కాశ్మీర్ లో పది కిలోమీటర్ల లోతులో 
భూకంప కేంద్రాన్ని గుర్తించామని చెప్పారు.