
- శుక్రవారం అర్ధరాత్రి 6.4 తీవ్రతతో ప్రకంపనలు
- తర్వాత 159 సార్లు ప్రకంపనలు
- జాజర్‌కోట్, రుకమ్ జిల్లాల్లో తీవ్ర ప్రభావం.. ఇండ్లు నేల మట్టం
- 160 మందికి పైగా గాయాలు
- శిథిలాల కిందే బాధితులు..
- కొనసాగుతున్న సహాయక చర్యలు
కాఠ్మాండు/నేపాల్ గంజ్: అర్ధరాత్రి 11.47 గంటలు.. అందరూ నిద్రలో ఉన్న సమయంలో అలజడి రేగింది. ఏం జరిగిందో తెలిసేలోపే వందల ఇండ్లు నేలమట్టమయ్యాయి. పదుల సంఖ్యలో జనం శిథిలాల కిందే సమాధి అయ్యారు. నేపాల్‌లో సంభవించిన భూకంపం కారణంగా 157 మంది చనిపోయారు. మరో 160 మందికిగా గాయపడ్డారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రోడ్లు బ్లాక్ కావడం, బ్రిడ్జిలు డ్యామేజ్ కావడం, సమాచార వ్యవస్థ దెబ్బతినడంతో రెస్క్యూ ఆపరేషన్‌కు ఆటంకాలు ఎదురవుతున్నాయి. శిథిలాల కింద ఇంకా బాధితులు ఉండటంతో.. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తున్నది.
జాజర్‌కోట్ జిల్లాలో కేంద్రంగా..
నేపాల్‌లోని జాజర్‌కోట్‌లో 6.4 తీవ్రతతో శుక్రవారం రాత్రి భూకంపం సంభవించింది. భూకంప కేంద్రం జాజర్‌కోట్ జిల్లాలో ఉందని, భూమి లోపల 11 మైళ్ల లోతులో ప్రకంపనలు సంభవించాయని నేషనల్ ఎర్త్‌క్వేక్ మానిటరింగ్, రీసెర్చ్ సెంటర్ ప్రకటించింది. తర్వాత దాదాపు 159 సార్లు ప్రకంపనలు నమోదయ్యాయని తెలిపింది. దీంతో కాఠ్మాండు, పక్కనున్న జిల్లాలతోపాటు ఢిల్లీలో కూడా భూమి కంపించింది. నేపాల్‌లోని జాజర్‌కోట్, రుకమ్ జిల్లాలపైనే ఎక్కువగా ప్రభావం పడింది. ఈ జిల్లాల్లోనే 157 మంది చనిపోయారని పీఎంవో ఓ ప్రకటనలో తెలిపింది. జాజర్‌కోట్‌లోని నల్గధ్ మున్సిపాలిటీ డిప్యూటీ మేయర్ సరితా సింగ్ కూడా చనిపోయారని అధికారులు తెలిపారు. వందలాది ఇండ్లు కూలిపోయాయని చెప్పారు.
రాత్రంతా భయం భయంగా..
అర్ధరాత్రి సమయంలో భూకంపం సంభవించడంతో ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయారు. మిగిలిన వారు రాత్రంతా జాగారం చేశారు. మళ్లీ భూకంపం వస్తుందన్న భయంతో ఆరుబయటే గడిపారు. కూలిన ఇండ్లలో ఎవరైనా చిక్కుకున్నారేమోనని.. చీకటిలోనే వెతుకులాడుతూ, శిథిలాలను తొలగిస్తూ సహాయక చర్యలు చేపట్టారు. సమాచారం అందుకున్న వెంటనే నేపాల్ ఆర్మీ రంగంలోకి దిగిందని, రెస్క్యూ పనుల్లో నిమగ్నమైందని ఆర్మీ అధికార ప్రతినిధి తెలిపారు. చాలా ఏరియాల్లో సమాచార వ్యవస్థ దెబ్బతిన్నది.
నేపాల్‌కు తోడుగా ఉంటం..: మోదీ
నేపాల్‌లో భూకంపం వల్ల సంభవించిన ప్రాణ, ఆస్తి నష్టంపై ప్రధాని నరేంద్ర మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. నేపాల్‌కు ఇండియా సంఘీభావంగా నిలుస్తుందని, సాధ్యమైన అన్ని రకాల సాయాలు చేసేందుకు సిద్ధంగా ఉందని ప్రకటించారు. బాధితులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
వరుస భూకంపాలు
- 1934లో భారీ భూకంపం సంభవించింది. అప్పుడు 8,519 మందికి పైగా చనిపోయారు. ఆ సమయంలో మన దేశంలో కూడా భూమి కంపించడంతో నష్టం వాటిల్లింది.
- 2015 ఏప్రిల్ 25న రిక్టర్ స్కేలుపై 7.8 తీవ్రతతో సంభవించిన భూకంపం నేపాల్ ను శిథిల దేశంగా మార్చింది. దాదాపు 9 వేల మంది చనిపోయారు. 22 వేల మంది గాయపడ్డారు. దాదాపు 8 లక్షల ఇండ్లు ధ్వంసం లేదా డ్యామేజ్ అయ్యాయి.
- 2020 సెప్టెంబర్ 16న 6 తీవ్రతతో భూకంపం సంభవించింది.
- 2022 నవంబర్ 9న వెస్టర్న్ నేపాల్‌లో భూకంపం సంభవించి ఆరుగురు మృతి.
- 2022 నవంబర్ 12న 5.4 తీవ్రతతో భూమి కంపించింది. నేపాల్‌తో పాటు ఇండియాలోనూ ఇండ్లు కంపించాయి.
- 2023 జనవరి 24న 5.6 తీవ్రతతో ప్రకంపనలు నమోదయ్యాయి. ఒకరు చనిపోయారు.
- 2023 అక్టోబర్ 3న 3 తీవ్రతతో, అక్టోబర్ 22న 6.1 తీవ్రతతో కాఠ్మాండులో భూమి కంపించింది.
- అక్టోబర్ 16న సదర్ పశ్చిమ్ ప్రావిన్స్‌లో 4.8 తీవ్రతతో ప్రకంపనలు నమోదయ్యాయి.
ఘటనా స్థలికి వెళ్లి పరిశీలించిన ప్రధాని ప్రచండ
నేపాల్ ప్రధాని పుష్పకుమార్ దహాల్ ప్రచండ.. ఘటనా స్థలికి చేరుకున్నారు. ఆయన వెంట ఓ మెడికల్ టీమ్ కూడా వచ్చింది. భూకంపం వల్ల జరిగిన నష్టం, సహాయక చర్యలపై ఆరా తీశారు. తర్వాత జాజర్‌కోట్ నుంచి సుర్ఖేట్‌కు సాధారణ విమానంలో వెళ్లారు. గాయపడ్డ ఏడుగురిని, వారి కుటుంబ సభ్యులను తన వెంట తీసుకెళ్లారు. తాను వచ్చిన ఆర్మీ హెలికాప్టర్‌ను సహాయక చర్యల కోసం అక్కడే వదిలిపెట్టారు. భూకంప బాధితులకు వెంటనే సాయం చేసేందుకు నేపాల్ ప్రభుత్వం రూ.10 కోట్లను ప్రకటించింది. రెస్క్యూ, రిలీఫ్ ఆపరేషన్ల కోసం మరో రూ.55 లక్షలను హోం మినిస్ట్రీ కేటాయించింది. నేపాల్ కాంగ్రెస్ పార్టీ కూడా రూ.50 లక్షల సాయం ప్రకటించింది.
చికిత్స కోసం ఇండియాకు!
ఇండియా బార్డర్‌కు దగ్గర్లోని నేపాల్‌గంజ్‌లో 30 మందికిపైగా గాయపడ్డారు. కాళ్లు, చేతులు విరిగిపోయి తీవ్రంగా గాయపడిన వాళ్లని భేరీ ఆసుపత్రికి తరలించారు. ఒక పెద్దాయన చనిపోయారని, మరో ఇద్దరి పరిస్థితి సీరియస్‌గా ఉందని అధికారులు తెలిపారు. గాయపడ్డ వారు ఇంకా ఆసుపత్రులలో చేరుతున్నారని, సీరియస్ గా ఉన్న వారిని కాఠ్మాండుకు రెఫర్ చేస్తున్నామని చెప్పారు. కొందరినైతే ఇండియాలోని లక్నో వెళ్లాలని చెబుతున్నామని అన్నారు.