నేపాల్​లో మళ్లీ భూకంపం

నేపాల్​లో మళ్లీ భూకంపం
  •     ఢిల్లీలోనూ ప్రకంపనలు
  •     భయంతో జనం పరుగులు

న్యూఢిల్లీ/కాఠ్మాండు :  నేపాల్​లో మళ్లీ భూకంపం సంభవించింది. మొన్న భూకంపం సంభవించిన జాజర్ కోట్ జిల్లాలోనే సోమవారం 5.8 తీవ్రతతో భూమి కంపించింది. ‘సాయంత్రం 4:31 గంటలకు జాజర్ కోట్, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో 5.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. రామిదండ ఏరియాలో భూకంప కేంద్రం ఉంది. ఆ తర్వాత 4:40 గంటలకు 4.5 తీవ్రతతో మరోసారి భూకంపం వచ్చింది’ అని నేషనల్ సిస్మోలాజీ సెంటర్ తెలిపింది.

ప్రాణ నష్టం, డ్యామేజీకి సంబంధించి వివరాలు తెలియలేదు. నేపాల్ భూకంపం కారణంగా మన దేశంలోని ఢిల్లీతో పాటు దాని చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ భూప్రకంపనలు వచ్చాయి. ఇండ్లు, ఆఫీసుల్లోని వస్తువులు కదిలాయి. దీంతో జనం భయాందోళనకు గురయ్యారు. ఇండ్ల నుంచి బయటకు పరుగులు పెట్టారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఉత్తరప్రదేశ్ లోని అయోధ్యకు 233 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలాజీ వెల్లడించింది.

కాగా, శుక్రవారం అర్ధరాత్రి సంభవించిన భూకంపం కారణంగా మరణించిన వారి సంఖ్యను నేపాల్  సవరించింది. ఈ విపత్తులో మొత్తం 153 మంది చనిపోయారని, 250 మందికి పైగా గాయపడ్డారని తెలిపింది.

భూకంప బాధితులకు మన సాయం.. 

భూకంప బాధితుల కోసం మన దేశం పంపించిన మందులు, ఇతర అత్యవసర వస్తువులు నేపాల్ కు చేరాయి. రెండు ట్రక్కుల లోడ్ల రిలీఫ్ మెటీరియల్ తో బయలుదేరిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ స్పెషల్ ఫ్లైట్ ఆదివారం నేపాల్ గంజ్ ఎయిర్ పోర్టులో ల్యాండ్ అయింది. అక్కడ మన దేశ అంబాసిడర్ నవీన్ శ్రీవాస్తవ.. నేపాల్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ పూర్ణ బహదూర్ ఖడ్కాకు మెటీరియల్ హ్యాండోవర్ చేశారు. రిలీఫ్ మెటీరియల్ ను భూకంప బాధిత ప్రాంతాలకు సోమవారం పంపించారు.

ఒక్కో ట్రక్కు లోడ్ చొప్పున జాజర్ కోట్, రుకుమ్ జిల్లాలకు పంపినట్టు నేపాల్ అధికారులు పేర్కొన్నారు. కాగా, మెడిసిన్స్ తో పాటు టెంట్లు, టార్పాలిన్లు, స్లీపింగ్ బ్యాగ్స్, బ్లాంకెట్లు తదితర వస్తువులను మన దేశం పంపింది.