
మాస్కో: రష్యాలోని కామ్చాట్కా ప్రాంతం తూర్పు తీరానికి సమీపంలో శనివారం 7.4 తీవ్రతతో భూకంపం సంభవించింది. జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ (GFZ) భూకంప వివరాలను వెల్లడించింది. రిక్టర్ స్కేల్పై భూకంప తీవ్రత 7.4గా నమోదైందని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (USGS) పేర్కొంది. భూకంప కేంద్రాన్ని 10 కిలోమీటర్ల లోతులో గుర్తించారు. ఇదే ప్రాంతంలో ఇటీవల 8.8 తీవ్రతతో భూకంపం సంభవించిన విషయం విదితమే.
భూకంపం కారణంగా సునామీ వచ్చే అవకాశం ఉందని, జపాన్, హవాయి, పసిఫిక్‌లోని ఇతర దీవులలో 30 సెంటీమీటర్ల ఎత్తులో అలలు ఎగసిపడే అవకాశం ఉందని పసిఫిక్ సునామీ వార్నింగ్ సెంటర్ హెచ్చరించింది. జపాన్‌లో, కమ్చట్కా ద్వీపకల్పానికి నైరుతి దిశలో, ఎటువంటి సునామీ హెచ్చరిక జారీ చేయలేదని జపాన్ వాతావరణ సంస్థ గురించి వివరాలు వెల్లడించిన నిప్పాన్ హోసో క్యోకై ( NHK ) పేర్కొంది.
జూలై నెలలో కూడా రష్యాలోని కమ్చట్కా ద్వీపకల్పంలో భూకంపం సంభవించిన సంగతి తెలిసిదే. ఈ భూకంపం కారణంగా పసిఫిక్ అంతటా నాలుగు మీటర్లు (12 అడుగులు) ఎత్తు వరకు అలలు ఎగసిపడి సునామీ వచ్చింది. హవాయి, జపాన్‌పై కూడా సునామీ ప్రభావం చూపించింది. 2011లో జపాన్‌లో 9.1 తీవ్రతతో భూకంపం సంభవించి 15 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత కూడా 8.8 తీవ్రతతో మరో భూకంపం సంభవించి సునామీకి కారణమైంది. జులైలో జపాన్లో సంభవించిన భూకంపం కారణంగా దాదాపు 20 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించిన సంగతి తెలిసిందే.