
న్యూఢిల్లీ, వెలుగు: ఢిల్లీలో రెండో రోజు భూకంపం సంభవించింది. శుక్రవారం సాయంత్రం 7.19 గంటలకు కొన్ని సెకన్ల పాటు భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ఢిల్లీకి 60 కి.మీ.దూరంలో ఉన్న హర్యానాలోని ఝజ్జర్లలో 10 కి.మీ. లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (ఎన్‌సీఎస్) వెల్లడించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 3.7గా నమోదైనట్లు తెలిపింది. భూకంప ప్రభావం ఢిల్లీతో పాటు నేషనల్ క్యాపిటల్ రీజన్(ఎన్‌సీఆర్)లో కనిపించింది. ప్రధానంగా రోహ్‌తక్, మహేంద్రగఢ్, డెహ్రడూన్ పాల్ట్, బహదూర్ ఘడ్ జిల్లాలో ఎక్కువగా కనిపించింది.
దీంతో ప్రజలు ఒక్కసారిగా ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. కాగా, 48 గంటల్లో ఢిల్లీలో భూమి కంపించడం ఇది రెండోసారి. హిమాలయాల కింద ఉన్న పలు భూ పొరల కదలికలతో తరుచూ ప్రకంపనలు చోటు చేసుకుంటున్నాయని నిపుణులు చెబుతున్నారు. వీటి ప్రభావం భూకంపాల జోన్4 పరిధిలోని ఢిల్లీ, ఎన్‌సీఆర్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్ వంటి ప్రాంతాలపై ఉంటుందంటుని చెప్పారు. భూకంపంతో ఇప్పటివరకు ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని అధికారులు తెలిపారు.