గోవధపై గుజరాత్ కోర్టు కీలక వ్యాఖ్యలు

గోవధపై గుజరాత్ కోర్టు కీలక వ్యాఖ్యలు

అక్రమంగా పశువులను రవాణా చేసిన వ్యక్తికి జీవిత ఖైదు విధిస్తూ గుజరాత్‌లోని ఒక కోర్టు గోహత్యపై కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది."గోహత్యను నిలిపివేస్తే భూమ్మీద ఉన్న సమస్యలన్నీ పరిష్కారమవుతాయి" అని తాపీ జిల్లా కోర్టు  జడ్జి జస్టిస్ సమీర్ వనోద్ చంద్ర వ్యాస్ ఉత్తర్వులు జారీ చేశారు. అంతే కాదు ఆవు పేడతో అలికిన ఇంట్లో సూర్యుని నుంచి వెలువడే అణు కిరణాల ప్రభావం ఉండదని, అలాగే ఆవు మూత్రంతో అనేక వ్యాధుల్ని నివారించవచ్చన్నారు. “ఆవు జంతువు మాత్రమే కాదు, తల్లి కూడా. ఆవు 68 కోట్ల పవిత్ర స్థలాలు, 33 కోట్ల దేవతల్ని కలిగి ఉన్న సజీవ గ్రహం. మొత్తం విశ్వంపై ఆవు ప్రభావం ఎంతగానో ఉంటుంద’’ ని చెప్పుకొచ్చారు. 

“ఆవులను సంతోషంగా ఉంచినట్లయితే, మన సంపద, ఆస్తి మనకే దక్కుతాయి. లేదంటే అవి అదృశ్యమవుతాయి” అని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. వాతావరణ మార్పులకు గోవధకు జడ్జి ముడిపెట్టారు. ఆవేశం, కోపం వంటివి పెరగడం గోవధ వల్లనే అని  తేల్చి చెప్పారు. గోవధను పూర్తిగా నిషేధించే వరకు ఇలాంటే వాతావరణమే ఉంటుందని, ఇంకా పెరుగుతుందని తెలిపారు. సమీర్ వినోద్‌చంద్ర వ్యాస్ చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఇవన్నీ చాలా మంది చాలా ఏళ్లుగా చెప్తున్నప్పటికీ ఎలాంటి శాస్త్రీయ ఆధారం లేదని కామెంట్స్ చేస్తు్న్నారు. కాగా గతేడాది ఆగస్టులో 16 ఆవులను అక్రమంగా రవాణా చేయడంపై ఆ వ్యక్తిని అరెస్టు చేశారు. కాగా, సదరు వ్యక్తికి జీవిత ఖైదుతో పాటు, ఆ వ్యక్తికి ఐదు లక్షల రూపాయల జరిమానా విధించారు.