- టిబెట్ లోని షైషెంగ్ పర్వతంపై 26.2 మీటర్ల మిర్రర్‌తో ఏర్పాటుకు ప్రణాళిక
బీజింగ్: ఆసియాలోనే అతిపెద్ద ఆప్టికల్ టెలిస్కోప్ నిర్మాణానికి చైనా ప్రణాళికలు వేస్తోంది. సముద్రమట్టానికి 13,800 ఫీట్ల ఎత్తులో ఉన్న టిబెట్‌లోని షైషెంగ్ పర్వతంపై ఈ టెలిస్కోప్ ను ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేపట్టింది. చైనాకు చెందిన పెకింగ్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబోయే ఈ టెలిస్కోప్ కు ‘ఎక్స్ ప్యాండింగ్ అపెర్చర్ సెగ్మెంటెడ్ టెలిస్కోప్ (ఈస్ట్)’ అని పేరు పెట్టారు. తొలిదశలో 2024 నాటికి దీనికి 19.7 ఫీట్ల పరిమాణంలో18 హెక్సాగోనల్ (షట్భుజి) ఆకారంలోని మిర్రర్ సెగ్మెంట్లను అమర్చనున్నారు. రెండో దశలో 2030 నాటికి మరో 18 హెక్సాగోనల్ మిర్రర్ సెగ్మెంట్లను జోడిస్తారు. అప్పుడు దీని మొత్తం మిర్రర్ పరిమాణం 26.2 ఫీట్లకు పెరుగుతుంది. అమెరికా అంతరిక్షానికి పంపిన జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ లో 21.6 ఫీట్ల హెక్సాగోనల్ మిర్రర్ ఉంది. ఈస్ట్ టెలిస్కోప్ నిర్మాణం పూర్తయితే ఆప్టికల్ ఆస్ట్రానమీ (విశ్వ కాంతిపై స్టడీ విభాగం)లో జేమ్స్ వెబ్ టెలిస్కోప్ కన్నా ఇదే పెద్దది కానుంది. ఈ ప్రాజెక్టుకు సుమారు రూ. 700 కోట్ల వరకూ వ్యయం కావచ్చని పెకింగ్ యూనివర్సిటీ అంచనా వేసింది.
అమెరికాకు పోటీగా..
విశ్వం నుంచి వచ్చే కాంతిని స్టడీ చేసేందుకు ఆప్టికల్ టెలిస్కోపులను ఉపయోగిస్తుంటారు. ప్రస్తుతం ఈ ఆప్టికల్ ఆస్ట్రానమీ రంగంలో అమెరికా, జపాన్, యూరోపియన్ యూనియన్ వంటి దేశాలు ముందున్నాయి. ఈ దేశాలు ప్రధానంగా చిలీ, హవాయి, ఆఫ్రికాకు వాయవ్య తీర ప్రాంతాల్లో భారీ టెలిస్కోపులను నిర్వహిస్తున్నాయి. అయితే, అన్ని రంగాల్లోనూ అమెరికాతో పోటీ పడుతున్న చైనా.. టెలిస్కోపుల విషయంలోనూ సవాల్ విసిరేలా ప్రాజెక్టులు చేపడుతోంది. ఇదివరకే వాయవ్య చైనాలోని సిచువాన్ ప్రావిన్స్ లో ఏకంగా 1.95 మైళ్ల విస్తీర్ణంలో 313 డిష్ లతో దావోచెంగ్ సోలార్ రేడియో టెలిస్కోప్ ను చైనా ఏర్పాటు చేసింది.
