ఆస్తులు అమ్మి అయినా సరే పోరాడతాం

ఆస్తులు అమ్మి అయినా సరే పోరాడతాం
  • ఉద్యమం కోసం ఆస్తులు అమ్ముకున్నం
  • మా కుటుంబాన్ని నాశనం చేయడమే కేసీఆర్ టార్గెట్
  • తమ్మీ తమ్మీ అంటూ తడి గుడ్డతో గొంతు కోశాడు
  • ఒక్క ఎకరం ఎక్కువ ఉన్నా ముక్కు నేలకు రాస్తా..
  • లేకపోతే అధికారులు ముక్కు నేలకు రాస్తారా..
  • సమైక్య రాష్ట్రంలో కూడా కులం అడగలేదు.. ఇప్పుడా దౌర్భాగ్యం వచ్చింది
  • నేను అన్నం పెట్టినవాళ్లు.. ఎంగిలి మెతుకుల కోసం మమ్మల్ని తిడుతున్నరు
  • ఓ పెద్దమనిషి నెలనెలా ఇంటికొచ్చి డబ్బులు తీసుకెళ్లేవారు
  • 15 రోజుల క్రితం కూడా ఆయనకు భోజనం పెట్టాను.. ఇప్పుడు మమ్మల్నే తిడుతున్నాడు
  • ఈటల సతీమణి జమున


ఎన్ని కుట్రలు చేసినా భయపడేది లేదని మాజీ మంత్రి ఈటల సతీమణి జమున అన్నారు. తాము కష్టాన్ని నమ్ముకునే బతికామని ఏనాడూ తప్పు చేయలేదని ఆమె తేల్చి చెప్పారు. తమ మీద, తమ కంపెనీ మీద ప్రభుత్వం నెలరోజులుగా అసత్య ప్రచారాలు చేస్తోందని ఆమె మండిపడ్డారు. ఉద్యమం చేసిన వాళ్లందరిని కేసీఆర్ తొక్కేశారని ఆమె ఆరోపించారు. కేసీఆర్ ఫ్యామిలీకి అన్ని ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పాలని జమున ప్రశ్నించారు. ఈటలను తమ్మీ తమ్మీ అంటూ తడి గుడ్డతో కేసీఆర్ గొంతు కోశారని ఆమె విమర్శించారు.

‘మాసాయి‌పేట్ లో 46 ఎకరాలు కోన్నది వాస్తవం. బడుగు బలహీన వర్గాల నుంచి మేం భూములు తీసుకుంటామా? మేం కొన్న భూమి కన్నా ఒక్క ఎకరం ఎక్కువ ఉన్నా ముక్కు నేలకు రాస్తా..! నిరూపించకపోతే అధికారులు ముక్కు నేలకు రాస్తారా.. ! నితిన్ రెడ్డి w/o జమున అని రాస్తారా? వావి వరసలు లేకుండా రాస్తారా? ఇదేనా మీ ప్రభుత్వ మహిళా సాధికారత? ఒక మహిళగా ఎందరికో ఉపాధి కల్పిస్తున్నాను. ఇలా చేస్తే బిజినెస్‌లోకి ఎవరైనా వస్తారా? దేవర యంజాల్‌లో 1994లో భూమి కొన్నాం. మా 6 ఎకరాల భూమి కుదువపెట్టి నమస్తే తెలంగాణ పేపర్‌కి డబ్బులు ఇచ్చాం. దేవుడి భూమి అయితే బ్యాంకులు అప్పు ఎలా ఇచ్చాయి? ప్రభుత్వం చేస్తున్న సర్వే ఆపాలని మేం ఎప్పుడూ, ఎక్కడా చెప్పలేదు. ప్రభుత్వ కుట్రలు చూసి జనం నవ్వుకుంటున్నారు. వంద ఎకరాల భూమి రాత్రికి రాత్రే ఎలా కొలిచారు? 

జనం చస్తున్నా పట్టించుకోకుండా మా కుటుంబాన్ని నాశనం చేయడమే కేసీఆర్ టార్గెట్. నేను రెడ్డి.. ఆయన ముదిరాజ్.. మేం మనుషుల్లా కలిసున్నాం. ఈ అవమానాల కోసమేనా తెలంగాణ తెచ్చుకుంది? సమైక్య రాష్ట్రంలో కూడా కులం అడగలేదు. ఇప్పుడా దౌర్భాగ్యం వచ్చింది. మంత్రులు ఒకరినొకరు కలవాలన్నా చాటుగా కలిసే పరిస్థితి కేసీఆర్ తీసుకొచ్చాడు. ఉద్యమం కోసం ఆస్తులు అమ్ముకున్నం. ఆస్తుల కోసం ఏనాడు లొంగిపోలేదు. ఇప్ప్పుడు కూడా ఆస్తులు అమ్మయినా సరే తెలంగాణ ఆత్మగౌరవం కోసం పోరాడతాం. ఎన్నో కష్టాలు పడే ఈ స్థాయికి వచ్చాం. ఆస్తులు పోతాయని భయపడం. నేను అన్నం పెట్టినవాళ్లు.. కేసీఆర్ ఎంగిలి మెతుకుల కోసం మమ్మల్ని తిడుతున్నరు. వకుళాభరణం కృష్ణ మోహన్ ఒక మనిషేనా? నెల నెలా ఇంటికే వచ్చి డబ్బులు అడుక్కుపోయేవారు. 15 రోజుల క్రితం కూడా ఇంటికి వస్తే నా చేతితోనే భోజనం పెట్టా’ అని ఆమె మండిపడ్డారు.