నిరుద్యోగులకు ఇంటికో రూ. లక్ష ఇవ్వాలని అడిగా

నిరుద్యోగులకు ఇంటికో రూ. లక్ష ఇవ్వాలని అడిగా

కేసీఆర్  అయినదాన్ని ఆకుల్లో, కానిదాన్ని కంచాల్లో పెట్టాడని అన్నారు మాజీ మంత్రి, బీజేపీ నేత  ఈటల రాజేందర్. చీమలు పెట్టిన పుట్టలో తాను చేరానని మాట్లాడుతున్నారని..ఎవరు పెట్టిన పుట్టలో ఎవరు చేరారో అందరికీ తెలుసన్నారు.  టీఆర్ఎస్ ఎన్ని ఎత్తులు  వేసినా.. ఎంత  డబ్బు పంచినా.. హుజూరాబాద్ లో గెలిచేది తానే అన్నారు . సొంత పార్టీ  నాయకుల్ని కొంటూ.. ప్రజల్ని డబ్బుతో  ప్రలోభ పెడుతున్నారని ఆరోపించారు.  కరీంనగర్ జిల్లా   హుజురాబాద్ మండలం చెల్పూర్ లో  బీజేపీ కార్యకర్తల సమావేశంలో ఈటల పాల్గొన్నారు. ఆయన  సమక్షంలో ఆటో యూనియన్, హమాలీ సంఘం, తాపీ సంఘం,  డప్పు కళాకారులు, మహిళా సంఘాలు,  యువజన  సంఘాల నేతలు  బీజేపీలో చేరారు.

‘గ్రామాల్లో తిరిగినప్పుడు ప్రజల తరపున ఫించన్లు ఇవ్వాలని అడిగాను. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కొత్త ఫించన్లు, కొత్త రేషన్ కార్డులు కావాలన్నాను. నాకు మంత్రి పదవి ఉన్నా రేషన్ కార్డు ఇవ్వలేని దుస్థితిలో నేను ఈ పదవి ఎందకని భావించాను.  రైతు బంధు ఇవ్వాలి. కానీ గుట్టలకు, అక్కరకు రానీ భూములకు, భూస్వాములకు ఇవ్వొద్దని చెప్పాను.  రైతులు పండించిన పంటలు కొనాలని కోరాను. ఐకేపీ సెంటర్లు ఉంటాయని చెప్పాను.  నా సొంత వ్యవహారంపై నేను పార్టీ మారలేదు. ఇవన్నీ అడిగినందుకే నన్ను బయటకు పంపారు‘అని ఈటల అన్నారు.  పదవుల కోసం పెదవులు మూస్తే తనకు పదవి ఉండేదన్నారు. తెలంగాణ ఉద్యమంలో తన మీద ఎన్నో కేసులయ్యాయన్నారు. కరీంనగర్ మంత్రి ఏనాడైనా జైలుకు వెళ్లాడా? అన ప్రశ్నించారు ఈటల.