కేసీఆర్.. దమ్ముంటే నామీద  పోటీ చేసి గెలువ్​

కేసీఆర్.. దమ్ముంటే నామీద  పోటీ చేసి గెలువ్​
  •     నువ్​ గెలిస్తే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా: ఈటల
  •     నేను గెలిస్తే సీఎం పదవికి రాజీనామా చేస్తవా?​
  •     మనుషుల్ని కొనే నీచ స్థాయికి సీఎం దిగజారిండు
  •     హరీశ్​.. పదవుల కోసం పెదవులు మూసుకున్నవ్​

హరీశ్.. మాటలు జాగ్రత్తగ మాట్లాడు. నేను మధ్యలో వచ్చి మధ్యలో పోయిన్నట. 18 ఏండ్లు పని చేసి మధ్యలో ఎట్ల పోయిన? మీ మామ ఆదేశిస్తే ఓ ఉద్యమకారుడి బొండిగ పిస్కడానికి వచ్చినవ్. ఏదో ఒక రోజు నీ బొండిగ కూడా పిస్కుతరని మర్చిపోకు. నాకు మాత్రమే అవమానం జరగలేదు. నేను మాత్రమే కన్నీళ్లు పెట్టుకోలేదు. నువ్వు, నేను కలిసి ఎన్నిసార్లు ఏడ్చినం.. ఎన్నిసార్లు అవమాన భారంతో కుంగిపోయినమో టైమొచ్చినప్పుడు డేట్‌లతో సహా చెప్త. కేసులు పెట్టిచ్చి, బెదిరిచ్చి కాదు. వాళ్లు వీళ్లు కాదు.. మామా అల్లుళ్లు నిలబడండి. మీరు గెలిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంట. నేను గెలిస్తే సీఎం పదవికి కేసీఆర్‌ రాజీనామా చేస్తరా?
‑ ఈటల రాజేందర్​

కమలాపూర్, వెలుగు: సీఎం కేసీఆర్‌‌కు దమ్ముంటే హుజూరాబాద్ ఎన్నికల్లో తన మీద పోటీ చేయాలని, తాను ఓడితే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని, గెలిస్తే సీఎం పదవికి కేసీఆర్‌‌ రాజీనామా చేస్తారా అని బీజేపీ నేత ఈటల రాజేందర్ సవాల్ విసిరారు. వాళ్లను, వీళ్లను నిలబెట్టడం కాదని.. కేసీఆర్ నిలబడ్తడో.. హరీశ్‌‌రావును నిలబెడ్తరో చెప్పాలన్నారు. కేసులు పెట్టి బెదిరించడం కాదని, దమ్ముంటే డైరెక్ట్‌‌గా కొట్లాడాలన్నారు. పోలీసులను పక్కనబెట్టి ప్రచారం చేసుకోవాలని, దమ్ముంటే తనపై గెలవాలని చాలెంజ్‌‌ చేశారు. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలోని ఉమామహేశ్వర గార్డెన్‌‌లో సోమవారం నిర్వహించిన బీజేపీ ముఖ్య కార్యకర్తల సమావేశానికి పార్టీ కోర్ కమిటీ మెంబర్ వివేక్ వెంకటస్వామితో కలిసి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 

2001లో ఇద్దరి ఆస్తులెన్నో చెప్పుదమా?

హుజూరాబాద్‌‌లో దావత్‌‌ల మీద దావత్‌‌లు పెడుతున్నరని, ఇప్పటికే రూ.200 కోట్లు ఖర్చు చేశారని, ఆ పైసలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయని ఈటల నిలదీశారు. 2001లో తన ఆస్తులెన్నో చెప్తానని, కేసీఆర్‌‌ ఆస్తులెన్నో చెప్తారా అని ప్రశ్నించారు. తాను, తన భార్య, కోడలు సద్ది కట్టుకొని పోయి పని చేస్తామని, సీఎం ఇంట్లో సద్ది కట్టుకుపోయేటోళ్లు ఒక్కరన్నా ఉన్నారా అని నిలదీశారు. కేసీఆర్‌‌ను ప్రజలు బొందవెట్టే రోజులొస్తాయన్నారు. ఓటుకు రూ.20 నుంచి రూ. 30 వేలు ఇస్తామంటున్నారని, ఇక్కడి ప్రజలు ఆకలినైనా భరిస్తారని, ఆత్మగౌరవాన్ని అమ్ముకోరన్నారు. మనుషుల్ని కొనే నీచ సంస్కృతికి కేసీఆర్‌ దిగజారారని విమర్శించారు. కేసీఆర్ మాటలు నెల రోజులే చెల్లుతాయని, తరువాత తనకూ అవకాశం వస్తుందని, అప్పుడు అందరి భరతం పడతామని అన్నారు. హైదరాబాద్‌‌లో భూములమ్మి హుజూరాబాద్‌‌లో దళిత బంధు పైసలు ఇస్తున్నారని.. అవీ ఈ నియోజకవర్గం వరకే వస్తాయన్నారు. 

చర్చకు వస్తవా హరీశ్​

హుజూరాబాద్‌‌లో అభివృద్ధి జరగలేదని హరీశ్‌‌రావు, టీఆర్‌‌ఎస్ లీడర్లు అబద్ధాలు చెబుతున్నారని ఈటల అన్నారు. ‘నీ నియోజకవర్గానికి ఎన్ని వందల కోట్ల పనులు శాంక్షన్ అయ్యాయో.. నా నియోజకవర్గంలో ఎంత శాంక్షన్ అయ్యాయో బహిరంగ చర్చకు వస్తవా’ అని హరీశ్‌‌కు సవాల్ విసిరారు. ‘నువ్వు, నేను ఎన్నిసార్లు అవమానపడ్డమో గుర్తు తెచ్చుకో’ అన్నారు. టైం వచ్చినప్పుడు అన్నీ చెప్తానన్నారు.