దుబ్బాక, హుజూరాబాద్ జవాబు సరిపోలేదా?

దుబ్బాక, హుజూరాబాద్ జవాబు సరిపోలేదా?
  •     మోడీని విమర్శించే నైతిక హక్కు కేసీఆర్‌‌‌‌కు లేదు
  •     ‘మోటార్లకు మీటర్ల’పై దుబ్బాక, హుజూరాబాద్ జవాబు సరిపోలేదా? అని ప్రశ్న
  •     సింగరేణి ప్రైవేటైజేషన్‌‌ అంటూ సీఎం అబద్ధాలు మాట్లాడుతుండు: వివేక్ వెంకటస్వామి
  •     తాడిచెర్ల కోల్ మైన్‌‌ను ప్రైవేట్ పరం చేసింది కేసీఆర్ కాదా అని నిలదీత

హైదరాబాద్, వెలుగు: కేసీఆర్ మోకాళ్ల మీద నడిచినా సరే వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్‌‌కు ఓటమి తప్పదని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. కేసీఆర్ కుట్రలు, కుతంత్రాలు, తెలివితేటలు పని చేయనందునే ప్రశాంత్ కిషోర్ సహకారం తీసుకుంటున్నారని ధ్వజమెత్తారు. చరిత్ర గతిని మార్చేది సలహాదారులు కాదని, ప్రజలేననే విషయాన్ని కేసీఆర్​ మరిచిపోయారని విమర్శించారు. బుధవారం హైదరాబాద్‌‌లోని బీజేపీ స్టేట్ ఆఫీసులో పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామితో కలిసి ఈటల మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ పాలనలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులకు అధికారం లేదని, ప్రభుత్వంలోని పెద్దాఫీసర్లకు స్వేచ్ఛగా పనిచేసే అవకాశం లేదని విమర్శించారు. ‘ప్రజలు నా బానిసలు’ అనే రీతిలో కేసీఆర్ దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారని ఫైర్ అయ్యారు.

మోడీపై కేసీఆర్ వాడిన భాషను చూసి తెలంగాణ సమాజం ఛీ కొడుతున్నదని ఈటల మండిపడ్డారు. మోడీకి ప్రజాసేవ తప్ప వేరే వ్యాపకం లేదని, ఆయనను విమర్శించే నైతిక హక్కు కేసీఆర్‌‌‌‌‌‌‌‌కు లేదన్నారు. కేసీఆర్ మాట్లాడిన భాషను తెలంగాణ భాషగా చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారని టీఆర్ఎస్ నేతలను విమర్శించారు. రాష్ట్ర కేబినెట్‌‌‌‌లో ఒకే ఒక్క మంత్రి పదవి దళితులకు ఇచ్చి కేసీఆర్ ఆ సామాజిక వర్గాన్ని మోసం చేశారని మండిపడ్డారు. సగానికిపైగా జనాభా ఉన్న ఓబీసీలకు కేవలం మూడు మంత్రి పదవులే ఇచ్చారన్నారు. దళిత బస్తీల్లో కరెంట్ కట్ చేస్తున్నారని, జీరో డిపాజిట్ స్థానంలో డిపాజిట్లు వసూలు చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో స్వేచ్ఛగా తిరిగే సత్తాను కేసీఆర్ కోల్పోయారని, పోలీసు బూట్ల చప్పుళ్లు, ఇనుప కంచెల మధ్య తిరుగుతున్నారని, అదే ఆయన పతనానికి నాంది కానుందన్నారు. వ్యవసాయానికి కూడా నాణ్యమైన కరెంట్ ఇవ్వాలని కేంద్రం భావిస్తుంటే.. టీఆర్ఎస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో మోటర్లకు మీటర్లు పెడుతారని బీజేపీపై తప్పుడు ప్రచారం చేసినా టీఆర్ఎస్‌‌‌‌కు ఓట్లు రాలేదని, ఇప్పుడు మరోసారి ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారని విమర్శించారు. 

కేసీఆర్ పాలనపై జనం విసుగెత్తిన్రు: వివేక్

సింగరేణి ప్రైవేటైజేషన్‌‌‌‌ అని కేసీఆర్ అబద్ధాలు ప్రచారం చేస్తూ కార్మికులను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నాడని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి మండిపడ్డారు. సింగరేణి ప్రైవేటైజేషన్‌‌‌‌ అంటూ కేసీఆర్ చేసిన కామెంట్లను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. తాడిచెర్ల కోల్ మైన్‌‌‌‌ను ప్రైవేట్ పరం చేసింది కేసీఆర్ కాదా అని మండిపడ్డారు. ‘‘కేసీఆర్ సీఎం అయిన తర్వాత ప్రజలను, ఇచ్చిన హామీలను పూర్తిగా మరిచిపోయిండు. దళిత సీఎం హామీ ఏమైంది? దళితులకు 3 ఎకరాల భూమి ఏమైంది? ఇంటికో ఉద్యోగం ఏమైంది?” అని నిలదీశారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీ రీ ఓపెన్ చేస్తామని చెప్పి మాటతప్పాడని విమర్శించారు. ఆంధ్రా కాంట్రాక్టర్లకు ఒక్క కాంట్రాక్ట్ కూడా ఇచ్చేది లేదన్న కేసీఆర్.. లక్ష కోట్ల రూపాయల కాంట్రాక్ట్‌‌‌‌ను మేఘా కృష్ణారెడ్డికి ఎట్లా ఇచ్చారని నిలదీశారు. నియంతృత్వ, అవినీతి, కుటుంబ పాలనపై ప్రజలు విసుగెత్తిపోయారని అన్నారు. మోటర్లకు మీటర్లు పెడుతామని ఎవరూ చెప్పలేదని, ఈ విషయంలో కేంద్రాన్ని టీఆర్ఎస్ సర్కార్ బద్నాం చేస్తున్నదని ఆరోపించారు. ప్రధాని మోడీపై కేసీఆర్ వాడిన భాష సరిగ్గా లేదని, వెంటనే మోడీకి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సర్కారు భూములు అమ్మి జీతాలు ఇస్తూ.. వడ్డీలు కడుతూ రాష్ట్రంలో కేసీఆర్ తుగ్లక్ పాలన చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ కేవలం కాంట్రాక్టర్ల లాభాల కోసం, కమీషన్ దోచుకోవడం కోసం మాత్రమే పని చేస్తున్నారని ధ్వజమెత్తారు.