
- అక్రమాలకు, అన్యాయం చేసేవాళ్లకు అపజయం తప్పదు
- అవాకులు చెవాకులు పేలుతున్నవారికి ఖబర్ధార్
- మా ప్రజలను అవమానిస్తే రాజకీయంగా బొంద పెడతారు
- విమర్శలు చేసేటోళ్లంతా ప్రగతి భవన్ స్క్రిప్టు చదివేటోళ్లే
- అనుచరులతో నియోజకవర్గంలో ర్యాలీ తీసిన ఈటల
మాజీ మంత్రి ఈటల రాజేందర్ తన సొంత నియోజకవర్గం హుజూరాబాద్‌లో పర్యటిస్తున్నారు. ఉదయం హైదరాబాద్ నుంచి ర్యాలీగా వెళ్లిన ఈటల.. కమలాపూర్ మండలంలోని శంభునిపల్లి, కానిపర్తి గ్రామాల్లో పర్యటించారు. ఢిల్లీ వెళ్లీ బీజేపీ నేతలను కలిసిన తర్వాత ఫస్ట్ టైం నియోజకవర్గానికి వచ్చిన ఈటలకు.. కార్యకర్తలు, అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. ఆ తర్వాత కార్యకర్తలతో పాటు ఈటల రాజేందర్ బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. రెండు గ్రామాల్లో ర్యాలీ తర్వాత... కమలాపూర్ మండల కేంద్రంలోని తన సొంత ఇంటికి చేరుకున్నారు. అక్కడ తన అనుచరులతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
‘టీఆర్ఎస్ పార్టీకీ రాజీనామా ప్రకటించిన తర్వాత మొట్టమొదటిసారిగా కమలాపూర్ మట్టికి మొక్కాలి. అందుకే నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదం తీసుకుని ముందుకు పోదామని వచ్చాను. శంభునిపల్లి నుంచి కమలాపూర్ వరకు ఆడబిడ్డలు, యువకిశోరాలు నాకు ఘన స్వాగతం పలికారు. 19 ఏళ్ల పాటు గులాబీ జెండాను, తెలంగాణ ఉద్యమాన్ని గుండెలో పెట్టుకుని కాపాడుకుంటే.. నీకు అన్యాయం చేశారని వారంతా అంటున్నారు. నీలాంటి వారికి ద్రోహం చేసి... తెలంగాణకు ద్రోహం చేసిన వారిని పక్కన పెట్టుకోవడం కేసీఆర్‌కు తగదని మా ప్రజలు చెబుతున్నారు. కేసీఆర్‌కు బుద్ధి చెప్పడానకి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. అక్రమంగా సంపాదించుకున్న డబ్బులతో నాయకులను ఇబ్బంది పెడుతున్నారు. గొర్రెల మందపై తోడేళ్లు పడ్డట్లుగా.. మా నాయకులను ఇబ్బందులు పెడుతున్నారు. 20 ఏళ్ల చరిత్రలో మిమ్మల్ని గుండెలో పెట్టుకున్నామని, ఇకపై కూడా చూసుకుంటామని ప్రజలు చెబుతున్నారు. ముందుకు నడవాలని సంపూర్ణ ఆశీర్వాదం ఉంటుందని నా ప్రజలు ధైర్యమిస్తున్నారు. తప్పకుండా మీకే విజయం కట్టబెడుతామని మా ప్రజలు చెబుతున్నారు.
హుజూరాబాద్‌లో జరగబోయేది కురుక్షేత్ర సంగ్రామం. అది ధర్మానికి, అధర్మానికి.. కౌరవులకు, పాండవులకు మధ్య జరుగుతుంది. హుజురాబాద్ నియోజకవర్గంలో మీ అందరి ఇళ్లకు వచ్చి కలుస్తా. ఈ కురుక్షేత్ర యుద్ధంలో విద్యార్థులు, కార్మికులు, కర్షకులు వాళ్లంతా హుజురాబాద్ క్షేత్రానికి వచ్చి పాల్గొంటామని చెబుతున్నారు. తొత్తులుగా, బానిసలుగా మారి మా నాయకులపై, ప్రజలపై అవాకులు చెవాకులు పేలుతున్నవారికి ఖబర్ధార్. మా ప్రజలను అవమానిస్తే రాజకీయంగా బొంద పెడతారు. తొలి సింహగర్జనకు కరీంనగర్ వేదికనైట్లు.. రాజ్యాంగ పరిరక్షణకు, ఆత్మగౌరవ పరిరక్షణకు హుజురాబాద్ వేదికవుతుంది. రాబోయే కాలంలో తప్పకుండా ధర్మానిది, హుజురాబాద్ ప్రజలదే విజయం. అక్రమాలకు, అన్యాయం చేసేవాళ్లకు అపజయం తప్పదు. తెలంగాణ రాష్ట్ర గౌరవాన్ని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ నాకు అండగా ఉంటారు. హుజురాబాద్ నుంచి ప్రతి పల్లె, ప్రతి ఇల్లు పిడికిలెత్తి కదలాలి. ఎప్పటికైనా మీ అందరికీ అండగా ఉండేది నేనే. అడగడుగునా నాకు స్వాగతం పలికి ఆశీర్వదించిన వాళ్లందరికీ చేతులెత్తి దండం పెడుతున్నా. రాబోయే కాలంలో గొప్ప విజయం సాధించి.. తెలంగాణ ప్రజలకు కొత్త మేల్కొలుపు పలుకుదాం. ప్రజాస్వామ్యానికి, నీతి నిజాయితీకి తెలంగాణలో చోటు లేకుండా పోయింది. రాబోయే ఎన్నికల సంగ్రామంలో మా నినాదం, మా సత్తా చూపిస్తాం. కురుచ నాయకులు చేసే విమర్శలకు నేను సమాధానం చెప్పను. వాళ్లు ఎప్పుడొచ్చారో, వాళ్ల చరిత్ర ఏమిటో, నా చరిత్ర ఏమిటో అందరికీ తెలుసు. వాళ్లంతా ప్రగతి భవన్ స్క్రిప్టును చదివేవాళ్లు’ అని ఆయన అన్నారు.
హుజూరాబాద్‌లో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తి రేపుతున్నాయి. ఈటల వ్యవహారంతో హుజూరాబాద్ టీఆర్ఎస్ ఇప్పుడు రెండు వర్గాలుగా చీలిపోయింది. గులాబీ నాయకత్వానికి మద్దతుగా కొందరు మాట్లాడుతుంటే... ఈటలకు తోడుగా ఉంటామని మరికొందరు లోకల్ లీడర్లు చెబుతున్నారు. హుజూరాబాద్‌లో తన బలం మరింతగా పెంచుకునే పనిలో ఈటల రాజేందర్ నిమగ్నమయ్యారు.