కొడుకు, మనవడు రాష్ట్రాన్ని ఏలాలనేదే కేసీఆర్ ఎజెండా

కొడుకు, మనవడు రాష్ట్రాన్ని ఏలాలనేదే కేసీఆర్ ఎజెండా

హనుమకొండ: తనపై అసత్యాలు ప్రచారం చేస్తున్న కేసీఆర్ మాటలకు బద్లా తీర్చుకుంటానని హుజూరాబాద్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. కమలాపూర్ మండలం మర్రిపల్లిలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో రాజేందర్ మాట్లాడారు.

‘గతంలో దళితులను అవమానించి, గంజిలో ఈగలాగా కేసీఆర్ తీసేశారు. ఇప్పుడు దళితబంధు తాను ఇస్తున్నట్లు, ఇతరులు ఆపుతున్నట్లు నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడు. తాత్కాలికంగా నిజం ఓడిపోయినట్లు కనిపించొచ్చు.. నిజం నిప్పులాంటిది.. తప్పకుండా బయటకు వస్తుంది. ఉద్యమ సమయంలో తెలంగాణలో 85 శాతం దళిత, బీసీలే ఉన్నారని కేసీఆర్ అన్నారు. దళితుడినే మొదటి సీఎం చేస్తానని, అవసరమైతే తలనరుక్కుంటా తప్ప మాటతప్పనన్నాడు. కాపాలకుక్కలా ఉంటానని.. మొదటి ద్రోహం దళితులకే చేశాడు. మూడెకరాల భూమి ఎగ్గొట్టాడు. డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇవ్వలేదు. దళితుల ప్రైడ్ అనే స్కీం పెట్టినా.. వారికి రావాల్సిన రుణాల సబ్సిడీ ఇవ్వకుండా చెలగాటమాడుతున్నాడు. ఇప్పుడేమో చివరి రక్తం బొట్టు వరకు దళితులకే తన జీవితం అంకితమంటున్నాడు. సీఎం మోసాన్ని గ్రహించకుండా కొంతమంది మేధావులు ఆహా, ఓహో అంటున్నారు. దళితబంధును ఎవరూ వద్దనడం లేదు. కానీ పది లక్షలపై సంపూర్ణ అధికారం ఇవ్వాలంటున్నాం. మన కళ్లల్లో మట్టికొట్టి, మన బతుకులను ఛిద్రం చేశాడు. 

ఓటుకు 20 వేలు ఇచ్చినా నిన్ను నమ్మరు

కేసీఆర్ తన తర్వాత తన కొడుకు, మనవడు రాష్ట్రాన్ని ఏలాలనే ఎజెండాతో పనిచేస్తున్నాడు. నన్ను విడిచి పోయిన వాళ్ల బతుకు ఈ నెల 30 తర్వాత బజారున పడుతుంది. ఎమ్మెల్యేలను, మంత్రులనే లోపలికి రానీయని కేసీఆర్.. వీళ్లను ఎలా దేకుతాడు. కోట్ల రూపాయల ఖర్చు చేసి, పదుల కొద్ది మంత్రులను, ఎమ్మెల్యేలను పంపించి నన్ను చెరబట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఈటల రాజేందర్‎ను కొట్టగలిగే శక్తి కేసీఆర్‎కే కాదు.. ఆయన జేజెమ్మకు కూడా లేదు. నీకే తెలివి, డబ్బులు, ప్రజాబలం ఉన్నాయనుకుంటున్నావా? నేనేంటో ప్రజలకు తెలుసు. నీవు ఎన్ని దావతులిచ్చినా, ఎన్ని పథకాలు ఇచ్చినా, ఓటుకు 20 వేలు ఇచ్చినా నిన్ను నమ్మరు. తలకిందకు, కాళ్లు పైకి పెట్టి పబ్బతి పట్టినా.. కేసీఆర్ అహంకారాన్ని ఓడించడానికి ప్రజలు సిద్ధమయ్యారు. ఈ నెల 30 వరకు మాత్రమే మీరు మాట్లాడుతారు. ఆ తర్వాత.. ఆ మాటలకు బద్లా తీర్చుకుంటా. మిమ్మల్ని నిద్రపోనీయను. ఊరంతా ఒకదారి.. ఊసరవెళ్లి మరోదారి అనే వారి గురించి పట్టించుకోకుండా నన్ను ఆశీర్వదించండి’ అని ఈటల అన్నారు.

For More News..

షారూఖ్ ఇంటికి ఎన్సీబీ అధికారులు

భార్య లేదా గర్ల్​ ఫ్రెండ్ ఉంటేనే ఆ రెస్టారెంట్‎లోకి ఎంట్రీ.!