- జానారెడ్డికి వినతిపత్రం అందజేసిన ఈబీసీ జేఏసీ నేతలు
హైదరాబాద్, వెలుగు: ఎస్సీ, ఎస్టీ కమిషన్ల లాగే ఈబీసీ కమిషన్, కార్పొరేషన్, ఈబీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని ఈబీసీ జేఏసీ నేషనల్ చైర్మన్ వల్లపురెడ్డి రవీందర్ రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అమలు చేస్తున్న అన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అగ్రకులాల నిరుపేదలకు అమలయ్యేలా చూడాలని కోరారు. అగ్రకులాల నిరుపేదలపై దాడులు జరిగినా, దూషణలకు పాల్పడినా కఠిన చర్యలు తీసుకునేలా చట్టాలు రూపొందించాలని విజ్ఞప్తి చేశారు. ఈబీసీల సమస్యలపై రవీందర్ రెడ్డి నేతృత్వంలో 18 అగ్రకులాల నిరుపేదల సంఘాల ప్రతినిధులు బుధవారం హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి నివాసంలో కలిసి ఈబీసీ సమస్యలపై వినతిపత్రం అందజేశారు.
మొత్తం జనాభాలో 25 శాతం మంది అగ్రకులాల వారు ఉన్నారని, వారిలో అత్యధికులు నిరుపేదలు అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా జానారెడ్డి మాట్లాడుతూ, తాను ప్రభుత్వ పెద్దలతో మాట్లాడుతానని హామీ ఇచ్చారు. అగ్రకులాల నిరుపేదల సమస్యల పరిష్కారానికి సహకారం అందిస్తానని తెలిపారు. జానారెడ్డిని కలిసిన వారిలో కమ్మసంఘాల సమాఖ్య అధ్యక్షుడు బొడ్డు రవిశంకర్ రావు, రెడ్డి సంక్షేమ సంఘం నాయకులు పన్యాల మాధవరెడ్డి పాల్గొన్నారు.
