
హైదరాబాద్, వెలుగు: రిటర్నింగ్ అధికారుల పై చాలా ఫిర్యాదులు అందాయని.. అయితే వాళ్లపై చర్యలు తీసుకునే అధికారం తమకు లేదని డిప్యూటీ సీఈఓ సత్యవాణి తెలిపారు. బీఆర్కే భవన్లో శుక్రవారం ఎన్నికల ఏర్పాట్లపై ఆమె మీడియాతో మాట్లాడారు. నామినేషన్ల విషయంలో రిటర్నింగ్ అధికారులపై వచ్చిన కంప్లైంట్స్పై మాట్లాడుతూ.. సీఈఓ ఆఫీస్కు మాత్రమే కాకుండా ఈసీకి కూడా చాలా ఫిర్యాదులు వెళ్లాయన్నారు. అయితే, ఎన్నికలకు సంబంధించి తీసుకునే కొన్ని నిర్ణయాల్లో ఆర్వోలదే ఫైనల్ డిసిషన్ ఉంటుందని తెలిపారు.
ఎంతమంది అభ్యర్థులు ఎక్కడెక్కడ పోటీలో ఉన్నారనేదానిపై స్పష్టత వచ్చిందని, దీంతో బ్యాలెట్ పేపర్ ముద్రణకు కొత్త ప్రింటింగ్ మిషన్లు రెడీ చేస్తున్నట్లు చెప్పారు. పోస్టల్ బ్యాలెట్ లు ఎక్కువగా ఉండటంతో ముందుగా అవి ముద్రిస్తారన్నారు. ఈసారి 299 కొత్త పోలింగ్ కేంద్రాలకు ఈసీ అనుమతించిందని చెప్పారు. కౌంటింగ్ సెంటర్ల అనుమతి ప్రపోజల్స్ కోసం ఈసీకి పంపినట్లు చెప్పారు.
స్ట్రాంగ్ రూమ్ ల కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయని.. ఏ, బీ, సీ, డీ పద్ధతిలో స్ట్రాంగ్ రూమ్ లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈసారి ఎన్నికల్లో 28 వేల మంది దివ్యాంగులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారని చెప్పారు. వారికి కావాల్సిన అన్ని సౌకర్యాలను పోలింగ్ కేంద్రంలో ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. ఒక్కొక్క పోలింగ్ కేంద్రంలో మొత్తం 1,400 మంది ఓటు హక్కు వినియోగించుకునేలా ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు.