లెక్క చెప్పనోళ్లు పక్కకే

లెక్క చెప్పనోళ్లు పక్కకే
  • గత మున్సిపల్ ఎన్నికల ఖర్చులు ఇవ్వనోళ్లపై కొరడా  
  • రాష్ట్ర వ్యాప్తంగా 2,166 మందిపై మూడేళ్ల అనర్హత
  • ఖంగుతిన్న ఆశావహులు

భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు: ఓడిపోయినం కదా ఇంక లెక్కలేం చెప్తం అని నిర్లక్ష్యం చేసినొళ్లపై ఎన్నికల కమిషన్‌‌ కొరడా ఝుళిపించింది. గత మున్సిపల్‌‌ ఎన్నికల్లో ఖర్చులు చెప్పని 2,166 మందిపై మూడేండ్ల దాక పోటీ చేయకుండా నిషేధం విధించింది. ఈ దెబ్బతో మళ్ల పోటీ చేద్దామనుకున్న ఎంతో మంది ఆశలు ఆవిరైనయ్‌‌.

పోటీ చేసే ప్రతి అభ్యర్థి ఎంత ఖర్చు పెడ్తున్నరో లెక్కలు చెప్పాలని ఎలక్షన్‌‌ ఆఫీసర్లు ఆదేశాలిస్తుంటరు. ఎన్నికల్లో గెలిచిన వారు ఎక్కడ అనర్హత వేటు పడుతుందోననే భయంతో లెక్కలు చెప్తుంటరు. ఓడిన వారిలో చాలా మంది ఎలాగూ ఓడిపోయాము కదా అని లెక్కలు చెప్పటంలో నిర్లక్ష్యం చేస్తుంటరు. ఇప్పుడు అదే వారి ఆశలకు గండి కొట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా గత మున్సిపల్ ఎన్నికల్లో ఖర్చుల వివరాలు చెప్పని దాదాపు 2,166 మందిపై మూడేళ్లు వేటు వేస్తూ ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది.

49 మున్సిపాల్టీల్లో

గత మున్సిపల్ ఎన్నికల్లో ఒక్కో అభ్యర్థి లక్ష రూపాయల వరకు ఖర్చు చేసుకునే అవకాశాన్ని ఎన్నికల సంఘం ఇచ్చింది. ఖర్చు వివరాలు 60 రోజుల్లో ఎన్నికల సంఘం ఇచ్చిన ప్రొఫార్మా ప్రకారం చూపించాల్సి ఉంది. 2014 ఎన్నికలు జరిగినా లెక్కలు చూపించటంలో చాలా మంది అభ్యర్థులు అశ్రద్ధ చేశారు. ఎన్నికల ఖర్చును తప్పనిసరిగా చూపించాలని నామినేషన్ నాటి నుంచి ఆఫీసర్లు ఎప్పటికప్పుడు అభ్యర్థులను హెచ్చరిస్తున్నా పెద్దగా పట్టించుకోలేదు.

కొందరేమో లెక్కలపై అవగాహన లేక, మరికొందరేమో లెక్కలు చూపించకపోతే ఏమవుతుందిలే అనే ధీమా ఇప్పుడు బెడిసి కొట్టింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 49 మున్సిపాల్టీ / నగరపంచాయతీల్లో లెక్కలు చూపించని 2,166 మందిపై అనర్హత వేటు వేసింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను ఆయా మున్సిపాల్టీలకు జారీ చేసింది. కొద్ది మందికి మాత్రం 2019 డిసెంబర్ వరకు, ఎక్కువ మందికి 2020 వరకు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం అందులో పేర్కొంది.

అప్పుడు తెలిసో తెలియకో చేసిన నిర్లక్ష్యానికి ఇప్పుడు అనర్హత వేటు అంటూ ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేయటంతో పలువురు ఆశావహులు లబోదిబో మంటున్నారు. ఏం చేయాలి అంటూ తలలు పట్టుకుంటున్నారు.

వంద మందికిపైగా అనర్హత వేటు పడిన మున్సిపాల్టీల వివరాలు

జిల్లా             మున్సిపాల్టీ / నగరపంచాయతీ                    వేటు పడినవారు

ఆదిలాబాద్                 ఆదిలాబాద్                                       114 మంది

కరీంనగర్                   కరీంనగర్​                                         132 ,,

నిజామాబాద్                 బోధన్                                           121 ,,

పెద్దపల్లి                      రామగుండం                                       363 ,,