స్థానిక ఎన్నికలకు ఈసీ రెడీ.. అక్టోబర్ 9 నుంచి నవంబర్ 10లోగా ముగించేలా ఏర్పాట్లు

స్థానిక ఎన్నికలకు ఈసీ రెడీ.. అక్టోబర్ 9 నుంచి నవంబర్ 10లోగా ముగించేలా ఏర్పాట్లు
  • అక్టోబర్ ​9 నుంచి నవంబర్​ 10లోగా ముగించేలా ఏర్పాట్లు 
  • అన్నీ అనుకూలిస్తే ఈ నెల 29న షెడ్యూల్.. అటు జిల్లాల్లో అధికారులు కూడా సిద్ధం  
  • సీల్డ్​ కవర్‌‌లో కలెక్టర్లకు చేరిన రిజర్వేషన్ల జాబితాలు 
  • సర్కార్ నుంచి జీవో రావడమే తరువాయి.. 

హైదరాబాద్, వెలుగు: స్థానిక ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. ఇందుకు అవసరమైన ఎలక్షన్​ ప్లాన్​అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు మంగళవారం సీఎస్​రామకృష్ణారావుకు స్టేట్​ఎలక్షన్​కమిషన్ లేఖ రాసింది. ఎన్నికల ప్రక్రియలో భాగంగా గ్రామ పంచాయతీలకు సంబంధించిన ఓటర్ల జాబితా సెప్టెంబర్​2న ప్రచురించామని.. మండల, జిల్లా పరిషత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌లకు చెందిన ఓటర్ల జబితా సెప్టెంబర్ 10న ప్రచురించామని ఎన్నికల అధికారులు పేర్కొన్నారు.

 అదనంగా పోలింగ్ కేంద్రాల జాబితాను కూడా  ప్రచురించామని వెల్లడించారు. ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం తరఫున ఏర్పాట్లపై సమాచారం ఇవ్వాలని కోరారు. మరోవైపు ఎన్నికల నిర్వహణకు పంచాయతీరాజ్​ శాఖ ఆధ్వర్యంలో అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. డెడికేటెడ్​కమిషన్​రిపోర్ట్​ప్రకారం ఖరారు చేసిన రిజర్వేషన్ల జాబితాలను జడ్పీ సీఈవోలు, డీపీవోలు సీల్డ్​కవర్లలో కలెక్టర్లకు అందజేశారు.

 జడ్పీల రిజర్వేషన్లపై పంచాయతీరాజ్ శాఖ డైరెక్టర్ ఇప్పటికే కసరత్తు పూర్తి చేశారు. రిజర్వేషన్ల వివరాలను మాత్రం అత్యంత గోప్యంగా ఉంచుతున్నారు. -కలెక్టర్లతో మంగళవారం మరోసారి వీడియో కాన్ఫరెన్స్​నిర్వహించిన పంచాయతీరాజ్​డైరెక్టర్..​ -బ్యాలెట్​బాక్స్‌‎లు, పేపర్లు, పోలింగ్ ​సామగ్రి మరోసారి చెక్ చేయాలని సూచించారు. 

రెండు విడతల్లో.. 

స్థానిక ఎన్నికలను రెండు విడతల్లో నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తున్నది. నాలుగైదు జిల్లాలు మినహా మిగతా అన్నిచోట్ల సర్పంచ్​ఎన్నికలు రెండు విడతల్లో.. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను రెండు విడతల్లో పూర్తి చేయాలని భావిస్తున్నది. ఇప్పటికే జిల్లా కలెక్టర్లతో మాట్లాడి.. ఆ మేరకు ఎన్నికల నిర్వహణకు కసరత్తు చేస్తున్నది. ఆదిలాబాద్, నారాయణపేట లాంటి జిల్లాల్లో సిబ్బంది, ఇతరత్రా కారణాలతో మూడు విడతల్లో నిర్వహించాలని అక్కడి కలెక్టర్లు కోరినట్లు తెలిసింది. 

మరోసారి ప్రభుత్వంతో సంప్రదించి ఎన్ని ఫేజ్‌‌లలో  నిర్వహించాలనే దానిపై నిర్ణయం తీసుకోనున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ నెల 29న షెడ్యూల్​రిలీజ్​చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. అక్టోబర్​రెండో వారంలో ఫస్ట్​ఫేజ్​ నోటిఫికేషన్ ఇవ్వాలని చూస్తున్నది. నవంబర్ 10 కల్లా సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు పూర్తి చేయాలని భావిస్తున్నది. 

హైకోర్టులో రిట్ ​పిటిషన్‌పై అందరి దృష్టి..

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఎస్సీ, ఎస్టీలకు 2011 జనాభా లెక్కల ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వాలని కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. ఇందుకోసం బీసీ డెడికేటెడ్​కమిషన్​ ఇచ్చిన నివేదికను ఆధారంగా చేసుకుని ముందుకెళ్లాలని స్పస్టం చేసింది. ఈ క్రమంలో ఇప్పటికే రిజర్వేషన్ల ప్రక్రియను కలెక్టర్లు పూర్తి చేశారు. బుధవారం ప్రభుత్వానికి సమర్పించే అవకాశం ఉంది. ఆ తర్వాత బీసీలకు రిజర్వేషన్లపై ప్రత్యేక జీవో ఇచ్చి.. స్థానిక ఎన్నికల రిజర్వేషన్ల గెజిట్​ప్రచురించాలని ప్రభుత్వం భావిస్తున్నది. 

ఇదిలా ఉండగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై హైకోర్టులో రిట్​పిటిషన్​దాఖలైంది. ఈ కేసు బుధవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటి వరకు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లు ప్రభుత్వం ఎలాంటి జీవో ఇవ్వలేదు. కాగా, రాష్ట్ర ప్రభుత్వం డెడికేటెడ్​కమిషన్​ఎంపిరికల్​ డేటాను విశ్లేషించి తేల్చిన రిజర్వేషన్ల ఆధారంగా ముందుకు వెళ్తున్నట్లు చెబుతోంది. 

సుప్రీం ఇచ్చిన తీర్పునకు అనుగుణంగా బీసీ డెడికేటెడ్ కమిషన్​ఇచ్చే నివేదిక ఆధారంగానే రిజర్వేషన్లు ఉంటాయని పంచాయతీరాజ్​చట్టం–2018ను ప్రభుత్వం సవరించింది. దీంతో ఆ ప్రకారమే రిజర్వేషన్లు ఇస్తున్నట్లు పేర్కొంటున్నది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదు. దీంతో హైకోర్టులో ప్రభుత్వం ఏం చెబుతుందనేది ఆసక్తికరంగా మారింది.

 ఇప్పటికైతే ఎలాంటి ఆధారాలు పిటిషనర్లు సమర్పించలేదని తెలుస్తున్నది. ఒకవేళ కోర్టు ఈ విషయంలో కలుగజేసుకోకపోతే ప్రభుత్వం ఈ నెల 29న ఎన్నికల షెడ్యూల్​ప్రకటించేందుకు సిద్ధమవుతున్నది. ఒకవేళ రిజర్వేషన్లు 50 శాతం మించకూడదని హైకోర్టు చెప్పినా ఆ ప్రకారం రిజర్వేషన్లను రెండు, మూడు రోజుల్లోనే ఖరారు చేసి.. బీసీలకు 23శాతం రిజర్వేషన్లు అధికారికంగా ఇచ్చి, మిగిలిన సీట్లు పార్టీ పంగా ఇచ్చి ఎన్నికలకు వెళ్లే అవకాశముందని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. 

రిజర్వేషన్లపై జిల్లా అధికారుల కసరత్తు.. 

స్థానిక ఎన్నికల కోసం  జిల్లా అధికారులు కసరత్తు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా మంగళవారం అన్ని జిల్లాల్లో డీపీవోలు, ఆర్డీవోలు, ఎంపీడీవోలతో కలెక్టర్లు, జడ్పీ సీఈవోలు  సమావేశాలు నిర్వహించారు. రిజర్వేషన్ల ఖరారు సమయంలో తలెత్తిన సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అదే సమయంలో ఎన్నికల నిర్వహణకు గ్రామాల వారీగా అవసరమైన సిబ్బంది, బ్యాలెట్ బాక్స్‌లు, బ్యాలెట్ పేపర్లపైనా ఫీడ్‌‌‌‌‌‌‌‌బ్యాక్​తీసుకున్నారు. 

మరోవైపు పీఆర్​డైరెక్టర్​సృజన కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్​నిర్వహిస్తూ ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేస్తున్నారు.  బ్యాలెట్ పేపర్లు, బాక్స్‌ల స్టోర్​రూమ్‌లను ఎప్పటికప్పుడు చెక్​ చేయాలని, వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో  తడి, దుమ్ము, చెదలు పట్టకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.  

బ్యాలెట్​బాక్స్‌‌లు, పేపర్లు సిద్ధం..  

లోకల్​బాడీ ఎన్నికల కోసం అధికారులు 8 నెలల క్రితమే బ్యాలెట్ పేపర్లను ముద్రించారు. రాష్ట్ర వ్యాప్తంగా 50 వేల బ్యాలెట్ రిమ్స్, 48 వేల బ్యాలెట్ బాక్స్‌‌లను రెడీ చేశారు. కర్నాటక, ఏపీ, గుజరాత్​తదితర రాష్ట్రాల నుంచి అదనంగా మరో 18 వేల బాక్స్​లను  తెప్పించారు. మైసూరు పెయింట్స్ అండ్ వార్నిష్​  కంపెనీ నుంచి ప్రభుత్వం బ్యాలెట్ పేపర్, ఇంకు బాటిల్స్ తీసుకొచ్చింది. 

కాగా, ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత ఓటరు ఎడమచేతి వేలుపై వేసే ఇంక్‌ను పాయిల్స్ బాటిల్ అంటారు. సర్పంచ్ ఎన్నికలకు అవసరమైన 1.48 లక్ష పాయిల్స్ బాటిళ్లు.. పరిషత్  ఎన్నికలకు వినియోగించేందుకు 48 వేల పాయిల్స్ బాటిల్స్‎ను సైతం పోలింగ్​కేంద్రాలకు చేరవేశారు.