
- సెప్టెంబర్ 30న ఫైనల్ ఓటర్ లిస్ట్ ప్రకటిస్తామని వెల్లడి
న్యూఢిల్లీ: బిహార్‌లో ఓటరు లిస్టు స్పెషల్ రివిజన్ (సర్) సందర్భంగా కొత్తగా నమోదు చేసుకున్నవారిలో 98.2% మంది నుంచి డాక్యుమెంట్లు ఇప్పటికే అందాయని ఎన్నికల కమిషన్ ఆదివారం ప్రకటించింది. ఆగస్టు 1 నుంచి క్లెయిమ్‌లు, అభ్యంతరాలపై ఓటర్లు తమ డాక్యుమెంట్లు అందజేస్తున్నారని తెలిపింది. సెప్టెంబర్ 1 డెడ్‌లైన్ అని వెల్లడించింది. ఇంకా 8 రోజుల గడువు ఉందని, డాక్యుమెంట్లు అందజేయని వాళ్లు సబ్మిట్ చేయాలని కోరింది. ‘‘ఆగస్టు 24 వరకు మొత్తం 7.24 కోట్ల ఓటర్లలో 98.2 శాతం మంది తమ పత్రాలను సమర్పించారు. మిగిలిన 1.8 శాతం డాక్యుమెంట్లు అందాల్సి ఉన్నాయి.
ఓటర్లు రోజుకు సగటున 1.64 శాతం డాక్యుమెంట్లు సబ్మిట్ చేశారు. ముసాయిదా జాబితాలో తప్పుగా నమోదైన వివరాలను సరిచేయించుకోవడానికి ఓటర్లకు ఇదే చివరి అవకాశం. ఓటర్లు ఎన్యూమరేషన్ ఫామ్స్ ఇచ్చిన టైమ్‌లో సమర్పించని పత్రాలను ఇప్పుడు సబ్మిట్ చేయొచ్చు. సెప్టెంబర్ 25 వరకు క్లెయిమ్‌లు, అభ్యంతరాలు, డాక్యుమెంట్ల వెరిఫికేషన్ కంప్లీట్ చేస్తాం. ఫైనల్ ఓటర్ లిస్ట్‌ను సెప్టెంబర్ 30న రిలీజ్ చేస్తాం. సర్ ప్రక్రియలో బిహార్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్, 38 జిల్లాల డీఈవోలు, 243 ఈఆర్‌వోలు, 2,976 ఏఈఆర్‌వోలు, 90,712 బీఎల్‌వోలు, లక్షలాది వాలంటీర్లు, 12 ప్రధాన రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు’’ అని ఈసీ ప్రకటించింది.
ఓటర్ లిస్టులో ఇద్దరు పాకిస్తానీ మహిళలు
1956లో ఇండియాలోకి ప్రవేశించిన ఇద్దరు పాకిస్తానీ మహిళలు బిహార్‌లో ఓటర్లుగా నమోదు చేసుకున్నట్లు తెలిసింది. వారిని ఇమ్రానా ఖానమ్ అలియాస్ ఇమ్రానా ఖాతూన్, ఫిర్దౌసియా ఖానమ్ అలియాస్ ఫిర్దౌసియా ఖాతూన్‌గా గుర్తించారు. దీనిపై కేంద్ర హోంశాఖ దర్యాప్తు ప్రారంభించిందని భాగల్పూర్ కలెక్టర్ నావల్ కిశోర్ చౌదరి తెలిపారు. ‘‘ఫిర్దోషియా 1956లో 3 నెలల వీసాపై, ఇమ్రానా మూడేండ్ల వీసాపై ఇండియాకు వచ్చారు. భాగల్పూర్ జిల్లాలోని భికన్‌పూర్‌లో స్థిరపడ్డారు. వీరికి ఓటర్ కార్డులు ఉండటాన్ని కేంద్రం గుర్తించింది. విచారణ జరపాలని ఆదేశించింది. వారికి నోటీసులు ఇస్తాం’’అని నావల్ కిశోర్ తెలిపారు.