ఈసీ నిఘా..తెలంగాణ రాష్ట్రంపై స్పెషల్​ ఫోకస్

ఈసీ నిఘా..తెలంగాణ రాష్ట్రంపై స్పెషల్​ ఫోకస్
  • చెక్​పోస్టుల వద్ద కేంద్ర బలగాలు.. సీసీ కెమెరాలు
  • ప్రతి నియోజకవర్గానికి ఒక స్పెషల్​ ఆఫీసర్​
  • మనీ, మందు కట్టడిపై ప్రధాన దృష్టి
  • ప్రభుత్వ వాహనాలు కూడా చెకింగ్
  • అధికారులపై ఎప్పటికప్పుడు రిపోర్టులు

హైదరాబాద్​/నల్గొండ, వెలుగు : రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) స్పెషల్​ నిఘా పెట్టింది.  2018 అసెంబ్లీ ఎన్నికలు, ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో డబ్బు, మద్యం ఏరులై పారడాన్ని సీరియస్​గా తీసుకున్న ఈసీ.. ఈసారి కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది. ఓటర్లను ప్రలోభపెట్టడంలో రూలింగ్​ పార్టీకి తెరవెనుక సహకరిస్తున్నారనే అనుమానమున్న ఐఏఎస్​, ఐపీఎఫ్ ఆఫీసర్లపై ఓ కన్నేసి ఉంచింది. ఇటీవల రాష్ట్ర పర్యటనలో భాగంగా పలువురు అధికారులకు గట్టి వార్నింగ్ ఇచ్చిన ఈసీ.. ఇప్పుడు ఏకంగా పలువురికి ట్రాన్స్​ఫర్​ ఆర్డర్స్​ కూడా జారీ చేసింది. ఏ ఆఫీసర్​ అయినా సరే ఎన్నికల విధుల్లో పక్షపాతం చూపిస్తే సహించేది లేదని కేంద్ర ఎన్నికల సంఘం హెచ్చరించింది.

రూలింగ్​ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తే మరింత కఠినమైన చర్యలు తీసుకుంటామని వార్నింగ్​ ఇచ్చింది. మరోవైపు డబ్బు, లిక్కర్​రవాణాను అడ్డుకోవడంలో కీలకమైన చెక్​పోస్టులను స్థానిక పోలీసులకు పూర్తిస్థాయిలో అప్పగించడం వల్ల ఆ పోలీసులు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. దీంతో ఈసారి రెండంచెల చెక్​పోస్టుల విధానానికి ఈసీ శ్రీకారం చుట్టింది. స్థానిక పోలీసులకు అదనంగా సీఆర్​పీఎఫ్​ బలగాలను చెక్​పోస్టుల వద్ద మోహరిస్తున్నది. 

స్పెషల్ అబ్జర్వర్ల చేతుల్లోకి..!

తెలంగాణ ఎన్నికలు అత్యంత ఖరీదైన ఎలక్షన్స్ అని దేశవ్యాప్తంగా ముద్రపడింది. ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న మిగతా రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలోనే విచ్చలవిడిగా డబ్బు, మద్యం పంపిణీ జరుగుతాయన్న కంప్లయింట్స్  ఈసీ దృష్టికి వెళ్లాయి.  2018 అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఉప ఎన్నికల్లో  మనీ, మందు  ఏరులై పారినట్లు, కోడ్ ఉల్లంఘనలు కూడా మన రాష్ట్రంలోనే అత్యధికంగా ఉన్నట్లు ఈసీకి ఫిర్యాదులు అందాయి.  ఈ నేపథ్యంలో..  ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ నిర్వహించేందుకు రాష్ట్రంలో స్పెషల్ అబ్జర్వర్లను ఈసీ రంగంలోకి దింపుతున్నది. ప్రత్యేక ఎన్నికల అబ్జర్వర్స్​తో పాటు ఎక్స్​పెండిచర్ అబ్జర్వర్స్ సంఖ్యను కూడా పెంచుతున్నది. ప్రతి నియోజకవర్గం నుంచి ఈసీ తరపున ఒక అధికారి స్పెషల్​గా పనిచేయనున్నారు. ఆ ఆఫీసర్​ ఎప్పటికప్పుడు పరిస్థితిని ఈసీకి రిపోర్ట్ చేస్తారు. ఈ అబ్జర్వర్స్​ ఆదేశాల మేరకే కలెక్టర్లు, ఎస్పీలు పనిచేయాల్సి ఉంటుంది.  

ఇందులో భాగంగా కలెక్టర్లు, సీపీలు శాంతిభద్రతల విషయంలో ఇప్పటికే పోలీస్​ అధికారులకు ఆదేశాలిచ్చారు. సీ-విజిల్​ యాప్​ గురించి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. పోలీస్​ డిపార్ట్​మెంట్​ గుర్తించిన సమస్యాత్మక గ్రామలపైన నిఘా పెంచారు. 

జిల్లాల బార్డర్స్​లో భారీగా బందోబస్తు

ఎన్నికల టైమ్​లో డబ్బు, మద్యం తరలిస్తున్న కొన్ని వాహనాలను పోలీసులు చూసి చూడనట్లు వదిలేస్తున్నారనే దానిపై ఈసీకి చాలా కంప్లయింట్స్​ వెళ్లాయి. దీంతో ప్రభుత్వ వాహనాలను కూడా తనిఖీ చేయాల్సిందేనంటూ ఇటీవల రాష్ట్ర పర్యటనలో ఈసీ ఆదేశించింది. ఎన్నికల షెడ్యూల్​వెలువడ్డ 24 గంటల వ్యవధిలోనే జిల్లాల సరిహద్దుల్లో  భారీగా బందో బస్తు ఏర్పాటు చేయడమేకాకుండా తనిఖీలు ముమ్మరం చేసింది.

ఇంతకుముందులా కాకుండా ఈసారి రెండంచెల విధానంలో చెక్​పోస్టులు ఏర్పాటుచేస్తున్నారు. స్థానిక పోలీసులకు అదనంగా సీఆర్​పీఎఫ్​ బలగాలను మోహరిస్తున్నారు. ఈ నెల 22 నుంచి కేంద్ర బలగాలను కూడా రంగంలోకి దించుతున్నారు. గతంతో పోలిస్తే రెట్టింపు స్థాయిలో సీఆర్​పీఎఫ్​ బలగాలు ఈసారి రాష్ట్రానికి రానున్నట్లు ఓ ఆఫీసర్​‘వెలుగు’తో చెప్పారు.

ఇప్పుడున్న 148 చెక్​ పోస్టులను మరింత పెంచాలని ఈసీ చూస్తున్నది. ప్రతిచోట సీసీ కెమెరాల నిఘా పెడుతున్నది. 24/7  రాష్ట్రంలో ఎక్కడ ఏం జరుగుతుందనే దానిపై అబ్జర్వేషన్​ పెట్టింది. ఎన్​ఫోర్స్​మెంట్​ ఏజెన్సీల నుంచి కూడా ఎప్పటికప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం సమాచారం తెప్పించుకుంటున్నది. లిక్కర్​ గోదాములు, వైన్స్​ల్లో ఎంత స్టాక్​ ఉంది ? రోజుకు సేల్స్​ ఎంత ? ఎంతమేర అమ్మాలి.. అనే దానిపై రికార్డులు నమోదు చేయిస్తున్నది. 

ఆ ఆఫీసర్లకు క్లాస్​

ఇటీవల రాష్ట్ర పర్యటనకు వచ్చిన ఎన్నికల సంఘం అధికారులు గత ఎన్నికల రిపోర్టులను ముందేసుకొని.. కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్​ కమిషనర్ల తీరుపై మండిపడ్డట్టు తెలిసింది.  విశ్వసనీయ వర్గాల సమా చారం ప్రకారం.. గతేడాది జరిగిన మునుగోడు ఉప ఎన్నికల్లో పనిచేసిన అప్పటి కలెక్టర్​ వినయ్​ కృష్ణారెడ్డి, ఎస్పీ రెమా రాజేశ్వరి పనితీరును ఈసీ ఆఫీసర్లు ఎండ గట్టారు. ఈసీని సంప్రదించకుండానే అప్పటి ఎన్నికల రిటర్నింగ్​ఆఫీసర్​ ఏకపక్షంగా పార్టీ సింబల్​ మార్చిన విషయాన్ని కూడా ప్రస్తావించారు.

సదరు ఆఫీసర్​తో పాటు ఇద్దరు తహసీల్దార్లను తాము ఎన్నికల విధుల నుంచి తప్పించిన విషయాన్ని కూడా గుర్తుచేశారు. మునుగోడు ఎన్నికల్లో విచ్చలవిడిగా డబ్బు, మద్యం, ఇతర విలువైన వస్తువులు పంపిణీ చేసినట్టు మీడియాలో వార్తలు వచ్చినా.. ఆఫీసర్ల సోదాల్లో  కేవలం రూ.4.66 కోట్లు దొరకడంలోని ఆంతర్యం ఏమిటని ఈసీ అధికారులు నిలదీశారు. ఇక మద్యం ఏరులై పారినా ఆఫీసర్లు కేవలం 6,143 లీటర్లే సీజ్​చేయడం వెనుక అనుమానించాల్సి వస్తోందని ఎలక్షన్​ ఆఫీసర్లు అన్నట్లు తెలిసింది.