- ఉత్తర్వులు జారీ చేసిన ఈసీ
- ఈ నెల 21న ఎన్నిక
న్యూఢిల్లీ: మహారాష్ట్రలో మండలి ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దీంతో పదవీ గండంతో సతమతమవుతున్న మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే ఊపిరి పీల్చుకున్నారు. ఈ నెల 21న ఎన్నికలు నిర్వహించేందుకు వీలుగా ఎలక్షన్స్‌ను వాయిదా వేస్తూ ఇచ్చిన ఉత్తర్వులను ఈసీ సవరించింది. కరోనా నేపథ్యంలో ప్రతి ఒక్కరు జాగ్రత్తలు తీసుకోవాలని, మాస్కులు వేసుకుని, సోషల్ డిస్టెంసింగ్ పాటించాలని చెప్పారు. కాగా ఇప్పుడు థాక్రే పదవిలో కొనసాగేందుకు లైన్ క్లియర్ అయింది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఎలాంటి పదవి లేకుండా సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన ఉద్ధవ్ థాక్రే ఈ నెల 28లోపు ఎమ్మెల్సీగా ఎన్నిక కావాల్సి ఉంది. ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ గవర్నర్ భగత్‌సింగ్ కోశ్యారీ ఈసీకి లెటర్ రాయడంతో ఈసీ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మహారాష్ట్రలో జరిగిన ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేసిన శివసేన రిజల్ట్ తర్వాత సీఎం పదవి విషయంలో బీజేపీతో గొడవ పెట్టుకుని కాంగ్రెస్, ఎన్సీపీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రిగా ఉద్ధవ్ థాక్రే ప్రమాణస్వీకారం చేశారు. ఈ నెల 28 నాటికి ఆరు నెలల కాలం ముగియనుంది. దీంతో థాక్రేను మండలికి నామినేట్ చేయాలని కోరుతూ రాష్ట్ర కేటినెట్ తీర్మానం చేసి దాన్ని గవర్నర్‌కు పంపగా.. ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో థాక్రే ప్రధాని మోడీకి ఫోన్ చేసి గవర్నర్‌తో మాట్లాడమని కోరారు. థాక్రే విజ్ఞప్తికి స్పందించిన మోడీ గవర్నర్‌తో ఫోన్‌లో మాట్లాడి ఎన్నికలు నిర్వహించేలా ఈసీని కోరాలని చెప్పడంతో గవర్నర్ ఈసీకి లెటర్ రాసినట్లు తెలుస్తోంది.
