ఆక‌ట్టుకుంటున్న కొబ్బ‌రికాయ‌ల‌ గ‌ణ‌ప‌య్య‌

ఆక‌ట్టుకుంటున్న కొబ్బ‌రికాయ‌ల‌ గ‌ణ‌ప‌య్య‌

హైద‌రాబాద్: వినాయక చవితి వచ్చిందంటే చాలు ప్రతీ గల్లీలో సందడి నెలకొంటుంది. చిన్న పెద్ద అనే తేడా లేకుండా వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్టించి.. ప్రత్యేక పూజలతో స్వామి వారిని కొలుస్తారు. గల్లీకో రకమైన వినాయకుడి విగ్రహం దర్శన మిస్తుంటుంది. ఇందుకోసం చాలా రకాల రూపాల్లో,ఆకర్షణీయ రంగుల్లో వినాయకుడిని రూపొందిస్తారు.  అందరి కంటే తాము ఏర్పాటు చేసే విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా ఉండాలని భావిస్తుంటారు. మండపాల అలంకరణలోనూ శ్రద్ధ వహిస్తారు. కొందరు భారీగా విగ్రహాలు నెలకొల్పి ప్రతిష్టాత్మకంగా చవితిని నిర్వహిస్తే.. మరికొందరు ఈ పండగ ద్వారా సందేశాలిస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తుంటారు. ఈ క్ర‌మంలోనే  హైద‌రాబాద్ లో తయారుచేసిన కొబ్బరికాయల గణపతి అందర్ని విశేషంగా ఆకట్టుకుంటున్నాడు.

పర్యావరణ ర‌క్ష‌ణ‌లో భాగంగా త‌యారు చేసిన‌ (ఏకో ఫ్రెండ్లీ గణేష్) విగ్రహం ప్రజలను ఆకర్షిస్తోంది. లోయ‌ర్ ట్యాంక్ బండ్ లో ఉన్న ఈ మండ‌పానికి భ‌క్తులు క్యూ క‌డుతున్నార‌ని నిర్వాహ‌కుడు అనూప్ తెలిపారు. ప్ర‌తి ఏడాది ప‌ర్యావ‌ర‌ణంపై అవేర్ నెస్ చేసేలా వినాయ‌క చ‌వితిని సెల‌బ్రేట్ చేస్తున్నామ‌న్నారు. ర‌క‌ర‌కాల గ‌ణేష్ ప్ర‌తిమ‌ల‌ను చుట్టుప‌క్క‌ల‌వారితో క‌లిసి వినూత్నంగా ఏర్పాటు చేస్తామ‌ని చెప్పారు. హైద‌రాబాద్ లో రోజు రోజుకి పెరుగుత‌న్న పొల్యూష‌న్ దృష్టిలో పెట్టుకుని ఈ సారి ప‌చ్చ‌ద‌నంతో ఉండేలా కొబ్బ‌రికాయ‌ల విగ్ర‌హాన్ని ఏర్పాటు చేశామ‌ని తెలిపారు. 

గ‌ణేష్ విగ్ర‌హం త‌యారీ కోసం కేర‌ళ నుంచి 17 వేల కొబ్చ‌రి కాయ‌ల‌ను తెప్పించామ‌ని తెలిపారు.  పర్యావరణ హితాన్ని దృష్టిలో పెట్టుకుని ఎంతో క‌ష్ట‌ప‌డి కొబ్బరి కాయలతో గణపతిని రూపొందించామ‌ని సంతోషం వ్య‌క్తం చేశారు. గణపతి నిమజ్జనం తర్వాత ఈ కొబ్బరి బొండాలను భక్తులకు ప్రసాదంగా పంచనున్నామని నిర్వాహకులు తెలిపారు. తొమ్మిది రోజులపాటు గణపతిని ద‌ర్శించుకునేందుకు ప‌ర్యాట‌కులు, దూర‌ప్రాంతాల నుంచి వ‌స్తున్నార‌ని చెప్పారు. హిందువులే కాక అన్ని మ‌తాల‌వారు గ‌ణ‌ప‌య్య‌ను ద‌ర్శించుకుంటున్నారని చెప్పుకొచ్చారు. కొబ్బ‌రికాయ‌ల గ‌ణేషుడిని చూసిన‌వారంతా మార్పు మ‌న‌తోనే స్టార్ట్ కావాల‌ని.. పొల్యూష‌న్ నుంచి ప్ర‌పంచాన్ని కాపాడుకోవాలంటే మ‌న చేతుల్లోనే ఉంద‌ని ప‌లువురు అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నారు.