గ్రామాల్లో మెజారిటీ యూత్ స్మార్ట్ ఫోన్లను సోషల్ మీడియాకే వాడుతున్నరు.. ఎకనమిక్ సర్వే రిపోర్ట్

గ్రామాల్లో మెజారిటీ యూత్ స్మార్ట్ ఫోన్లను సోషల్ మీడియాకే వాడుతున్నరు.. ఎకనమిక్ సర్వే రిపోర్ట్

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వే యువత భవిష్యత్తుపై భారీ హెచ్చరికను జారీ చేసింది. నేటి డిజిటల్ యుగంలో స్మార్ట్‌ఫోన్ అనేది ఒక విజ్ఞాన గని కావాల్సింది పోయి.. యువతను పెడదారి పట్టిస్తున్న ఒక వ్యసనంగా మారుతోందని సర్వే కుండబద్దలు కొట్టింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో సాంకేతికత అందుబాటులోకి రావటంతో అది సరైన రీతిలో వినియోగం కాకపోవడం దేశాభివృద్ధికి పెను సవాలుగా మారుతోందని కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. 

గ్రామీణ ప్రాంతాల్లో ఒకప్పుడు స్మార్ట్‌ఫోన్ అంటే చాలా తక్కుమ మంది దగ్గర ఉండే అరుదైన పరికరంగా ఉండేది. కానీ ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా మారింది.14 నుంచి 16 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న రూరల్ యూత్ దాదాపు 89.1 శాతం మందికి ఇంట్లోనే స్మార్ట్‌ఫోన్ సౌకర్యం ఉంది. అంటే నగరాలతో సంబంధం లేకుండా డిజిటల్ విప్లవం పల్లె పల్లెకూ చేరుకుంది. అయితే వీటిని విద్యకు వాడకుండా సోషల్ మీడియా, టైం పాస్ కోసం వాడటం పెద్ద సమస్యగా మారిందని ఎకనమిక్ సర్వే ఆందోళన వ్యక్తం చేసింది.

Also Read  :రూపాయి రికార్డ్ పతనంతోనే చిక్కంతా

యువత గంటల తరబడి స్మార్ట్‌ఫోన్లను పట్టుకుని కేవలం సోషల్ మీడియా రీల్స్, వీడియోలు, అనవసరపు చాటింగ్‌లతో కాలక్షేపం చేస్తున్నారని సర్వే ఎమర్జెన్సీ అలారం మోగించింది. స్మార్ట్‌ఫోన్ వాడే వారిలో కేవలం సగం మంది మాత్రమే దానిని విద్యా సంబంధిత పనుల కోసం ఉపయోగిస్తుండగా.. ఏకంగా 75 శాతం మంది సామాజిక మాధ్యమాలకే అంకితమవుతున్నారు. విజ్ఞానాన్ని పెంచుకోవాల్సిన సమయంలో యువత వినోదం వైపు, డిజిటల్ వ్యాపకాల వైపు మొగ్గు చూపడం వల్ల వారి సృజనాత్మకత, నేర్చుకునే సామర్థ్యం దెబ్బతింటోంది. ఇది కేవలం సమయం వృధా మాత్రమే కాదు.. భారత మానవ వనరుల నాణ్యతను, ప్రొడక్టివిటీని తగ్గించే పెద్ద ప్రమాదంగా రిపోర్ట్ హైలైట్ చేసింది.

వికసిత్ భారత్ @2047 లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఈ పరిస్థితిలో తక్షణ మార్పు రావాలని ఆర్థిక సర్వే నొక్కి చెప్పింది. కేవలం పిల్లలను బడిలో చేర్పించటం ఒక్కటే ముఖ్యం కాదని, వారు ఏం నేర్చుకుంటున్నారు  అనేదే కీలకమని స్పష్టం చేసింది. డిజిటల్ స్క్రీన్ టైమ్ అనేది విద్యార్థులలో నైపుణ్యాల పెంపునకు తోడ్పడాలి తప్ప, అది వారిని సోషల్ మీడియా మాయాజాలంలో బందీలను చేయకూడదు. ఇందుకోసం 'విద్యా సమీక్షా కేంద్రాల' ద్వారా విద్యార్థుల పురోగతిని పర్యవేక్షించడం, టీచర్స్ డిజిటల్ సాధనాలను నిర్మాణాత్మకంగా బోధించడం అత్యవసరమని సర్వే పేర్కొంది. యువత తమ చేతిలో ఉన్న స్మార్ట్‌ఫోన్‌ను విజ్ఞాన ఆయుధంగా మార్చుకోకపోతే.. దేశ ఉత్పాదకతపై అది దీర్ఘకాలిక ప్రభావం చూపుతుందని ప్రభుత్వం హెచ్చరించింది.