
ముంబై : పాలసీ రేటును రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మరో అర శాతం పెంచొచ్చని ఎకానమిస్టులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే మొదలైన ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ శుక్రవారం తన నిర్ణయాన్ని ప్రకటించనుంది. ఇన్ఫ్లేషన్ కట్టడి చేయడంతోపాటు, రూపాయి విలువను బలోపేతం చేయడానికీ ఆర్బీఐ ప్రయత్నిస్తోంది. ఆర్బీఐ రెపో రేటును అర శాతం పెంచే ఛాన్స్ ఉందని బ్లూమ్బర్గ్ సర్వేలో పాల్గొన్న 27 మంది ఎకానమిస్టులలో 13 మంది అభిప్రాయపడ్డారు. వీరిలో ఒకరు మాత్రమే రెపో రేటను 0.40 శాతం పెంచొచ్చని చెప్పగా, 9 మంది 0.35 శాతమే పెంచొచ్చని పేర్కొన్నట్లు బ్లూమ్బర్గ్ సర్వే వెల్లడించింది. మిగిలిన అందరూ 0.50 శాతం పెంపుదల ఉంటుందని చెప్పినట్లు పేర్కొంది.
ఎకానమీ గాడిలో పడటానికి సాయపడేలా రేట్లు ఉండాలని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ చూస్తున్నారు. ఈ ఏడాది మే నెల నుంచి ఇప్పటిదాకా రెపో రేటును 0.90 % (90 బేసిస్ పాయింట్లు) మేర ఆర్బీఐ పెంచింది. రెపో రేటుతో పాటు, ఇన్ఫ్లేషన్ పరిస్థితి, రూపాయి బలపడటానికి చర్యలు వంటి ఇతర అంశాల పైనా ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ శుక్రవారం ప్రకటించనున్నారు. ఇన్ఫ్లేషన్ను 6 శాతానికి పరిమితం చేయాలని ఆర్బీఐ టార్గెట్గా పెట్టుకుంది. ఇటీవల కాలంలో తగ్గుతున్న కమోడిటీల రేట్లు ఎకానమీకి కొంత రిలీఫ్ ఇచ్చేవే. ఇన్ఫ్లేషన్ రిస్క్ తగ్గుముఖం పడుతున్న సూచనలుండటంతో రెపో రేటు విషయంలో ఆర్బీఐ కొంత మెతక వైఖరి చూపించొచ్చని ఎనలిస్టులు చెబుతున్నారు.