ఏపీ లిక్కర్ స్కామ్ కేసు. తెలుగు రాష్ట్రాల్లో ఈడీ సోదాలు..కీలక సూత్రధారి రాజ్ కేసిరెడ్డి అరెస్ట్

ఏపీ లిక్కర్ స్కామ్ కేసు. తెలుగు రాష్ట్రాల్లో ఈడీ సోదాలు..కీలక సూత్రధారి రాజ్ కేసిరెడ్డి అరెస్ట్

ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో సంచలన పరిణామం చోటుచేసుకుంది. ఈ మద్యం కుంభకోణంలో ఈడీ మరింత దూకుడు పెంచింది. గురువారం తెల్లవారుజాము నుంచి తెలుగు రాష్ట్రాల్లో సోదాలు చేసి   ఈ స్కామ్‌లో ప్రధాన సూత్రధారిగా, కింగ్‌పిన్‌గా భావిస్తున్న ప్రముఖ వ్యాపారవేత్త రాజ్ కేసిరెడ్డిని ఈడీ అధికారులు అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు.

గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో జరిగినట్లుగా చెప్తున్న ఈ మద్యం కుంభకోణం దర్యాప్తులో.. గురువారం ఉదయం నుంచే హైడ్రామా నడిచింది. హైదరాబాద్‌తో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లోని దాదాపు 10 ప్రాంతాల్లో ఈడీ అధికారులు ఏకకాలంలో దాడులకు దిగారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న ఆరుగురు ముఖ్య వ్యక్తుల నివాసాలు, కార్యాలయాలనే లక్ష్యంగా చేసుకుని సోదాలు ముమ్మరం చేశారు.

గత ప్రభుత్వ హయాంలో లిక్కర్ పాలసీ మార్పులు, మద్యం సరఫరా, టెండర్లలో భారీ ఎత్తున నిధుల మళ్లింపు జరిగినట్లు ఈడీ ప్రాథమికంగా గుర్తించింది. కేవలం అక్రమాలే కాకుండా.. వేల కోట్ల రూపాయలను హవాలా, మనీలాండరింగ్ మార్గాల ద్వారా చేతులు మార్చినట్లు బలమైన ఆధారాలు సేకరించింది. ఈ క్రమంలోనే ఇవాళ జరిగిన సోదాల్లో రాజ్ కేసిరెడ్డి నివాసం, ఆఫీసుల నుండి కీలకమైన డాక్యుమెంట్లు, హార్డ్ డిస్క్‌లు, డిజిటల్ డివైజ్‌లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

►ALSO READ | రికార్డ్ అంటే మాది..! నీకు నువ్వే సెల్ఫ్ సర్టిఫికెట్ ఇచ్చుకుంటే ఎలా చంద్రబాబు...? : వైఎస్ జగన్ 

రూ. 195 కోట్లకు పైగా ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టిన ఈ కేసులో.. మాజీ వైసిపి మంత్రి కరుమూరి నాగేశ్వరరావు, ఆయన కుమారుడి ఇళ్లలో కూడా దాడులు జరగడం, ఇప్పుడు ఏకంగా కింగ్‌పిన్ రాజ్ కేసిరెడ్డి అరెస్ట్ కావడంతో ఈ కేసు ఊహించని మలుపు తిరిగింది. రాజ్ కేసిరెడ్డిని కోర్టులో ప్రవేశపెట్టి.. కస్టడీలోకి తీసుకుని విచారిస్తే.. ఈ లిక్కర్ స్కామ్ వెనుక ఉన్న మరికొందరు పెద్దల జాతకాలు బయటపడే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.